
‘‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu Movie) సినిమా క్రిష్‌గారి వల్ల నా దగ్గరకు వచ్చింది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల ఆయన మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమాను హ్యాండిల్ చేశారు. ఇక నేను డిప్యూటీని సీయంని కావొచ్చు. కానీ ఈ సినిమాకు హీరోని. నిధీ అగర్వాల్‌గారు యాక్టివ్‌గా ఈ సినిమా ప్రమోషన్ చేయడం చూసి, సిగ్గు తెచ్చుకుని నేను మీడియా ఇంట్రాక్షన్‌లో పాల్గొంటున్నాను’’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక మంత్రి కె. ఈశ్వర్ ముఖ్య అతిథులుగా ΄ాల్గొని, ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘హరిహర వీరమల్లు’ అనేది కల్పిత పాత్ర. విజయవాడ దగ్గరలోని కొల్లూరు దగ్గర్లో లభించిన కోహినూర్ వజ్రం నిజాం నవాబు దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత మొఘలులకు వెళ్లి, ఫైనల్‌గా... ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని క్రిష్‌గారు కథ చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ది బెస్ట్ ఇవ్వడం. అది చేశాం. మీకు (అభిమానులు, ప్రేక్షకులు) నచ్చిందా బద్దలు కొట్టేయండి’’ అన్నారు.
‘‘మేమెంతో కష్టపడి తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు దయాకర్ రావు. ‘‘1684 నుంచి ‘హరిహర వీరమల్లు’ కథ మొదలవుతుంది’’ అని అన్నారు జ్యోతికృష్ణ. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కీరవాణి తదితరులు పాల్గొన్నారు.