సినిమా చూడాలని ఆసక్తి ఉన్నా.. టికెట్ ధరలు చూస్తేనే సామాన్య ప్రేక్షకుడు వెనకడుగు వేస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్స్ నుంచి మొదటి వారం వరకు టికెట్ రేట్లను భారీగా పెంచేస్తుండటంతో థియేటర్‌లో సినిమా చూడటం చాలామందికి భారంగా మారింది. దీంతో కంటెంట్ బాగున్నా, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు థియేటర్స్‌లో ఆడడం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన కొందరు నిర్మాతలు టికెట్ ధరలు పెంచకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు. అయినా స్టార్ హీరోల చిత్రాల విషయంలో మాత్రం ఈ ట్రెండ్ మారడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచబోనని ప్రకటించి ప్రేక్షకులకు ఊరటనిచ్చాడు.

ఆయన నటించిన తాజా చిత్రం ‘రణబాలి’ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతూ.. ‘రణబాలి చిత్రానికే కాదు ఇకపై నేను నటించిన ఏ చిత్రానికి కూడా టికెట్ల రేట్స్ పెంచను. ఒకవేళ నా సినిమాకు బడ్జెట్ ఎక్కువైతే.. నిర్మాతతో కలిసి మాట్లాడతాను. రెమ్యునరేషన్ కాస్త తగ్గించుకోవడమో లేదా ఇంకా ఏదైనా మార్గం ఉంటే చూస్తాను. ఒకవేళ రాజమౌళి సర్‌తో సినిమా చేస్తే తప్ప.. నా సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు ఉండదు’ అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు.

రణబాలి విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.


