గోల్డెన్‌ మెమొరీస్‌ – ‘ముత్యాల ముగ్గు’ | muthyala muggu telugu classic film special | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ మెమొరీస్‌ – ‘ముత్యాల ముగ్గు’

Jan 25 2026 1:46 PM | Updated on Jan 25 2026 3:01 PM

muthyala muggu telugu classic film special

తెలుగుతెర నిగ్గు... బాక్సాఫీస్‌ రతనాల రగ్గు... ‘ముత్యాల ముగ్గు’

 పేరున్న హీరో కానీ, పాపులర్‌ హీరోయిన్‌ కానీ ఎవరూ లేని ఓ చిన్న సినిమా అది. కానీ అప్పట్లో పెద్ద హీరోల భారీ చిత్రాలను సైతం తలదన్ని, ఆబాలగోపాలాన్నీ అలరించింది. అనూహ్య విజయం సాధించింది. బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్‌గా రతనాల రంగవల్లులు తీర్చిదిద్దింది. అది... తెలుగు సినిమా వాకిట చెరగని, చెదరని ‘ముత్యాల ముగ్గు’. అక్షరాలా బాపు – రమణల మార్కు సెల్యులాయిడ్‌ నిగ్గు. ఓ సినీప్రియుడు అన్నట్టు... ఓ చిన్న టుమ్రీ లాగా మొదలైనా, రిలీజైన కొద్దివారాలకే మంత్రముగ్ధం చేసే మహత్తర గజల్‌గా మారిన రసరమ్య సంగీత మాలిక. ఇటీవలే మరణించిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిరి వారి ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’లో... ఇషాన్‌ ఆర్య ఛాయాగ్రహణ దృశ్యజాలపు అల్లిక. తెరపై నేటికీ వసివాడని కుటుంబానురాగాల నవ మల్లిక. రమణ రాత – బాపు తీతల్లో ఓ మైలురాయి. రావుగోపాలరావు నటనలో కలికితురాయి. 

అది 1975. ఆ ఏడాది ఆరంభమై అప్పటికి ఆరు నెలలు దాటిపోయింది. ఆ సంవత్సరం అప్పటికి తెలుగు చిత్రసీమలో వేళ్ళ మీద లెక్కపెట్టుకోగలిగినన్ని సినిమాలే విజయం సాధించాయి. ఇంకా చెప్పాలంటే, ఆ ఏడాదే కాదు... అప్పటికి కొంతకాలంగా ఇండస్ట్రీలో అదే పరిస్థితి. ఏటా దాదాపు 70 చలనచిత్రాల నిర్మాణం స్థాయికి తెలుగు సినీ పరిశ్రమ ఎదిగింది కానీ, వాటిలో అతి తక్కువే విజయం అందుకుంటున్న దుఃస్థితి. కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా 1976 కల్లా ‘స్మాష్‌’ అయిపోవడం ఖాయమని సాక్షాత్తూ అగ్రనటుడు అక్కినేని లాంటి వారు సైతం వ్యాఖ్యానించిన రోజులవి. అదిగో... సరిగ్గా అలాంటి సమయంలో 1975 జూలై 25న చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయం సాధించి, పరిశ్రమకు కొత్త ఊపిరి పోసిన ‘వి’చిత్రం... ‘ముత్యాల ముగ్గు’.  

‘లవకుశ’కు... ఆకట్టుకొనే సోషల్‌ వెర్షన్‌!

‘సాక్షి’తో మొదలైన బాపు దర్శకత్వ ప్రస్థానంలో అది తొమ్మిదో సినిమా. రచయితగా రమణకు రజతోత్సవ (25వ) సినిమా. కొత్త హీరో హీరోయిన్లతో, పాత్రధారులెవరికీ మేకప్‌ లేకుండా, అందులోనూ ఖరీదైన రంగుల్లో సినిమా నిర్మించడం ఆ రోజుల్లే ప్రయోగమే కాదు. పరమ మూర్ఖ సాహసం. అయినా, బాపు – రమణ చేశారు. అంతకు ముందు ఎనిమిదిన్నరేళ్ళ క్రితం తెలుగులో తొలిసారిగా పూర్తి ఔట్‌డోర్‌లో నెల రోజుల్లో ‘సాక్షి’ చిత్రం నిర్మించిన వారిద్దరూ...  ఈసారి మేకప్‌ లేకుండా, మొత్తం రంగుల్లో, 40 రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో ‘ముత్యాల ముగ్గు’ తీసి మరోసారి చరిత్ర సృష్టించారు. ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అని మరొక్కసారి రుజువు చేశారు.

అసలు ‘ముత్యాల ముగ్గు’ మరీ ప్రత్యేకమైన కథేమీ కాదు. సీతను అనుమానించిన శ్రీరామచంద్రుడు, రాజ్యం విడిచి అడవికి వెళ్ళాల్సి వచ్చిన సీత, అక్కడ ఆమెకు కలిగిన కవలపిల్లలు లవకుశులు, పిల్లల వల్ల చివరకు తల్లితండ్రులు తిరిగి చూసుకోవడం... ఇదే ఉత్తర రామాయణంలోని పురాణగాథ. దాన్నే కాస్తంత మార్చి, సోషలైజ్‌ చేసి, పిల్లలే క్రియాశీలంగా వ్యవహరించి తల్లితండ్రుల్ని కలిపితే? అదే ‘ముత్యాల ముగ్గు’ సినిమా స్క్రిప్టు. కాకపోతే, మొదట అనుకోని కాంట్రాక్టర్‌ (రావుగోపాలరావు) పాత్రను ఆ తర్వాత స్క్రిప్టులో చేర్చి, కథను మరింత రసవత్తరం చేశారు. పాత కథనే గొప్ప కథనంతో అద్భుతంగా పండించారు బాపు – రమణ.

