షూటింగ్‌ పోదాం చలో చలో... | Star heroes are busy with Shootings in Tollywood | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ పోదాం చలో చలో...

Jan 21 2026 12:07 AM | Updated on Jan 21 2026 12:07 AM

Star heroes are busy with Shootings in Tollywood

ఓ వైపు నూతన సంవత్సరం జోరు. మరోవైపు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగలా భావించే సంక్రాంతి సందడి... ఈ సంక్రాంతికి విడుదలైన ప్రభాస్‌ ‘ది రాజా సాబ్‌’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, శర్వానంద్‌ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతున్నాయి. థియేటర్లలో సంక్రాంతి పండగ సందడి ఇంకా కనిపిస్తోంది.

ఈ పండగకి చిన్న విరామం తీసుకున్న మన హీరోలు సంక్రాంతి ముగియగానే ‘షూటింగ్‌ పోదాం చలో చలో’ అంటూ సెట్స్‌లో వాలిపోయారు. తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కొందరు హీరోలు విదేశాల్లో తమ మూవీ షూటింగ్స్‌లో జాయిన్‌ కాగా... వెంకటేశ్, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, విజయ్‌ దేవరకొండ, సాయిదుర్గా తేజ్‌ వంటి పలువురు హైదరాబాద్‌తో  పాటు పరిసర ప్రాంతాల్లో జోరుగా హుషారుగా షూటింగ్‌లో  పాల్గొంటున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం....  

వెంకటేశ్‌ బేగంపేటలో...  
‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్‌పుల్‌ డైరెక్టర్‌గా పేరు సం పాదించుకున్న త్రివిక్రమ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌ కెరీర్‌లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేట చిరాగ్‌ పోర్ట్‌లో జరుగుతోంది.

వెంకటేశ్‌తో  పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్‌. వెంకటేశ్‌ హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి’ కి త్రివిక్రమ్‌ మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ మూవీస్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’. ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్‌కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్‌ దిట్ట. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

మహేశ్‌బాబు గండిపేటలో...      
‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్‌ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్ర పా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కరడుగట్టిన, కమాండింగ్‌ ప్రతినాయకుడు కుంభ  పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.

అక్కడ ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుతో  పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పొడవాటి హెయిర్‌ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్‌ అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఎపిక్‌ అడ్వెంచర్‌ మూవీ ‘వారణాసి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు. గత నవంబరులో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వారణాసి’ గ్లోబల్‌ ట్రాటర్‌ ఈవెంట్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేయడంతో  పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరేలా చేసింది.

ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని హాలీవుడ్‌కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారట రాజమౌళి. ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పక్కా డేట్‌ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అప్‌డేట్‌ కోసం వేచి చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

‘వారణాసి’ విడుదల తేదీని ఈ ఏడాది శ్రీరామ నవమి (మార్చి 26న) సందర్భంగా ప్రకటించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాపై మహేశ్‌బాబు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ‘‘వారణాసి’ నా కలల ్ర పాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ గ్లోబల్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో మహేశ్‌బాబు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలుస్తోంది.      

ఎన్టీఆర్‌ ఆర్‌ఎఫ్‌సీలో...  
‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2, సలార్‌’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక  పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు  పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

పీరియాడికల్‌ యాక్షన్‌  డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌ ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో శరవేగంగా జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌. ఈ సెట్‌లోనే జరిగిన గత షెడ్యూల్స్‌లో ఓ నైట్‌ సాంగ్‌ని, ఓ యాక్షన్‌ సీక్వెన్స్ను కూడా చిత్రీకరించారని తెలిసింది. ప్రస్తుత షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. 

ఈ షెడ్యూల్‌ జనవరి ఆఖరు వరకు సాగుతుందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతోంది. మూడువేల మంది జూనియర్‌ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ  పాట... సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో వేసిన ఎన్టీఆర్‌ ఇంటి సెట్‌... ఇలా అన్నీ హైలెట్‌గా మారాయి. ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 25న  పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ‘కేజీఎఫ్, సలార్, మార్కో’ చిత్రాల ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.  

రామ్‌చరణ్‌ అజీజ్‌నగర్‌లో...      
రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా  పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్‌ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ కీలక  పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో సమీపంలోని అజీజ్‌ నగర్‌లో జరుగుతోంది.

