
ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఆఫీసర్ రిషికేశ మళ్లీ థియేటర్స్‌లోకి వస్తున్నాడు. రవితేజ కెరీర్‌లోని వన్నాఫ్ ది హిట్ ఫిల్మ్ ‘మిరపకాయ్’. ఈ చిత్రంలో రిచా గంగో పాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించగా, ప్రకాశ్‌రాజ్ విలన్ పాత్రలో, మరో ఐబీ ఆఫీసర్‌గా బ్రహ్మాజీ నటించారు. రమేష్ పుష్పాల నిర్మించిన ఈ సినిమాను జూలై 11న రీ–రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఐబీ ఆఫీసర్ రిషికేశ పాత్రలో రవితేజ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. రిషికేశ ఓ అండర్‌కవర్ ఆపరేషన్‌తో మాఫియా డాన్ కిట్టు (ప్రకాశ్‌రాజ్) ఆటను ఎలా కట్టించాడన్నదే ఈ సినిమా కథనం.
ఇక రవితేజ హీరోగా నటించిన మరో చిత్రం ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ ఇటీవల రీ–రిలీజైన విషయం గుర్తుండే ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ‘అనార్కలి’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. అలాగే రవితేజ నటించిన ఇంకో చిత్రం ‘మాస్ జాతర’ ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల కానుంది.