
తెలుగు సినిమాలతో నటుడిగా మారిన హర్షవర్దన్ రాణే.. ఇక్కడ సరైన పాత్రలు, గుర్తింపు రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. అక్కడ హీరోగా పలు చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అందులో ఒకటి 'సనమ్ తేరీ కసమ్'. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన వసూళ్లు దక్కించుకుంది. దీంతో చిత్రనిర్మాతలు సీక్వెల్ ని ప్రకటించారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది.
(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ)
నిన్నటివరకు భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ లోని పలు ఉగ్రస్థావరాల్ని మట్టుబెట్టింది. ఈ క్రమంలో పలువురు పాక్ నటీనటులు.. ఆపరేషన్ సిందూర్ పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. వాళ్లలో నటి మావ్రా హోకెన్ ఒకరు. ఈమెనే గతంలో 'సనమ్ తేరీ కసమ్'లో హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఈమె.. 'ఆపరేషన్ సిందూర్'పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హర్షవర్ధన్, సీక్వెల్ లో ఈమెతో నటించేది లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
'ప్రస్తుత పరిస్థితులని నేను గౌరవిస్తున్నాను. నా దేశాన్ని ఉద్దేశించి కొందరు చేసిన వ‍్యాఖ్యల నేపథ్యంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. గతంలో నటించిన వాళ్లే ఇప్పుడు 'సనమ్ తేరీ కసమ్ 2'లోనూ నటిస్తానంటే.. నేను అందులో నటించాలని అనుకోవట్లేదు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు.
అలానే మావ్రా హోకెన్ పోస్ట్ ని కూడా షేర్ చేసిన హర్షవర్ధన్.. ఏ దేశానికి చెందిన నటీనటుల్ని అయినా నేను గౌరవిస్తాను. కానీ నా దేశం గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని స్పందించాడు. ఇప్పుడు ఇది కాస్త హాట్ టాపిక్ అయింది.
(ఇదీ చదవండి: రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం)
