
అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni ) అకస్మాత్తుగా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా వైరల్‌గా మారారు. దీనికి కారణం ఆయన తాజాగా నటించిన కూలీ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ లాంచ్ అయి సూపర్ డూపర్ హిట్ అంచనాలను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ టీజర్‌లో నాగార్జున లుక్ బాగా క్లిక్ అయింది. నాగార్జున తన సినీ జీవితంలో తొలిసారిగా విలన్ గా నటిస్తుండడం దక్షిణాది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అందుకు తగ్గట్టే నాగార్జున రోల్ అత్యంత స్టైలిష్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తుండడం కూడా నాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది. నిజానికి ఈ సినిమా లో విలన్ పాత్ర ను ఎంచుకోవడం పట్ల మొదట్లో నాగ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడ్డారనేది నిర్వివాదం. అయితే తాజా అప్ డేట్స్‌తో వారిలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది.
ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున తన వయసులో సగం తగ్గిపోయినట్టు కనపడ్డారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని నాగ్ స్వయంగా చెప్పడం, తాను నాగార్జున అభిమానినని లోకేష్ అనడం... కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రీ రిలీజ్‌లో నాగ్ లుక్, ఆయన మాటలు ఆయన గురించి తలైవా రజనీ కాంత్ పొగడ్తలు... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో నాగార్జున తన హెయిర్‌ని కుడి చేత్తో వెనక్కి తోస్తున్న బిట్‌ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఏతావాతా కూలీ సినిమా విడుదలకు ముందే ఒక విషయం మాత్రం రూఢీ అయిపోతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అనూహ్యంగా ఉండబోతోందని. రజనీకాంత్ లాంటి వీర మాస్ హీరోకి సమ ఉజ్జీగా ఆయన తెరపై విలన్ రోల్‌లో దుమ్మురేపనున్నారని.
ఈ నేపధ్యంలో మరోసారి సీనియర్ హీరోల పాత్రల ఎంపిక ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో పాటు ఆయన సమకాలీకులు ఒకనాటి అగ్ర హీరోలు ముగ్గురు ఇంకా ఫుల్ యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరెవరూ సాహసించని రీతిలో నాగార్జున తన పాత్రల ఎంపికను అమాంతం మార్చుకుని ఈ విషయంలో అందర్నీ దాటేశారు. సీనియర్ హీరోల్లో నాగార్జున గ్లామర్‌తో పోటీపడే వారు ఎవరూ లేరనేది నిజం. అయినప్పటికీ వయసుకు తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు.
కుబేర సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించి, కూలీ లో ఏకంగా విలన్ పాత్రకు కూడా సై అనడం ద్వారా ఒక నటుడికి సినిమా కలెక్షన్లు, ఇమేజ్‌లు మాత్రమే కాదు వైవిధ్య భరిత పాత్రల్లో నటించానన్న తృప్తి కూడా చాలా అవసరమని చెప్పకనే చెప్పారు. నిన్నే పెళ్లాడుతా తో గ్రీకు వీరుడి ఇమేజ్ తెచ్చుకుని వెంటనే అన్నమయ్య లాంటి పాత్ర చేసిన నాటి దమ్మూ ధైర్యం, తెగువనే ఇప్పటికీ చూపిస్తున్నారు నాగార్జున. అందుకే.. టాలీవుడ్ చరిత్ర లో తొలిసారిగా... సినిమా విడుదల కాకముందే జనం మనసులు గెలిచిన విలన్ అనిపించుకుంటున్నారు.