
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సీతార ఘట్టమనేని(Sitara Ghattamaneni) పేరు ఇప్పుడు ప్రకటనల ప్రపంచంలో మార్మోగుతోంది. అయితే ఓ అగ్రనటుడి కుమార్తెగానో లేక బాల నటిగానో కాదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన యాడ్ ఫేస్‌గా ఆమె సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసడర్‌గా, యాడ్ మోడల్‌గా ఆమె చూపిస్తున్న టాలెంట్‌కు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఆమె వయస్సు కేవలం 11 ఏళ్లు మాత్రమే అయినా, చూపే ప్రొఫెషనలిజం, కెమెరా ముందు చూపుతున్న కాన్ఫిడెన్స్ చూసి యాడ్ రూపకర్తలు ఆమెవైపు అమితంగా ఆకర్షితులవుతున్నారు.

సీతార కెమెరా ముందు మొదటిసారి కనిపించింది ఓ ఫ్యామిలీ యాడ్‌లో. అందులో తన తల్లి నమ్రత శిరోద్కర్, తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రచారంలో కనిపించింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, బ్రాండ్‌కు పెద్దగా ప్రాచుర్యం వచ్చింది.అప్పటి నుంచి సీతారకు యాడ్స్ ఆఫర్లు వెల్లువెత్తడం ప్రారంభమైంది. అనుకోకుండా చేసిన యాడ్‌తో వచ్చిన పాప్యులారిటీతో ఇతర బ్రాండ్లు కూడా ఆమెను సంప్రదించాయి. ఆ తర్వాత ఆమె ‘బేబీ స్కిన్ కేర్‘, ‘ఎడ్యుకేషన్ ప్యాకేజింగ్‘, ‘ఫ్యాషన్‘ వంటి విభాగాల్లో చేసిన యాడ్స్ లక్షల సంఖ్యలో వ్యూస్ ఆదరణ సాధించాయి. పిఎంజె జ్యూయల్స్, ఒట్లో క్లోతింగ్, టాటా సంపన్న్ జూనియర్ ఫుడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మామిఎర్త్, జీ తెలుగు ఫ్యామిలీ ప్రోమో, ట్రెండ్స్... ఇలా అనేక టాప్ బ్రాండ్స్‌లో ఆమె కనిపిస్తోంది. వీటిలో తన డాడీ మహేష్‌తో కలిసి చేసిన ట్రెండ్స్ సంస్థ యాడ్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.

యాడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, సీతార ఒక్కో యాడ్ కు రూ. 15 – 25 లక్షల వరకు పారితోషికం( Remuneration) అందుకుంటోంది. వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్ల పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆదాయం ప్రత్యేకంగా ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఖాతాలో వేస్తున్నామని, ఈ మొత్తం భవిష్యత్తులో ఆమె విద్య, క్రియేటివ్ అభిరుచుల విస్త్రుతికి ఉపయోగించనున్నట్లు సమాచారం.
కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ కావడంతో పాటు అమాయకత్వంతో కూడిన గ్లామర్ సితారకు ప్లస్ అవుతోంది. అలాగే తండ్రి, తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అభినయ ప్రతిభ కూడా ఆమెకు మరో బలం. ముఖ్యంగా తల్లి నమ్రత శిరోద్కర్ గతంలో మిస్ ఇండియా గా ఉన్నందున, ఫ్యాషన్, కెమెరా నైపుణ్యాల్లో తల్లి గైడెన్స్ ఆమెకు బాగా ఉపయోగపడుతోంది.

ఇంతింతై..సితార స్టారై...
ఇప్పటికే సితార పేరుతో ఇంటర్నెట్‌లో ప్రత్యేక ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఆమె ఏ వీడియో వదిలినా మిలియన్ల వ్యూస్ వస్తాయి. ప్రస్తుతం తను పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది, అయితే యాడ్ ఫిల్మ్స్‌ను పేషన్‌గా తీసుకుంటోందో లేక రేపటి బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రిహార్సల్‌గా తీసుకుంటుందో గానీ... తెరపై నైపుణ్యం పెరిగే కొద్దీ, ఆమె పెద్ద తెరపై నటిగా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ‘చైల్డ్ లీడ్ రోల్‘లో తీసుకోవాలని కొందరు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
చిన్న వయసులో పెద్ద నెపథ్యంతో తెరపైకి వచ్చినా, ఆమె చూపిస్తున్న ప్రతిభ మాత్రం పూర్తిగా ఒరిజినల్. ఇదే విధంగా తండ్రి స్టార్ పవర్, తల్లి గైడెన్స్, తన స్వంత ప్రతిభ మేళవిస్తూ సితార కొనసాగితే ఆమె చరిత్ర సృష్టించకుండా అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు యాడ్ ప్రపంచంలో చైల్డ్ ఐకాన్ గా ఆమె సృష్టిస్తున్న సందడి చూస్తుంటే, అప్పుడే ఏమైంది? ‘‘ఇంకా చాలా ఉంది చూడడానికి!’’ అనిపించడం మాత్రం ఖాయం.