బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ధురంధర్.. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆపై 2025లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని వర్మ అన్నారు. 2026 మార్చిలో రాబోయే 'ధురంధర్ 2' దక్షిణాదిని వణికించేలా ఉందని వర్మ అన్నాడు.
దర్శకుడు ఆర్జీవీ తాజాగా ధురంధర్ సినిమా క్రేజ్ గురించి మరోసారి కామెంట్ చేశారు. వచ్చే ఏడాది రానున్న ధురంధర్ 2 దక్షిణాది సినిమాను భయపెడుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్‌లో పుష్ప, కల్కి, కేజీఎఫ్, కాంతార వంటి దక్షిణాది చిత్రాల ప్రభావాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.
దక్షిణాదిలో ధురంధర్ ప్రభావం ఎలా ఉందో వర్మ ఇలా అన్నారు. 'బాలీవుడ్ మీదకు సడెన్‌గా దూసుకొచ్చిన సౌత్ సినిమాల ఫైర్‌ను ధురంధర్ మూవీతో దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో 'ధురంధర్ 2' ని రెడీ చేస్తున్నాడు. పార్ట్-2 గురించి నాకు తెలిసినంతవరకు మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే.., పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది.' అని వర్మ ట్వీట్ చేశాడు.
‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 మార్చి 19న సీక్వెల్ విడుదల కానుంది. హిందీతో పాటు, దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల కానుంది. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


