
'సివరపల్లి' సక్సెస్ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోతూ తనదైన నటనతో రాగ్ మయూర్ మెప్పిస్తున్నాడు. రీసెంట్‌గా సమంత నిర్మించిన 'శుభం'లోనూ రాగ్ మయూర్ పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో)
నేను ఇంతకు ముందు చేసిన 'సినిమా బండి' ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మరిడేష్ బాబు పాత్రకు కొనసాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్రను దర్శకుడు ప్రవీణ్ చాలా సరదాగా డిజైన్ చేశారు. ఆయన కథ నెరేట్ చేసిన తర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుందని అర్థమైంది. అందుకే 'శుభం' అవకాశాన్ని కాదనలేకపోయాను. నా నమ్మకం నిజమైంది. నా పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సమంత, ప్రవీణ్ కి థాంక్స్. సినిమా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందని అన్నాడు.
ప్రవీణ్ కండ్రేగుల తీస్తున్న మూడో సినిమా 'పరదా'లోనూ రాగ్ మయూర్ నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి కనిపించబోతున్నాడు. 'పరదా'లో పూర్తి నిడివి పాత్ర చేశానని చెప్పాడు. జీఏ2 తీస్తున్న బడ్డీ కామెడీ చిత్రంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీస్తున్న గరివిడి లక్ష్మి సినిమాలోనూ మయూర్ నటిస్తున్నాడు.
(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ)