కన్నడ భాషపై కమల్ కామెంట్స్‌.. పోలీసులకు ఫిర్యాదు! | Police complaint filed against Kamal Haasan by pro Kannada organisation | Sakshi
Sakshi News home page

Kamal Haasan: కమల్ హాసన్ వివాదాస్పద కామెంట్స్‌.. పోలీసులకు ఫిర్యాదు!

May 29 2025 5:12 PM | Updated on May 29 2025 5:59 PM

Police complaint filed against Kamal Haasan by pro Kannada organisation

కన్నడ భాషపై కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. థగ్ లైఫ్  సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు మండిపడుతున్నారు. కమల్ హసన్‌ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను ఉద్దేశించిన కమల్‌ చేసిన ‍వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్‌ కౌంటరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కమల్ ‍హాసన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. తమిళులకు, మాకు  విష బీజాలు నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ సినిమా విడుదలైన ప్రతిసారీ కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాగా..  థగ్ లైఫ్ ఆడియో లాంచ్ సందర్భంగా తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

కాగా.. కమల్ హాసన్‌ వ్యాఖ్యలతో అనేక కన్నడిగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కమల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బెళగావి మరికొన్ని ప్రదేశాలలో కార్యకర్తలు కమల్ పోస్టర్లను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఆయన సినిమా థగ్ లైఫ్ ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా  బెదిరించారు.

Advertisement
 
Advertisement
Advertisement