
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున (Nagarjuna Akkineni) దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. అగ్రనటుడు నాగార్జున కుమారుడైన హీరో నాగ చైతన్య–సమంత విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గైర్హాజరు
ఈ కేసు విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. పిటిషనర్ నాగార్జున కూడా గైర్హాజరు కావడంతో వారి తరుపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని వచ్చే విచారణకు హాజరు అవుతారని ఆమె తరఫు న్యాయవాది గుర్మిత్‌సింగ్ కోర్టుకు సూచించారు. దీంతో విచారణను ఈనెల 28కు వాయిదా వేసిన కోర్టు తప్పకుండా ఆ విచారణకు హాజరు కావాలని సూచించింది.
ఏం జరిగింది?
నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి కేటీఆర్ కారణమన్నారు. నాగార్జున, చైతన్య కలిసి.. సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని, అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందని ఆరోపణలు చేయడం పెను సంచలనమైంది. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే తనకుగానీ, తన కుటుంబానికి కానీ క్షమాపణ చెప్పలేదంటూ.. నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.