‘సీతా కల్యాణం’లో రవి, జయప్రద, కైకాల సత్యనారాయణ
దేశదేశాలు మెచ్చిన... మన పౌరాణిక దృశ్యకావ్యం
దర్శకుడు బాపు తనకు అత్యంత ఇష్టమైన చిత్రాలలో ఎప్పుడూ ఓ పేరు చెబుతూ ఉండేవారు. అది – స్వీయ దర్శకత్వంలో, ఎన్టీఆర్ రావణుడిగా నటించి, నిర్మించిన ‘సీతారామ కల్యాణం’ (1961). దర్శకుడిగా ఎన్టీఆర్‌కు అదే తొలి చిత్రం. ఆ వెండితెర రామాయణ గాథ బాపు మనసుపై ఎంత ప్రగాఢమైన ముద్ర వేసిందంటే, దశాబ్దిన్నర తర్వాత ఆ కథాంశాన్నే ‘సీతా కల్యాణం’గా తెరకెక్కించారు. అదీ ఎంతో సాహసంతో... సామాన్య సినీ జనాభిరుచిని పక్కకుపెట్టి, దృశ్య, సంగీత ప్రధానంగా రూపొందించారు. సినీ ప్రముఖుడు పింజల సుబ్బారావు కుమారుడు పింజల ఆనందరావు నిర్మాతగా వ్యవహరించారు.

‘సీతా కల్యాణం’లో రవి, జయప్రద, కైకాల సత్యనారాయణ
ఇది పాటల కల్యాణం!
ఎన్టీఆర్ ‘సీతారామ కల్యాణం’ ప్రధానంగా శివపురాణం ఆధారంగా నంది శాపం, వేదవతి వృత్తాంతం లాంటి వాటితో నడుస్తుంది. ఇటు అందాల రాముడు (నూతన నటుడు హరనాథ్), అటు ఆభిజాత్య రావణబ్రహ్మ (ఎన్టీఆర్)... ఇద్దరూ తెరపై గొప్పగా కనిపిస్తూ, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. అయితే, ఏ పాత్రా ప్రత్యర్థి పాత్రపై పై చేయి చూపదు. బాపు ‘సీతా కల్యాణం’ మాత్రం రామ, రావణ పాత్రల కన్నా ప్రధానంగా విశ్వామిత్రుడి కథాకథనంలో నడుస్తుంది.
రాముడి కథ కన్నా గంగావతరణం, త్రిపురాసుర వధ, త్రివిక్రమ రూపం ధరించి బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన వామనావతారం లాంటి అనేక ఘట్టాలను తీసుకొని, ఓ మంచి దృశ్యకావ్యంగా మలిచారు బాపు.
స్వతహాగా డైలాగుల్లో మరపురాని విన్యాసాలకు పేరుబడ్డ ముళ్ళపూడి వెంకట రమణ సైతం ‘సీతా కల్యాణం’లో మాత్రం బాపు ఆలోచనకు తగ్గట్టే మాటలు తక్కువ, పాటలు ఎక్కువగా ఉండేలా కథ, కథనాన్ని స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిపించారు. చిత్రంలో డైలాగులంతా కలిపి పది, పన్నెండు పేజీలే. సినిమాను పూర్తిగా ఓ సంగీత, దృశ్య రూపకంలా రూపొందించారు.
1975 విజయదశమి నాడు ఇటు బాపు ‘సీతాకల్యాణం’ పాటల రికార్డింగ్, అటు బాపు దర్శకత్వంలోనే హీరో కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ పాటల రికార్డింగ్... రెండూ మొదలయ్యాయి. ‘భక్త కన్నప్ప’ త్వరితగతిన షూటింగ్ ముగించుకొని, మరుసటేడు మే 29న విడుదలైంది. ‘సీతా కల్యాణం’ మాత్రం కొంత జాప్యమై, జూలై 16న జనం ముందుకు వచ్చింది. కళాత్మక విలువలు తెలిసిన కళాహృదయులకు తాము సినిమా చూస్తున్నట్టు అనిపించ లేదు. తెర మీద కనిపిస్తున్న ఆ రామాయణ సన్నివేశాల్లో తామూ సంచరిస్తున్నట్టు అనిపించింది. ఆ సన్నివేశాల చుట్టూనే మనసు పరిభ్రమించింది. అదీ బాపు– రమణల ‘సీతాకల్యాణం’ గొప్పతనం.

∙బాపు–రమణ
మలయాళ రాముడు – ముగ్ధమోహన సీత
నిజానికి, ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రకు మొదట హీరో రామకృష్ణను ఎంపిక చేశారు. తర్వాత ఎందువల్లో ఆ నిర్ణయం మార్చుకున్నారు. సినీ శ్రీరాముడిగా సుప్రసిద్ధుడైన ఎన్టీఆర్‌తోనూ, అలాగే అందాల నటుడు శోభన్‌బాబుతోనూ అంతకు ముందు రామాయణ గాథలు తీసిన బాపు – రమణలు చివరకు శ్రీమద్రామాయణంలోని బాలకాండలోని ఘట్టాల చుట్టూ తిరిగే ‘సీతా కల్యాణం’ కోసం తెలుగు తెరకు నవ యువకుడైన కొత్త రాముణ్ణి పరిచయం చేశారు. ఏరికోరి... కంటికి నదురుగా, కెమెరాకు అందంగా కనిపించే మలయాళీ యువకుడు రవికుమార్‌ను ఆ పాత్ర కోసం పట్టుకొచ్చారు. అప్పట్లో అది సంచలనమే. శ్రీమహావిష్ణువుగా, శ్రీరాముడిగా రవి కనువిందు చేశారు.
ఇక, అప్పటికే విజయా వారి ‘శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ రూపకల్పనతో దర్శకుడు బాపుకు పరిచయమైన లలిత లావణ్య యువ నటి జయప్రదను సీత పాత్రకు తీసుకున్నారు. లక్ష్మీదేవిగానూ ఆమె కనిపిస్తారు. అందంతో పాటు అభినయంతోనూ ఆ టీనేజ్ సీత పాత్రకు జయప్రద ప్రాణం పోశారు. రావణాసురుడిగా నిండైన విగ్రహం, మంచి వాచికం ఉన్న కైకాల సత్యనారాయణ సరేసరి.

్రపాణం పోసిన ప్రతిభావంతులు!
‘సీతా కల్యాణం’ చిత్రీకరణ అంతా కెమెరా కుంచెతో వెండితెర క్యాన్వాస్పై పెయింటింగ్ వేసినట్లు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకు మచ్చుతునకలు సినిమాలో వచ్చే గంగావతరణం, శివధనుస్సు వృత్తాంతం లాంటి ఎన్నెన్నో. బాపు దర్శకత్వానికి కళాదర్శకత్వం (కుదరవల్లి నాగేశ్వరరావు), కె.ఎస్. ప్రసాద్ ఛాయాగ్రహణం, రవికాంత్ నగాయిచ్ తాంత్రిక ఛాయాగ్రహణం పెద్ద ఎస్సెట్. ఈ సినిమాలో కె.వి. మహదేవన్ సంగీతం గురించి, సినారె, ఆరుద్రలు అందించిన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇవాళ దేశమంతటా చెప్పుకుంటున్న సినిమా... ‘రామాయణం’. అత్యంత భారీయెత్తున నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సినిమా. సీతారాములుగా రణబీర్ కపూర్, సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటించగా మరో అయిదు రోజుల్లో దీపావళి కానుకగా వస్తున్న ఆ రెండు భాగాల సినిమాకు కొన్ని వందల కోట్లు ఖర్చయింది. కానీ, 50 ఏళ్ళ క్రితమే తెలుగు దర్శక, నిర్మాతలు, రచయితలు కలసి కొన్ని లక్షల్లోనే వెండితెరపై పునఃసృష్టించిన ఓ రామాయణ గాథ ప్రపంచమంతటా ప్రశంసలు అందుకుందని తెలుసా? ఆ సినిమా... బాపు–రమణలు జరిపిన వెండితెర ‘సీతా కల్యాణం’. ఆ వన్నెతరగని దృశ్యకావ్యానికి ఇప్పుడు 50 వసంతాలు. పాశ్చాత్యులు సినిమా పాఠంగా పెట్టుకున్న ఈ అచ్చమైన భారతీయ సినీ ఆణిముత్యానికి ఇది అక్షర నీరాజనం.

ఆ దేశంలో సినిమా పాఠంగా...
‘షికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో భాగంగా 1978 నవంబర్ 5న ఆ నగరంలోని విలేజ్ థియేటర్లో ‘సీతా కల్యాణం’ సినిమాను ప్రదర్శించారు. తెరపై ఈ రామాయణ దృశ్యకావ్యాన్ని చూడాలని దేశం నలుమూల నుంచి జనం వచ్చారట. అప్పట్లో బెర్లిన్, శాన్రెనో, డెన్వర్లలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ఈ చిత్రం భాగమైంది.
ఇక, ఈ చిత్రాన్ని నాలుగు భాగాలుగా చేసి, సుప్రసిద్ధ టీవీ ఛానల్ బి.బి.సి.లో ‘సీతాస్ వెడ్డింగ్’ పేరుతో టెలికాస్ట్ చేయడం మరో విశేషం. ‘సీతా కల్యాణం’ చిత్రాన్ని ఆ రోజుల్లోనే ‘బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ (బి.ఎఫ్.ఐ)లో విద్యార్థులకు కోర్సు వర్కులో భాగంగా పాఠం కింద పెట్టారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన ఘనత అది.
అమ్మ చెప్పిన అరుదైన మాట
బాపు – రమణలది ఎంతటి అనుబంధమో అందరికీ తెలుసు. కొందరికే తెలిసింది ఏమంటే... బాపు వాళ్ళ అమ్మ గారికి కూడా రమణ అంటే వల్లమాలిన అభిమానం. ‘‘నాకు ఇంతమంది కొడుకులున్నా, రమణే నా పెద్దకొడుకు అనేవార’’ట ఆవిడ. లండన్, షికాగో ఫెస్టివల్స్‌లో ‘సీతా కల్యాణం’ ప్రదర్శన సందర్భంగా బాపు మొదటిసారిగా విదేశీ ప్రయాణం చేశారు. ప్రయాణమై వెళ్ళబోతూ, తల్లి కాళ్ళకు దణ్ణం పెట్టారు. ‘‘నీకు కాస్త పేరు ఏదైనా వస్తే అంతా (ముళ్ళపూడి వెంకట) రమణ చలవే... అతని వల్లే! అతనికి దణ్ణం పెట్టు’’ అంది ఆ మహాతల్లి. స్నేహంతో పాటు పరస్పర గౌరవం నిండిన అపూర్వమైన మిత్రద్వయం వారు అనేది అందుకే!
సత్యజిత్ రే కార్పెట్ పక్క! క్రోటన్ మొక్క!
ఓసారి ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సుప్రసిద్ధ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే వచ్చారు. ఆరుద్ర, లండన్ ‘గార్డియన్’ పత్రిక సినీ విమర్శకుడు డెరెక్ మాల్కమ్లు ఆయనకు బాపును పరిచయం చేశారు. ‘సీతా కల్యాణం’ ఫెస్టివల్స్‌కు వెళ్ళిన సంగతి తెలిసిన రే అబ్బురపడి, అడిగి మరీ ఆ సినిమా వేయించుకుని చూశారు.
తీరా సినిమా చూశాక, ‘‘సీత కూర్చున్న కార్పెట్ ఇండియన్ డిజైన్ కాదు... పర్షియన్. సీత తోటలో క్రోటన్ మొక్కలు కనిపించాయి. రామాయణ కాలంలో క్రోటన్ మొక్కలు లేవు’’ అనేసి వెళ్ళిపోయారట. ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ముళ్ళపూడి సరదాగా ఆ సంఘటన చెబుతుండేవారు. ‘‘ఆ రెండు పాయింట్లే కనిపించాయంటే, ఆ రెండు మినహా మిగతా సినిమా అంతా పర్ఫెక్ట్ అని అర్థం కదా’’ అని నవ్వేసేవారు.

సీరియల్ తప్పిపోయిన శ్రీరాముడు
‘సీతా కల్యాణం’ రావడానికి ముందే తమిళం నుంచి తెలుగులోకి జగపతి పిక్చర్స్ వారు అనువాదం చేసిన ‘దశావతారములు’ (1976 జూన్ 18) చిత్రంలోనూ మలయాళ నటుడు రవి కుమార్ శ్రీమహావిష్ణువు పాత్రలో అలరించారు. అటుపైన ‘సీతా కల్యాణం’లో అందాల రాముడిగా తెరపై ఒదిగిపోయారు. ‘సీతా కల్యాణం’ తర్వాత సీత, రామ, రావణ పాత్రధారులను మళ్ళీ అవే పాత్రలకు తీసుకొని, అదే నిర్మాత పింజల సుబ్బారావు మరో పౌరాణికం ‘సీతారామ వనవాసము’ (1977 మార్చి 31) కూడా నిర్మించారు. ఈసారి దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ సినిమా కూడా ఆడలేదు.
జయాపజయాలు ఎలా ఉన్నా, రాముడిగా రవికుమార్ అందమైన రూపానికి సామాన్య జనమే కాదు... బాపు – రమణలు కూడా మురిసిపోయారు. ఎంతలా అంటే, ఆ సినిమా వచ్చిన దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకు తర్వాత ఆ స్నేహద్వయం ‘శ్రీభాగవతం’ టీవీ సీరియల్ తీస్తూ, ఎలాగైనా మళ్ళీ రవిని తీసుకొని విష్ణుమూర్తి, శ్రీరాముడు లాంటి పాత్రల్లో చేయించాలని విశ్వప్రయత్నం చేశారు. టీవీ వాళ్ళతో కేరళ అంతటా విచారించినా, రవి ఆచూకీ పట్టుకోలేకపోయారు. అలా ఆ ఆశ తీరలేదు.
కాలాన్ని సవాలు చేసిన సినిమా!
ఏది ఏమైనా, ‘సీతా కల్యాణం’ అప్పటికీ ఇప్పటికీ కళాత్మకంగా కథను తెరపై దృశ్యమానం చేయడంలో ఓ క్లాసిక్‌గా మిగిలిపోయింది. దర్శక – నిర్మాతలకే కాదు... తెలుగు సినీ ప్రియులకు సైతం మనసు నింపిన సినిమాగా నిలిచిపోయింది. నేటికీ జనం చెప్పుకొనే చిత్రంగా చిరంజీవిగా మారిపోయింది. నాటి పత్రికలు ఒక్క ముక్కలో తేల్చేసినట్టు... బాపు ఇంత (అంత)వరకు రూపొందించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు, ‘సీతా కల్యాణం’ ఒకటే ఒక ఎత్తు.
– ఆర్. జయ
కవి కాంచనిది... రవి గాంచును!
బాపు భావుకతకు తన తాంత్రిక ఛాయాగ్రహణం జోడించి, రవికాంత్ నగాయిచ్ ఈ ఈస్ట్‌మన్ కలర్ ‘సీతా కల్యాణం’ని మరింత కన్నులపండుగ చేశారు. భారతదేశంలో ట్రిక్ ఫోటోగ్రఫీలో గురుతుల్యుడు బాబూభాయ్ మిస్త్రీ అయితే, గురువును మించిన శిష్యుడు రవికాంత్. బాపు ‘సంపూర్ణ రామాయణం’, అంతకు మించి ‘సీతా కల్యాణం’ వెండితెరపై రవికాంత్ కెమెరా మాయకు మచ్చుతునకలు.
అసలు రవికాంత్ తెలుగుతెరపై తొలిసారి ఛాయాగ్రహణ దర్శకుడు అయినదే ఎన్టీఆర్ ‘సీతారామ కల్యాణం’తో! దశాబ్దిన్నర తర్వాత ఈ బాపు ‘సీతా కల్యాణం’ కూడా ఆయనకే దక్కింది. ‘‘రవికాంత్ నగాయిచ్ కెమెరా చేసిన రంగుల లయ విన్యాసం మరపురానిది. మళ్ళీ మళ్ళీ చూడదగినది. గంగావతరణ ఘట్టం చిత్రానికంతా హైలైట్’’ అని ఆ రోజుల్లో పత్రికలు వేనోళ్ళ కొనియాడాయి.
చాక్ పీస్ పొడితో సూపర్ ఎఫెక్ట్!
ముఖ్యంగా, ‘సీతా కల్యాణం’ కోసం సినారె కలం నుంచి జాలువారిన గంగావతరణ గీతాన్ని బాపు ముందుగా తన చిత్రలేఖనం ద్వారా బొమ్మకట్టారు. ఆపైన రవికాంత్ నగాయిచ్ చాతుర్యంతో వెండితెరపైకి అపూర్వంగా తీసుకొచ్చారు. దివి నుంచి భువికి గంగ ఉరకలెత్తుతూ వచ్చే జలపాత దృశ్యం సహజంగా అనిపించడం కోసం ఆ కెమెరా మాంత్రికుడు నీళ్ళు విరజిమ్మ లేదు. కామన్ సెన్స్‌తో ఓ చిన్న ట్రిక్ చేశారు. బస్తాల కొద్దీ చాక్‌పీస్ పొడి తెప్పించారు. స్టూడియోలో పైన అటక మీదకు ఎక్కించి, ఓ క్రమపద్ధతిలో కిందకు గుమ్మరించారు. అలా ఆ సుద్దపొడే అచ్చం ఆకాశగంగలా తెరపై ప్రత్యక్షమైంది.
కమర్షియల్ ఫ్లాప్! క్లాసిక్ ఫిల్మ్ స్టేటస్!
అప్పట్లో కేవలం 14 లక్షల రూపాయల్లో ‘సీతా కల్యాణం’ నిర్మాణం జరిగింది. ఇంకా విశేషం ఏమిటంటే, ఈ పౌరాణిక సినిమా తీస్తున్నప్పుడు నిర్మాతకు డబ్బు ఇబ్బంది అయింది. బాపు – రమణల రామభక్తి, సినిమా ప్రేమ ఎంతటివంటే, అయిదు లక్షలకు మూడు జిల్లాల హక్కులు కొని, డిస్ట్రిబ్యూటర్ నుంచి అడ్వాన్సు తెచ్చి మరీ డబ్బు సర్దారు. రాజీ పడకుండా సినిమా రూపొందించారు. సినిమా పూర్తయ్యాక బాగా వచ్చిందని భావించి, నటీనటుల్లో కొందరు కొన్ని ఏరియాలకు సినిమా తీసేసుకున్నారట. తీరా పిక్చర్ విడుదలయ్యాక చూస్తే, డైలాగ్ బేస్డ్ సినిమాలకు అలవాటు పడ్డ జనం... అంతా పాటలమయమైన ఈ సంగీత ప్రధాన చిత్రాన్ని మెచ్చలేదు. సినిమా ఫ్లాపైంది.