రామ్‌ చరణ్‌తో  పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట బుచ్చిబాబు. ‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ‘పెద్ది’ చిత్రంలోనూ ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు రామ్‌చరణ్‌. ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. వింటేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో చరణ్‌ చేస్తున్న క్యారెక్టర్‌ తన కెరీర్‌లోనే ఇంట్రస్టింగ్‌ అని టాక్‌.

రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్‌ శరవేగంగా సాగుతోందని టాక్‌. అయితే ఓ వైపు షూటింగ్‌ జరగుతుండటం, మరోవైపు పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. కానీ ముందుగా ప్రకటించిన మార్చి 27నే ‘పెద్ది’ విడుదలవుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు రామ్‌చరణ్‌. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి...’  పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.  

విజయ్‌ దేవరకొండ గండిపేటలో...      
విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభని నిరూపించుకున్న రవికిరణ్‌ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రూరల్‌ యాక్షన్‌  డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. విజయ్‌ దేవరకొండ, కీర్తీ సురేష్‌లపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రవికిరణ్‌ కోలా. ‘‘రౌడీ జనార్థన’ కథ 1980 దశకం నేపథ్యంలో సాగుతుంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ క్యారెక్టర్‌లో విజయ్‌ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం విజయ్‌ తొలిసారిగా ఈస్ట్‌ గోదావరి యాసలో డైలాగులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇంత మాస్, బ్లడ్‌ షెడ్‌ ఉన్న క్యారెక్టర్‌ని ఆయన చేయలేదు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ విడుదల కానుంది.      

సాయిదుర్గాతేజ్‌ తుక్కుగూడలో..
‘విరూ పాక్ష’, ‘బ్రో’ వంటి హిట్‌ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక  పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్‌పై ‘హను–మాన్‌’ (2024) చిత్రంతో  పాన్‌ ఇండియన్‌ హిట్‌ అందుకున్న కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో  పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ జరుపుతున్నారు మేకర్స్‌. ఈ షెడ్యూల్‌లో సాయిదుర్గా తేజ్‌తో  పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు.

ఈ మూవీ షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. సాయిదుర్గా తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా 2025 అక్టోబరు 15న ‘అసుర ఆగమన’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తన  పాత్ర కోసం సాయిదుర్గా తేజ్‌ కండలు తిరిగిన దేహంతో, గుబురు గెడ్డంతో ఫుల్‌గా మేకోవర్‌ అయ్యారు. ఈ మూవీకి బి.అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నారు.  

నాని ముచ్చింతల్‌లో..    
నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. ‘దసరా’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్‌ బాబు, రాఘవ్‌ జుయల్‌ కీలక  పాత్రలు పోషిస్తున్నారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో నానితో  పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం  పాల్గొంటోంది. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. జనవరి నెలాఖరు వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగే అవకాశముందని తెలిసింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్‌ అనే శక్తిమంతమైన  పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్‌ లుక్‌లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది.

నాని లుక్, స్టోరీ, టేకింగ్‌... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్‌ ఓదెల. ఈ సినిమాని తెలుగుతో  పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే మార్చి 27న రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలవుతుండటంతో డేట్స్‌ క్లాష్‌ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ మూవీ రిలీజ్‌ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఈ విషయాలపై చిత్ర నిర్మాత సుధాకర్‌ చెరుకూరి స్పష్టత ఇచ్చారు. ‘‘ది ప్యారడైజ్‌’ చిత్రీకరణ 60 శాతం పూర్తయింది. సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశాం.  పాటలు, ఫైట్స్‌ దాదాపు పూర్తయ్యాయి. అయితే టాకీ  పార్ట్‌ మాత్రమే పూర్తవ్వాల్సి ఉంది. అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. అయితే ‘పెద్ది’ సినిమాతో పోటీ పడి మా ‘ది ప్యారడైజ్‌’ని విడుదల చేయం. రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్‌ చేయకుండా వేర్వేరు తేదీల్లో రిలీజ్‌ చేసే ΄్లాన్‌ చేసే ఆలోచన  కూడా ఉంది’’ అని సుధాకర్‌ చెరుకూరి తెలి పారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.  

పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిన్న, పెద్ద సినిమాలు కూడా హైదరాబాద్‌లో, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.  
– డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement