
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. సల్మాన్ ఖాన్‌తో ఓ మూవీ సెట్‌లో ఎదురైన సంఘటనను ఇటీవలే వెల్లడించింది. ఆ సమయంలో అతనిపై విపరీతమైన కోపం వచ్చేదని తెలిపింది. అయితే తన క్యాన్సర్ చికిత్స సమయంలో అమెరికా వచ్చి తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడని కూడా చెప్పుకొచ్చింది.
తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 20 ఏళ్ల క్రితం తనను ఇష్టపడ్డారన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి సోనాలి బింద్రే స్పందించారు. ఈ వార్తలపై సోనాలి అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఎప్పుడూ అలాంటి వార్తలను పట్టించుకోలేదని సోనాలి తెలిపింది.
సోనాలి మాట్లాడుతూ.. 'నాపై ఇలాంటి ప్రచారం జరిగినట్లు నాకే తెలియదు. కొందరు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్ థాకరే భార్య షర్మిలా, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరు కుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది. అలా ఇరు కుటుంబాల మధ్య నా చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే ఉందని' తెలిపింది. కాగా.. సోనాలి బింద్రే చివరిసారిగా 'ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2'లో కనిపించింది. ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.