‘హిట్‌’ డైరెక్టర్‌తో నాగార్జున​ కొత్త సినిమా | Akkineni Nagarjuna Upcoming Crime Thriller Movie Update, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

‘హిట్‌’ డైరెక్టర్‌తో నాగార్జున​ కొత్త సినిమా

Apr 27 2025 5:33 PM | Updated on Apr 27 2025 6:41 PM

Nagarjuna New Film Latest Update

‘నా సామిరంగ’ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించనున్న చిత్రంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదు. గత ఏడాది సంక్రాంతికి (జనవరి 14) విడుదలైన ‘నా సామిరంగ’ చిత్రం హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఏ సినిమానూ సెట్స్‌లో లేదు కానీ, రజనీకాంత్‌ ‘కూలీ’ చిత్రంతో పాటు ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమాలో నటిస్తున్నారు. 

కాగా సోలో హీరోగా చేసేందుకు పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ పచ్చజెండా ఊపలేదు ఆయన. ఇదిలా ఉంటే... ‘హిట్, హిట్‌ 2, సైంధవ్‌’ తదితర చిత్రాల ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నారనే టాక్‌ తాజాగా తెరపైకి వచ్చింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని భోగట్టా. గతంలో నాగార్జునకి వినిపించిన ఓ కథకి మరిన్ని మార్పులూ చేర్పులూ  చేసి, తాజాగా ఫైనల్‌ స్క్రిప్ట్‌ని వినిపించారట శైలేష్‌. 

ఈ కథ నాగార్జునకి నచ్చడంతో ఓకే చెప్పారట. బీహార్‌ రాష్ట్రంలో జరిగిన ఓ హత్య ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్‌. నాగార్జున పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండేలా శైలేష్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి... నాగార్జున సోలో హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ మే 1న విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement