
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda ).. వరుస హిట్లతో స్పీడు మీదున్న ఈ హీరోకు జాక్ మూవీ (Jack Movie)తో సడన్ బ్రేక్ పడింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ కాలేకపోయారు. దీంతో జాక్.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మంచి పని చేసిన సిద్ధు
దీంతో నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ.36 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడంతో సిద్ధు ఓ నిర్ణయం తీసుకున్నాడట. జాక్ కోసం తొమ్మిదిన్నర కోట్ల పారితోషికం తీసుకున్న సిద్ధు అందులో సగాన్ని నిర్మాతలకు వెనక్కు ఇచ్చేశాడట! దాదాపు రూ.4.75 కోట్లను బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కు తిరిగిచ్చేశాడని తెలుస్తోంది.

చూసి నేర్చుకోండి
సిద్ధు చేసిన మంచిపనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతల నష్టాల్ని పూడ్చేందుకు సగం రెమ్యునరేషన్ వదులుకున్న టిల్లు మనసు బంగారం అని కొనియాడుతున్నారు. చాలామంది హీరోలు సిద్ధును చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు.. తెలుసుకదా సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు!