
కోలీవుడ్ హీరో జయం రవి తన భార్యతో విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో హాజరయ్యారు. అయితే ఇటీవలే జయం రవి భార్య ఆర్తి పలు ఆరోపణలు చేసింది. మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోవాల్సి వస్తోందని ఓ లేఖను విడుదల చేసింది. ఎందుకంటే జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలంగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ కెనీషా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు అలాంటి సందేశాలు పంపుతున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు ఆమె టీమ్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
కెనీషా పరువుకు భంగం కలిగించేలా సందేశాలు పంపినా, బెదిరించినా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన సందేశాల వల్ల ఆమె మానసికంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అలాంటి మెసేజ్‌లు పంపితే ఆ స్క్రీన్‌షాట్‌లను ఆధారంగా చేసుకొని నోటీసులు పంపుతామని వెల్లడించింది. ఇలాంటి పనులు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ పంపే నోటీసులను సింగర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.