
ఎన్టీఆర్ చేసిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటించాడు. ఈ గురవారం(ఆగస్టు 14) థియేటర్లలోకి రానుంది. అదే రోజున రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' కూడా రిలీజ్ కానుంది. అయితే రజినీ మూవీతో పోలిస్తే 'వార్ 2'కి కాస్త హైప్ తక్కువగా ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు దాన్ని పెంచేలా నిర్మాత నాగవంశీ కామెంట్స్ చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులోనే నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?)
'సినిమా చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. చాలా బాగా వచ్చింది. చూసిన తర్వాత ఏ మాత్రం అసంతృప్తిగా అనిపించినా నన్ను పదింతలు తిట్టండి. నన్ను తిట్టడం మీకు అలవాటే కదా. అది అద్భుతమైన చిత్రం అని మీకు అనిపించకపోతే మళ్లీ ఎప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను. తొలిరోజు హిందీ నెట్ వసూళ్ల కంటే ఇక్కడ ఒక్క రూపాయి అయినా ఎక్కువ రావాలి. ఇప్పటివరకు తారక్ అన్న మనం కాలర్ ఎగరేసేలా చేశారు. ఈసారి మనం అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా చెయ్యాలి' అని చెప్పుకొచ్చాడు.
యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన వార్ 2 సినిమా.. ఈ సంస్థ తీసిన స్పై యూనివర్స్‌లో భాగం. తొలి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించగా.. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని నాగవంశీకి చెందిన సితార ఎంటర్ టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందుకేనేమో నాగవంశీ ఈ రేంజులో తారక్, వార్ 2 చిత్రానికి ఎలివేషన్లు ఇస్తున్నారా అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)