
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ చేసిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. ఇప్పటికే ట్రైలర్, తదితర ప్రమోషనల్ కంటెంట్ రాగా కాస్త హైప్ పెరిగింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. దీనికి హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీతో పాటు త్రివిక్రమ్,దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడిన ఎన్టీఆర్, మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలానే తనకంటే హృతిక్ గొప్ప డ్యాన్సర్ అని పొగిడేశాడు. ఇంకా ఏమేం చెప్పాడంటే?
'వార్ 2 సినిమాలో నేను నటించడానికి ముఖ్య కారణం ఆదిత్య చోప్రా గారు. నా వెంటపడి, నాకు భరోసా కల్పించి.. నీ అభిమానులు గర్వపడి తలెత్తుకునేలా చేస్తానని చెప్పారు. ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు. మా తాత నందమూరి తారక రామారావు ఆశీసులు ఉన్నంత కాలం నన్ను ఎవరు ఆపలేరు. అలానే నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు అనే వారు కాదు. కానీ హృతిక్ రోషన్‌ని చూసి మ్యాడ్ అయిపోయాను. దేశంలో బెస్ట్ డ్యాన్సర్ ఇతడే' అని తారక్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?)
''బాద్ షా' ఫంక్షన్ జరిగినప్పుడు ఒక అభిమాని ప్రాణం కోల్పోయాడు. ఆరోజు నుండి పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉన్నాను. 'వార్ 2' నా బాలీవుడ్ డెబ్యూ మూవీ మాత్రమే కాదు. హృతిక్ రోషన్ టాలీవుడ్ డెబ్యూ కూడా. సౌత్, నార్త్ అనే హద్దులు చెరిపేసిన రాజమౌళికి పెద్ద థాంక్స్. ఇకపోతే ఎవరు ఎన్ని అనుకున్నా బొమ్మ అదిరిపోయింది. పండగ చేసుకోండి' అని ఎన్టీఆర్.. అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. చివరలో తారక్-హృతిక్ తమ కాలర్లు ఎగరేసి సినిమాపై హైప్ పెంచేశారు.
ఆగస్టు 14న రాబోతున్న 'వార్ 2' సినిమా.. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలు కాగా కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ నాగవంశీ.. తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అదే రోజున రజినీకాంత్ 'కూలీ' కూడా రిలీజ్ అవుతోంది. మరి రెండు చిత్రాల్లో ఏది అభిమానుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'వార్ 2' సినిమా బాగోలేకపోతే పదింతలు నన్ను తిట్టండి: నాగవంశీ)