‘సై’తో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పించిన నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 74 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్ కారణంగా ఆయన మృతి చెందాడు. అయితే చివరి రోజుల్లో ఆయన అనుభవించిన బాధను, ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన కుమారుడు విక్రమాదిత్య ఎమోషనల్ అయ్యాడు. అంత్యక్రియలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు.
‘రెండు నెలల క్రితం నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు. అన్నీ పరీక్షలు చేయించాం. రిపోర్టులు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఈ మధ్యే అమ్మ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాన్నకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లాం. తొలుత కడుపులో సాధారణ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుకున్నాం. అయినా సరే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌లో చూపించి..ఇంటికి తీసుకొచ్చాం. మళ్లీ ఓ రోజు అమ్మ ఫోన్ చేసి ఆరోగ్యం బాగా క్షీణించిందని చెప్పింది. దీంతో బ్లడ్ టెస్ట్ చేయించాం. తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. వెంటనే కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించాం. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ అని బయటపడింది.
ఈ విషయం తెలియగానే అమ్మతో పాటు అందరం షాకయ్యాం. రెండు నెలల క్రితం ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పడంతో కుప్పకూలిపోయాం. నెలన్నర వ్యవధిలోనే నాన్న మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. చనిపోయే కొద్ది క్షణాల ముందు డాక్టర్ మమల్ని పిలిచాడు. అప్పటికే నాన్నకు వైద్యులు సీపీఆర్ చేస్తున్నారు. నాన్నను అలా చూడగానే ఆశలు లేవని నాకు అర్థమైపోయింది. అవే అఖరి క్షణాలని తెలిసి అమ్మ గట్టిగా ఏడ్చేసింది. చూస్తుండగానే నాన్న ప్రాణాలు వదిలేశాడు’ అంటూ విక్రమాదిత్య కన్నీళ్లు పెట్టుకున్నాడు.


