
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌పై భారత్ ఎదురుదాడికి దిగింది. అయితే, ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడులకు సంబంధించిన వివరాలను భారత ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుపుతూ వచ్చారు. అయితే, వారు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్‌లో పాల్గొని మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.
భారత భద్రతా బలగాలకు చెందిన సైన్యం నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, నావికాదళం నుంచి కమాండర్ ప్రేరణ డియోస్థలీ కలిసి కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన ఈ అధికారులు, తమ ధైర్యం, దేశానికి చేసిన సేవ వంటి అంశాలను ఈ షోలో పంచుకున్నారు. అయితే, క్విజ్‌లో అద్భుతంగా ఆడి, రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్‌లోని స్వాతంత్ర్య దినోత్సవ ఎపిసోడ్ చారిత్రాత్మకంగా మారింది.
ఇంగ్లాండ్ లీసెస్టర్‌లోని విక్టోరియా పార్క్‌లో ఉన్న "ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్" స్మారక చిహ్నాన్ని రూపొందించిన వ్యక్తే ఇండియాలో కూడా ఆయన రూపొందించిన స్మారక చిహ్నాం ఏంటి..?
ఏ)విక్టోరియా మెమోరియల్, బి) గేట్‌వే ఆఫ్ ఇండియా, సి) ఫోర్ట్ సెయింట్ జార్జ్, డి) ఇండియా గేట్
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో వారు మొదట్లో గందరగోళంగా ఉన్నప్పటికీ, ఆ ముగ్గురూ సరైన సమాధానాన్ని లాక్ చేయడానికి ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ను ఉపయోగించారు. ఫైనల్‌గా ఇండియా గేట్ అని సరైన సమాధానం చెప్పారు. 'ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్' అనేది మొదటి ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం. దీనిని సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. అతనే ఇండియా గేట్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. సరైన సమాధానం చెప్పినందుకు వారు రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. గెలుచుకున్న ఆ డబ్బును వారి సంబంధిత సంస్థలతో అనుబంధించబడిన సంక్షేమ నిధులకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు.