సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి, పిల్లల్ని కనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే తన ప్రెగ్నెన్సీ మాత్రం అనుకోకుండానే జరిగిందని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టింది.
'నాకు ప్రెగ్నెన్సీ రావడం పెద్ద సర్‌ప్రైజ్. గర్భం దాలుస్తానని అస్సలు ఊహించలేదు. మా ఇంటి బంగారం సినిమాలోని తస్సాదియ్యా పాట షూటింగ్ చేస్తున్న టైంలో నాకు కాస్త నీరసంగా అనిపించింది. డాక్టర్ దగ్గరకెళ్తే నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే నేను,రాజ్.. పిల్లల కోసం ప్లాన్ చేయలేదు. పెళ్లికి ముందే ఈ సంగతి మాట్లాడుకున్నాం'
'ఒకానొక టైంలో నేను, రాజ్ ఇద్దరం పిల్లలు లేకపోయినా పర్లేదని అనుకున్నాం. నాకు ఓకే. రాజ్ కూడా ఓకే అని అన్నాడు. కానీ ఇలా ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం' అని సామ్ చెప్పుకొచ్చింది. మగ-ఆడబిడ్డ ఎవరు పుట్టినా సరే వాళ్ల కోసం షాపింగ్ చేసేసింది. ఏం పేరు పెట్టాలనేది కూడా ముందే నిర్ణయించుకున్నామని కూడా సమంత చెప్పింది.
గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని అందుకుంది. దీని రిలీజ్ టైంలో సామ్ ప్రెగ్నెంట్ అయిందనే సంగతి బయటకొచ్చింది. ఈ డిసెంబరులోనే బిడ్డ పుట్టే అవకాశముందని తెలుస్తోంది.


