టాలీవుడ్ నటుడు శివాజీ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గతేడాది కోర్ట్, దండోరా సినిమాలతో విజయాలందుకున్న ఆయన తాజాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రంతో మార్చి 6న థియేటర్స్‌లోకి వచ్చారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో లయ, అలీ, ప్రిన్స్, ధన్‌రాజ్, రిక్కీ, బబ్లూ, రోహన్, షాబుద్దీన్, చిత్రం శ్రీను, కమల్, చమ్మక్‌చంద్ర, ఇమ్మానుయేల్ తదితరులు నటించారు. ఈ మూవీకి నిర్మాత శివాజీ కావడం విశేషం. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
కథేంటి..?
శ్రీరామ్ (శివాజి) సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తూ.. చాలా నిజాయితీపరుడని పేరు తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకుండా తన ఉద్యోగ ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వం. భార్య ఉత్తర (లయ), కుమారుడు మిక్కీ (రోహన్) వీరిద్దరూ ఒకేరకమైన మనస్థత్వంతో ఉంటారు. వారిలో అమాయకత్వంతో పాటు అతి తెలివి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా వాళ్ల జోలికెళితే ఏం చేస్తారో వారికే తెలియదు. ఇలా వారి పాత్రలన్నీ టైటిల్‌కు తగ్గట్లే ఉంటాయి. ఆ కాలనీలోనే వారి ఫ్యామిలీ చాలా గమ్మత్తుగా ఉంటుంది.

ఎంతో సరదాగా వెళ్తున్న వారి జీవితంలోకి ఎస్‌ఐ విక్రమ్ (ప్రిన్స్) వస్తాడు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఒకరోజు శ్రీరామ్‌తో గొడవ అవుతుంది. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక ల్యాండ్ సెటిల్‌మెంట్ ఫైల్‌ను శ్రీరామ్ (శివాజి) అడ్డుకుంటాడు. అయితే, ఒకరోజు శ్రీరామ్ లేని సమయంలో ఉత్తరను చూసిన ఎస్‌ఐ ఇంట్లోకి వెళ్తాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఆ ఇంట్లో ఒక నేరం జరుగుతుంది. దాని నుంచి బయటపడేందుకు హీరో ఏం చేశాడు అనేది పూర్తి సినిమా. శ్రీరామ్ ఇంటికి ఎస్‌ఐ ఎందుకు వెళ్లాడు..? అక్కడ ఎలాంటి నేరం జరిగింది..? దాని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో ఎంత దూరం వెళ్తాడు..? ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కథలో ఎక్కువగా దృశ్యం మూవీ సీన్లు గుర్తుకొస్తాయి. కానీ, ఆ మూవీలో ఉన్నంత సీరియస్ ఇందులో కనిపించదు. కథలో కావాల్సినంత విషయంతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా తెరకెక్కించే అవకాశం ఉంది. కానీ, కథ నడపడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథలో ఓవర్ ట్విస్ట్‌లు ఉంటాయి. కానీ, అవన్నీ ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తాయి. ఇందులో (శ్రీరామ్) పాత్ర సాంప్రదాయంగా ఉంటే... ఇంకొకరు( ఉత్తర) సుప్పనాతితనంతో ఉంటారు. ఇంకొకరేమో (మిక్కీ) సుద్దపూసలా కనిపించే దొంగ. ఇలా ప్రతి పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. అయితే, వారు ఇచ్చే ట్విస్ట్‌లే కొంపముంచాయ్. తన ఇంట్లో జరిగిన ఒక నేరం నుంచి బయటపడేందుకు శివాజీ అమలు చేసే ప్లాన్స్ కొన్ని పర్వాలేదనిపిస్తాయి.
అయితే, హీరో సమస్యలో పడిన ప్రతిసారీ ఆయనకి అనుకూలంగా ఏదోఒకటి జరగడంతో ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తుంది. ఆపై చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ పాత్ర తికమకగా మరీ తెలివితక్కువగా ఉంటుంది. తన సీన్స్ వచ్చిన ప్రతిసారి ఎప్పుడు అయిపోతుందా అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమాయకత్వంతో లయ అదరగొట్టేసింది. ఫస్టాఫ్ కాస్త మెప్పించినప్పటికీ.. ఇంటర్వెల్ తర్వాత ఆశించినంత రేంజ్ కథలో విషయం కనిపించదు. కథ ప్రారంభంలో వేసిన చిక్కుముళ్లు సరైన క్రమంలో తొలగించకుంటే ప్రేక్షకుడిని మెప్పించడం కాస్త కష్టమైన పనే అవుతుంది. ప్రేక్షకుడి తెలివికి పరీక్ష పెట్టాలి.., కానీ ఇక్కడ సహనానికి అగ్నిపరీక్ష దర్శకుడు పెట్టాడనిపిస్తుంది.

ఒక మంత్రి కోసం ఎమ్మెల్యే (శరత్ లోహితాస్య) పంపిన గిఫ్ట్ చుట్టూ కాస్త స్టోరీ తిరుగుతుంది. ఇందులో హీరో పాత్రకు పెద్దగా బలం కనిపించదు. సినిమా అంతా గిఫ్ట్ కోసం వెతకమని కేకలు పెట్టే ఎమ్మెల్యే చివర్లో కూడా ఆ గిఫ్ట్‌లో ఏముందో చెప్పడు. ఈ మధ్య ఓటీటీలు వచ్చాకు ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చూసిచూసి ప్రేక్షకులు రాటుదేలి పోయారు. ఓటీటీలు శాసిస్తున్న కాలంలో వాళ్లని సుద్దపూసలనుకుంటే సినిమాకే నష్టం. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పెద్దగా మెప్పించలేదు. ఆలీ ఎపిసోడ్ కాస్త పర్వాలేదు. గుడ్‌న్యూస్ అంటూ లయ చేసిన సీన్ మెప్పిస్తుంది. శవం ఎపిసోడ్‌ను దర్శకుడు తను అనుకూలంగా మార్చుకున్నాడు ఏమో అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
దాదాపు 20ఏళ్ల తర్వాత లయ, శివాజీ కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మూవీకి ప్రధాన బలం లయ, శివాజీల నటన మాత్రమే. రోహన్ పాత్ర పెద్దగా కనెక్ట్ అవదు. ప్రిన్స్ ఎస్‌ఐగా కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ మెప్పించాడు. ఆ తర్వాత ఆలీ, ధన్‌రాజ్, శరత్ లోహితాస్య, చమ్మక్‌చంద్ర, ఇమ్మానుయేల్ వారి పరిధిమేరకు మెప్పించారు. సినిమాకు సంగీతం, కెమెరామెన్ పనితీరు మరోక బలం అయ్యాయి. బడ్జెట్ పరంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓటీటీలోనే విడుదల చేసింటే మరింత పేరు వచ్చేదేమో..


