
పాక్ నటి హుమైరా అస్గర్ మృతి కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. కరాచీలోని తన నివాసంలో హుమైరా విగతజీవిగా కనిపించింది. ఈ నెల 9న ఆమె మృతదేహన్ని ఫ్లాట్లో గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే హుమైరా పోస్టుమార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయం బయటపడింది. ఆమె మరణించి దాదాపు తొమ్మిది నెలలు అయిందని అక్కడి స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని ఫ్లోర్లో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం బయటికి రాలేదని తెలుస్తోంది.
కాగా.. నటి చివరిసారిగా ఫోన్ కాల్ అక్టోబర్ 2024లో చేసిందని పోలీసులు గుర్తించారు. అదే ఆపార్ట్మెంట్లో నివసించేవారు కూడా ఆమెను చివరిసారిగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో చూశామని పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా హుమైరా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు.. చివరిసారి సెప్టెంబర్ 2024లో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఈ లెక్కన ఆమె గతేడాదిలోనే మరణించినట్లు తెలుస్తోంది.
మరోవైపు నటి భౌతికకాయాన్ని తీసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ పోలీసులకు తెలిపారు. చాలా రోజుల క్రితమే తనతో సంబంధాలు తెంచుకున్నామని ఆయన అన్నారు. పోలీసులు మొదట హుమైరా సోదరుడిని ఆమె ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన తండ్రితోనే మాట్లాడాలని చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో సింధ్ సంస్కృతి విభాగం హుమైరా అంత్యక్రియల ఏర్పాట్లు చేసేందుకు ముందుకొచ్చింది.
హుమైరా రియాలిటీ షో తమషా ఘర్‌లో నటించింది. ఆ తర్వాత 2015 యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. ఆమె పాకిస్తానీ చిత్రంలో మోడల్‌గా కనిపించింది. హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు వంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. హుమైరా చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ 2021లో విడుదలైంది.