
ప్రస్తుతం టాలీవుడ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. తమకు 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చేంతవరకు షూటింగ్స్‌కి హాజరయ్యేది లేదని వర్కర్స్ యూనియన్స్ స్ట్రైక్ చేస్తున్నాయి. దీనికి పలువురు నిర్మాతలు సమ్మతించడం లేదు. ఈ విషయమై పలువురు ఫెడరేషన్ సభ్యులు.. చిరంజీవిని శనివారం కలిశారని, ఈ మేరకు చిరు వీళ్లకు హామీ ఇచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా చిరంజీవినే స్పందించారు. అసలు ఏం జరుగుతుందో చెప్పుకొచ్చారు.
'ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులం అని చెప్పుకొంటున్న కొందరు వ్యక్తులు.. మీడియాలోకి వెళ్లి నేను వారిని కలిసి 30 శాతం వేతన పెంపు తదితర డిమాండ్లకు అంగీకరించానని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా అసలు నిజమేంటో చెప్పాలనుకుంటున్నాను. ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ నేను కలవలేదు. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా, ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం, పరిష్కారం చూపడం సాధ్యం కాదు'
(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ')
'తెలుగు చిత్రసీమలో ఫిల్మ్ ఛాంబర్ అగ్రసంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత. అంతవరకు అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఇలాంటి అసత్య ప్రకటనలని నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి' అని చిరంజీవి తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు-ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్య తేలేంత వరకు షూటింగ్స్ చేయొద్దని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. అలానే ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతోనూ సంప్రదింపులు జరపొద్దని పేర్కొంది.
(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)
