వెంకట కృష్ణ, జానకిరామ్, కోన వెంకట్, శ్రీవిష్ణు, ఛోటా కె. ప్రసాద్
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ హీరో హీరోయిన్లుగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో రూ పొందిన సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో చాలా సినిమాలు చేశాను.
దీంతో మాస్ కామెడీ సినిమా అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకునేవాడిని. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని అన్నారు.‘‘కామ్రేడ్ కళ్యాణ్’ను హిలేరియస్ ఎంటర్టైన్మెంట్‌గా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు’’ అని కోన వెంకట్ తెలిపారు. ‘‘సినిమా చాలా బాగుందని మంచి టాక్ వస్తోంది. ఈ దసరాకు శ్రీ విష్ణు, కోనగార్ల నుంచి ప్రేక్షకులకు అందిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ సినిమా’’ అని తెలిపారు వెంకట కృష్ణ కర్నాటి. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు జానకిరామ్.


