దక్షిణాది భాషలు, యాసలను పలికే విషయంలో నటులు ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై నటి పార్వతీ తిరువోతు ఓ జూమ్ ఇంటర్వ్యూలో స్పందించారు. మరో భాషలో నటించేటప్పుడు యాస విషయంలో ఇబ్బందులు ఎదురవడం సహజమేనని ఆమె అన్నారు. ఒక కొత్త భాషను నేర్చుకుని, అందులో సహజంగా మాట్లాడటం ఒక్కరోజులో సాధ్యమయ్యే విషయం కాదని పేర్కొన్నారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘ప్రేక్షకులు తెరపై సహజమైన నటనను చూడాలని కోరుకుంటారు. నేను కూడా దానినే నమ్ముతాను. ఇప్పటివరకు నాకు నచ్చిన కథలు, పాత్రలనే ఎంచుకుంటూ వచ్చాను. కొత్త భాషలు నేర్చుకోవడం కూడా నాకు ఆసక్తి ఉంది. అందుకే ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినప్పుడు నటించేందుకు ముందుంటాను. అవసరమైతే ఆ భాష కోసం శిక్షణ తీసుకోవడానికి కూడా సిద్ధమే.
అయితే ఒక పాత్రకు న్యాయం చేయలేనని నాకు అనిపిస్తే మాత్రం వెంటనే ఆ అవకాశాన్ని తిరస్కరిస్తాను. నా స్థానంలో డైలాగ్‌లను మరింత సహజంగా చెప్పగల డబ్బింగ్ కళాకారిణిని తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ కారణంగానే గతంలో కొన్ని సినిమాలను కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి’ అని పార్వతీ తిరువోతు తెలిపారు. కాగా ఈమె ఇటీవల నటించిన మలయాళ థ్రిల్లర్ ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’ మంచి స్పందనను అందుకుంది.
ఇదీ చదవండి: మూవీ ప్రమోషన్స్‌లో మహేశ్ బాబు కూతురు.. అభిమానులు ఫిదా


