రజనీకాంత్ 173వ సినిమా గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ దర్శకులు మారుతూనే ఉన్నారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2'లో నటిస్తున్నారు. ఇది సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. దీని తర్వాత 173వ మూవీ చేయబోతున్నారు. కమలహాసన్ ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నట్లు ప్రకటించి చాలా కాలమే అయింది. ఈ చిత్రానికి చాలా మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి సుందర్ సి పేరును ఖరారు చేసి, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనూహ్యంగా సదరు దర్శకుడు తప్పుకొన్నాడు.
(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)
సుందర్ తప్పుకొన్న తర్వాత 'పార్కింగ్' మూవీ ఫేమ్ దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ సెట్ కాలేదు. డాక్టర్, డాన్ చిత్రాల దర్శకుడు శిబి చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్‌కు నచ్చడంతో ఆయన పేరు ఖరారైంది. ఈ చిత్రాన్ని కచ్చితంగా హిట్ చేస్తానని శిబి ఒక వేదికపై చాలా నమ్మకంగా చెప్పాడు. అలాంటిది ఆయన పేరు మారిన వారి లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాల ఫేమ్ అశ్వత్ మారిముత్తు పేరు వినిపిస్తోంది. దాదాపు ఈయనే ఫిక్స్ అని అంటున్నారు.
ఇందులో దర్శకుడు మిష్కిన్ ఒక కీలక పాత్రను పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏ విషయాన్ని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. కథ నచ్చే వరకు తమ అన్వేషణ కొనసాగుతుంది అని కమలహాసన్ ఇంతకుముందే పేర్కొన్నారు అన్నది గమనార్హం.
(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)


