ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తోన్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శ్రీరస్తు'. ఈ మూవీని హరి క్రియేషన్స్ పతాకంపై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతకు ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఓకేసారి తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే కామెడీతో ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. హీరో, హీరోయిన్ పాత్రల మధ్య ప్రేమకథ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో సుమన్, దేవి ప్రసాద్, అమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.


