
అంతన్నారు ఇంతన్నారు చివరకు తుస్సుమన్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG) చిత్రం పరిస్థితి. విపరీతమైన హైప్‌తో విడుదలైన దే కాల్ హిమ్ ఓజీ తొలి 2 రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్నంత హంగామా సృష్టించారు. ఇక పవన్ ఫ్యాన్స్ తమ హడావిడికి హద్దే లేదన్నట్టుగా చెలరేగిపోయారు. వెయ్యి కోట్ల దాకా కలెక్షన్లు వచ్చేస్తాయంటూ పుష్ప రికార్డులు కూడా బద్దలైపోతాయంటూ ఊహాగానాలు చేసేశారు. అభిమానుల ఆశలు ఆకాంక్షలు అర్ధం చేసుకోదగినవే కానీ...పాపం వారి ఆశల్ని వమ్ము చేస్తూ ఓజీ నాలుగు రోజుల్లోనే నీరుగారిపోయింది(OG Box Office Collection).
నాలుగు రోజుల్లో 252 కోట్ల కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతుంటే...ఇందులో షుమారుగా ఓవర్‌సీస్ 50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లు పైగా. కానీ తమిళ, హిందీ, కన్నడ పరిస్థితి ఏమిటి? తెలుగు వాళ్లున్న చోట్ల తప్ప వేరే భాషా ప్రేక్షకులు ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఓజీని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. హిందీ మార్కెట్‌లో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది 2 కోట్లలోపే.. ఇక కన్నడిగులు అయితే మరీ కరివేపాకులా తీసి పారేశారు. నాలుగు రోజుల్లో నాలుగైదు లక్షలు దాటలేదు. దాంతో అక్కడ సినిమా అప్పుడే కనుమరుగైంది తమిళనాడు పరిస్థితి చూస్తే...నాలుగు రోజుల్లో 76 లక్షలు మాత్రమే గ్రాస్. తెలుగు వారున్న ప్రతీ చోటా బెనిఫిట్ షోల రూపంలో ఇష్టా రాజ్యంగా అభిమానుల్ని దోచుకోవడం, తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్లలో టిక్కెట్ల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం... ఇవన్నీ కలిపితేనే ఆ మాత్రమైనా కలెక్షన్లు. అది కూడా ప్రకటిస్తున్న కలెక్షన్లలో ఎంత వరకూ నిజమో పబ్లిసిటీ స్టంటో తెలీదు.
మొత్తం మీద విపరీతమైన అంచనాలతో వచ్చిన పవన్ 2 సినిమాలూ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. హరిహర వీరమల్లు డిజాస్టర్‌గా నిలిస్తే... ఓజీ కలెక్షన్లు కూడా పాన్ ఇండియా రేంజిలో లేకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరచింది. పవన్ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన మిగిలిన టాలీవుడ్ హీరోలు ఇప్పటికే గ్లోబల్ స్టార్లుగా రూ.వేల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే బోలెడంత ఫాలోయింగ్ ఉన్నట్టు చెప్పుకుంటున్న పవన్(Pawan Kalyan) మాత్రం పాన్ ఇండియా ఇమేజ్‌కి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని ఓజీ సినిమా కుండబద్ధలు కొట్టినట్టు నిరూపించింది.
పైగా ఇమ్రాన్ హష్మీ లాంటి బాలీవుడ్ స్టార్ ను ప్రధాన విలన్‌గా పెట్టుకున్నా అక్కడి ప్రేక్షకులు కన్నెత్తి కూడా ఓజీని చూడలేదంటే... ఇక చెప్పేదేముంది? కొసమెరుపు ఏమిటంటే... ఓజీ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ దర్శకత్వంలోనే వచ్చిన ప్రభాస్ సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే... వసూళ్లు మాత్రం రూ.250 కోట్లు దాటేశాయి. ఇందులో నార్త్ ఇండియా కలెక్షన్లే అత్యధికంగా ఉండడం గమనార్హం. దీనిని బట్టి పవన్ లేదా ఆయనతో సినిమా తీసేవారు తెలుసుకోవాల్సిన చేదు వాస్తవం ఏమిటంటే... హీరోలు మెప్పించాల్సింది అభిమానుల్ని మాత్రమే కాదు.