
గతంలో సినీ ప్రియులను మెప్పించిన జురాసిక్ వరల్డ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. జురాసిక్ వరల్డ్: రీ బర్త్ పేరిట సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 2న రిలీజైన ఈ చిత్రం ఇండియాలోనే అరుదైన రికార్డ్ సాధించింది. దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. దీంతో ఈ ఏడాది జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తొలి వారాంతంలోనే రికార్డ్ స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 49.3 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు.
జురాసిక్ ప్రాంఛైజీలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమైన రీతిలో ఆడియన్స్ను మెప్పించాయి. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో 7వ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్కు మొదటి రెండు భాగాలకు జురాసిక్ మూవీస్‌కు కథ అందించిన డేవిడ్ కోప్ స్టోరీ అందించారు. ఈ చిత్రానికి గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఇక మార్వెల్ బ్యూటి బ్లాక్ విడో స్కార్లెట్ జాన్సన్ జురాసిక్ వరల్డ్ రీ బర్త్‌లో మెయిన్ లీడ్ రోల్లో కనిపించారు.