హనుమంతుడి పాత్రను ప్రవేశపెట్టి, దీన్ని ‘సోషియో – ఫ్యాంటసీ’గా చేయడం మంచి బాక్సాఫీస్‌ ఫార్ములా. అంతకు ముందు ఎన్టీఆర్‌ – యస్వీఆర్‌ ‘దేవాంతకుడు’ (1960 జూలై 7)లో సక్సెసైన ఆ ధోరణిని శోభన్‌బాబును శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి, ఏయన్నార్‌ ‘బుద్ధిమంతుడు’ (1969 సెప్టెంబర్‌ 20)లోనూ బాపు–రమణలు సమర్థంగా వాడారు. అయితే, ‘ముత్యాల ముగ్గు’లో అది సంపూర్ణతను సంతరించుకొని, పెద్ద పేయింగ్‌ ఎలిమెంట్‌ అయింది. ఆ సినిమా తర్వాత ‘దేవుడే దిగివస్తే’ (1975 సెప్టెంబర్‌ 19) లాంటి పలు చిత్రాలు ఇలా ‘సోషియో – ఫ్యాంటసీ’ సూత్రాన్ని అనుసరించాయి.

అలాగే, రొటీన్‌కు భిన్నంగా తీస్తున్న ఈ సినిమాకు ‘కవల పిల్లల కథ’ లాంటి మూస ధోరణి పేర్లకు పోకుండా టైటిల్‌ కూడా భిన్నంగానే పెట్టారు. ‘తీరైన సంపద ఎవరింట నుండు... దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు...’ అనే ఈ చిత్ర కథావస్తువుకు తగ్గట్టు ‘ముత్యాల ముగ్గు’ అనే టైటిల్‌ను బాపు మొదట్లోనే నిర్ణయించారు.    

ప్రొడ్యూసరైన తెలుగు లెక్చరర్‌... ఎమ్వీయల్‌!
విజయవాడ దగ్గర నూజివీడులోని ‘ధర్మ అప్పరాయ కళాశాల’లో తెలుగు లెక్చరరైన ఎమ్వీయల్‌ ‘ముత్యాల ముగ్గు’తో నిర్మాత అవతారమెత్తారు. మచిలీపట్నం దగ్గర గూడూరులో జన్మించిన ఆయన పూర్తి పేరు – మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు. సంక్షిప్తంగా ఎమ్వీయల్‌. ఆయన స్వతహాగా మంచి కవి, రచయిత, వక్త. అప్పట్లో ఆయన ‘ప్రభవ’ అనే మాసపత్రికకు సంపాదకుడిగానూ వ్యవహరించారు. ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ‘యువజ్యోతి’ శీర్షిక నడిపారు. ఆ శీర్షిక ఆ రోజుల్లో పాఠకులకు పెద్ద ఆకర్షణ. వెంకటగిరి సంస్థానం రాజా గారి తమ్ముడి కుమారుడైన ఎం. సుకుమార్‌ ఆయన శిష్యుడే! ఆ శిష్యుడి కోసం తమకు ఓ సినిమా చేసిపెట్టమని బాపు – రమణల్ని ఎమ్వీయల్‌ అభ్యర్థించడంతో ‘ముత్యాల ముగ్గు’ పట్టాలెక్కింది.

తీరా మద్రాసు విజయా గార్డెన్స్‌లో పాటల రికార్డింగ్‌ జరుగుతున్న వేళ... తొంభై వేలిచ్చేసరికే వెంకటగిరి యువరాజా వారు చేతులెత్తేశారు. అయితే, బాపు – రమణల మాట మీద పంపిణీదారులైన ‘అన్నపూర్ణ ఫిలిమ్స్‌’ ఆదుకున్నారు. (అప్పట్లో సినీ పంపిణీ రంగంలో ఓ ప్రముఖ సంస్థ అన్నపూర్ణ ఫిలిమ్స్‌. ఆ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేరెవరో కాదు... ప్రముఖ నిర్మాత ‘జగపతి’ వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ తమ్ముడు కృష్ణప్రసాద్‌. నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, అగ్రనటుడు జగపతిబాబుకు సొంత బాబాయి. హీరో అక్కినేని సహా పలువురికి ఆ ‘అన్నపూర్ణ’ పంపిణీ సంస్థలో వాటాలుండేవి). అలా బాపు – రమణ పూనుకొని, ఆ ‘అన్నపూర్ణ ఫిలిమ్స్‌’ వారి సహాయ సహకారాలతో, ఇతర వనరులు కూడా కలుపుకొని పన్నెండున్నర లక్షల్లో ‘ముత్యాల ముగ్గు’ పూర్తి చేశారు. నిర్మాతగా ఎమ్వీయల్‌ పేరు, సమర్పకుడిగా సుకుమార్‌ పేరుతో రిలీజ్‌ చేశారు. చిన్న సినిమా కాస్తా విజయంలో పెద్ద సినిమా అయింది. మొత్తం కథే మారిపోయింది. అలా సినీరంగ ప్రవేశం చేసిన ