
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘శివ’ ఓ ట్రెండ్‌సెట్టర్ మూవీ. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సినిమాను అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘శివ’. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుండటం చూసి, నా అన్నయ్య అక్కినేని వెంకట్, నేను ఈ సినిమాను గ్రాండ్‌గా రీ–రిలీజ్ చేయాలని భావించాం. ఈ ‘శివ’ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్‌లో చూసిన కొత్త జెనరేషన్‌కి కూడా థియేటర్స్‌లో మంచి అనుభవం ఇవ్వాలని అనుకున్నాం.
అందుకే రామ్‌గోపాల్ వర్మ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘నాగార్జున, నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లింది. ఈ సినిమాని రీ–రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్ ఇచ్చింది. అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కి మార్చాం. ‘శివ’ని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ.