వెంకటకృష్ణ కర్నాటి, కోన వెంకట్, శ్రీ విష్ణు
‘‘కామ్రేడ్ కళ్యాణ్’ ఒక పీరియడ్ సినిమా. 90లలో జరిగిన ఒక ఘటనకి ఫిక్షన్ జోడించి కోన వెంకట్‌గారు ఒక అద్భుతమైన కథని సిద్ధం చేశారు. ఈ చిత్రం కోసం ఒక కొత్త భాషను మాట్లాడాను... దాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ఒరియా పిల్ల...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని శనివారం నిర్వహించారు.
ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. షూటింగ్ సమయంలో నాతో పాటు అందరూ చాలా సరదాగా పని చేశాం’’ అన్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘శ్రీ విష్ణు ఈతరం ఆల్‌రౌండర్. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయాలనే లక్ష్యంతో పని చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.
‘కామ్రేడ్ కళ్యాణ్’ వంద శాతం విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది’’ అన్నారు జానకి రామ్. ‘‘ఈ సినిమాలో మంచి వినోదంతో పాటు చక్కని సంగీతం ఉంది’’ అని వెంకటకృష్ణ కర్నాటి చెప్పారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, నటుడు షైన్ టామ్ చాకో, లిరిక్ రైటర్ భాస్కరభట్ల, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, రచయిత బీవీఎస్ రవి మాట్లాడారు.


