మీనాక్షీ చౌదరి, నవీన్ పొలిశెట్టి, నాగవంశీ, రేవంత్, మారి
‘‘మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండగ. ఎన్ని బాధలున్నా మర్చిపోయి మన వాళ్లను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి పిండి వంటలు తింటూ నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి పండగ ఎనర్జీని మా ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా మా సినిమా ఉంటుంది’’ అని నవీన్ పొలిశెట్టి తెలిపారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు.
మారి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇదొక పర్ఫెక్ట్ పండగ సినిమా. అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘కుటుంబంతో కలిసి మా సినిమా చూడండి... హాయిగా నవ్వుకుంటూ ఈ సంక్రాంతి పండగను జరుపుకోండి’’ అని చెప్పారు. ‘‘మీ బాధలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోండి’’ అన్నారు మారి. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ‘అనగనగా ఒక రాజు’ రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు... ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది’’ అని తెలిపారు. బాల నటుడు రేవంత్ (బుల్లిరాజు) మాట్లాడాడు.


