మైసూర్‌లో మెరిశారు శ్రీలీల. ఎక్కడంటే ‘ధర్మన్’ షూటింగ్ లొకేషన్‌లో. లంగా, ఓణీలో సంపద్రాయబద్ధంగా కనిపించారీ బ్యూటీ. ఈ సెట్‌లో శ్రీలీలని ఎవరో రహస్య కెమెరాలో క్లిక్‌మనిపించి, ఆ వీడియోను వైరల్ చేశారు. దాంతో ‘ధర్మన్’ సినిమాలో ఆమె నటిస్తున్నారని స్పష్టమైంది. రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్ర చేస్తున్నారు. సిమ్రాన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మంగళవారం ఇదే సినిమా సెట్స్ నుంచి రజనీకాంత్‌తో తాను, రామ్ కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ తర్వాత తీసేశారు రాశీ ఖన్నా. ఆ విధంగా ఈ చిత్రంలో రామ్ కీలక పాత్రలో కనిపించనున్నారనే టాక్ మొదలైంది. తాజాగా ఈ సెట్స్‌లో శ్రీలీల ఉన్న వీడియో బయటకు రావడంతో ఆమె కూడా కీలక పాత్ర చేస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో కనిపిస్తారా? లేక కొన్ని నిమిషాలు కనిపించే స్పెషల్ రోల్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.