నిజానికి, ‘సీతా కల్యాణం’కు సరిగ్గా ఏడాది ముందు బాపు – రమణల ‘ముత్యాలముగ్గు’ (1975 జూలై 25న రిలీజ్), అలాగే నెలన్నర ముందు ‘భక్త కన్నప్ప’ (1976 మే 29) వచ్చాయి. రెండూ సూపర్ హిట్టయ్యాయి. కానీ ‘సీతా కల్యాణం’ భిన్నమైన స్పందనను ఎదుర్కొంది. విజయవాడ, గుంటూరు లాంటి అనేక ప్రధాన సెంటర్లలో సైతం నాలుగైదు వారాలకే హాళ్ళ నుంచి ‘సీతా కల్యాణం’ సర్దుకుంది.
అప్పట్లో పౌరాణికాలకు ఒకింత ఎక్కువ ఆదరణ చూపిన ఒక్క హైదరాబాద్ కేంద్రంలో మాత్రం సుదర్శన్ థియేటర్లో అత్యధికంగా 49 రోజులు ఆడింది. మొత్తానికి, నిర్మాతకు పెట్టుబడి వచ్చేసింది కానీ, బాపు – రమణలకు 4 లక్షలు పోయాయి. మంచి సినిమా తీశామనే సంతోషం, సంతృప్తి మాత్రం మిగిలాయి. కాలం గడిచేకొద్దీ... ‘సీతా కల్యాణం’ కమర్షియల్ హిట్‌ను మించి క్లాసిక్ హోదాను సొంతం చేసుకొని, ఆశ్చర్యపరిచింది. హిందీలో ‘సీతా స్వయంవర్’ పేరుతో, మలయాళంలో ‘సీతా స్వయంవరం’గా అనువాదమైంది.
ఆర్థికంగా నిల్లు! అభినందనలు ఫుల్లు!
‘సీతా కల్యాణం’ సామాన్యులకు నచ్చలేదన్న బాధే కానీ, సినీ, సామాజిక దిగ్గజాల మెచ్చుకోళ్ళకు మాత్రం అంతు లేదు. సాక్షాత్తూ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కేవలం పది నిమిషాలే టైమిచ్చి కూర్చున్నా, తెరపై ‘సీతా కల్యాణం’ చూస్తూ కళ్ళుతిప్పుకోలేక రెండు గంటల పైచిలుకు సినిమా ఆసాంతం చూస్తూనే ఉండిపోయారు.
అలాగే, ఓసారి ఏదో అవార్డుల ప్రదానోత్సవానికి బాపు ఢిల్లీ వెళ్ళారు.
అప్పుడు తమిళ దర్శకుడు కె. బాలచందర్ అక్కడ కనబడి, బాపు భుజం మీద చెయ్యి వేసి ఒకటే మాట అన్నారు. ‘‘నేను గుడికెళ్ళను. పూజలు చేయను. నాస్తికుడిననే చె΄్పాలి. కానీ, మీ ‘సీతా కల్యాణం’ చూసిన తర్వాత వారం రోజుల పాటు అవే దృశ్యాలు నా కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి’’ అని మెచ్చుకున్నారు. ఆ ఏడాది ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల్లో తెలుగుకు సంబంధించి ఉత్తమ దర్శకుడిగా ‘సీతా కల్యాణం’కి గాను బాపు ఎంపికయ్యారు.
రామచంద్రన్ అంటే రామకథ వేశారు!
‘సీతా కల్యాణం’కు సంబంధించి చాలా కథలున్నాయి. అప్పట్లో ఆ సినిమా లండన్, షికాగో సహా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళ్ళింది. అది కూడా గమ్మత్తుగా జరిగింది. 1978 జనవరిలో మద్రాసులో ఫిల్మోత్సవ్ నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రేమో సాక్షాత్తూ టాప్ సినీస్టార్ ఎం.జి. రామచంద్రన్. ఆ సంగతి తెలిసిన విదేశీ ప్రతినిధులు రామచంద్రన్ నటించిన సినిమా ఏదైనా చూడాలనుకున్నారు.
‘రామచంద్రన్ సినిమా చూపించండ’ని వీళ్ళు అడిగితే, హిందీ వాడైన ఆ ఫెస్టివల్ ఛీఫ్ ఆర్గనైజర్‌కు ‘వీళ్ళేదో రాముల వారి సినిమా చూపించమంటున్నార’న్నట్టుగా అర్థమైంది. ఆయన అర్జెంటుగా రేపు ఓ రాముల వారి సినిమాను విదేశీయులకు ప్రదర్శించాల్సిందిగా మద్రాసులోని ఫిల్మ్ ఛాంబర్ వారిని అభ్యర్థించారు. ఎవరి దగ్గరా అప్పటికప్పుడు ప్రింట్లు వగైరా రెడీగా లేవు. ముళ్ళపూడిని కూడా అడిగితే, ‘రామాయణం లేదు కానీ, ‘సీతా కల్యాణం’ ప్రింటు ఉంది. అందులోనూ రాముడుంటాడు లెండి’ అని ప్రింటు పంపారట. అదిగో... అలా అక్కడ అనుకోకుండా మరునాడు పొద్దున్నే పది గంటలకు సెల్యులాయిడ్ కావ్యం ‘సీతా కల్యాణం’ చూసి దేశ, విదేశీ ప్రతినిధులకు మతిపోయింది.
లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో...
మద్రాసు ‘ఫిల్మోత్సవ్’లో ‘సీతా కల్యాణం’ షో చూసినవారిలో లండన్ ‘గార్డియన్’ పత్రిక సినిమా సెక్షన్ ఎడిటర్ డెరెక్ మాల్కమ్ ఉన్నారు. అద్భుతమైన సినిమా తీశారంటూ దర్శకుడు బాపును అభినందించడమే కాక, ఆ తర్వాత ‘‘కొద్ది నెలల్లో జరిగే ‘లండన్ ఫిల్మ్ ఫెస్టివల్’కు భారతదేశం తరఫున ఈ సినిమా పంపండి. మేమూ ఇండియన్ గవర్నమెంట్‌కు రాస్తాం’’ అని చె΄్పారట. అలా ‘సీతా కల్యాణం’ రిలీజైన రెండేళ్ళ తర్వాత సినిమాటిక్‌గా లండన్‌కు వెళ్ళింది.
అలా 1978లో ఆ ఏటి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారి ‘లండన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శన జరుపుకొంది. మన పౌరాణిక ఆహార్యం, ఆభరణాలు, నటీనటుల అందం వగైరా ఫోటోల్లో చూసి విదేశీ జనం గుమ్మయిపోవడంతో, ఒక ఆటకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. అలాగే, ఆ ఫెస్టివల్‌లోనే ఒక ఇండియన్ ఎంట్రీ సినిమా టైమ్‌కి రాలేదు. అప్పుడు ఆ ఖాళీలో జనం డిమాండ్ మీద ‘సీతా కల్యాణ’మే రెండోసారి వేశారు.
లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా స్క్రీనింగ్ అయిన వెంటనే బాపును వేదిక మీదకు తీసుకువెళితే, హాలులో అందరూ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టి, స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. 1978 నవంబర్ ప్రాంతంలో ఈ చిత్రోత్సవం జరిగినప్పుడే లండన్‌లో బాపు చిత్రకళా ప్రదర్శన కూడా ఏర్పాటైంది. బాపు సినిమాకే కాదు... బొమ్మలకూ జనం ఆకర్షితులయ్యారంటే, ఆ ప్రదర్శనలోని మూడు రేఖా చిత్రాలను ఆ ప్రాంత అభిమానులు అక్కడికక్కడ ఏకంగా 600 పౌండ్లకు కొన్నారు.


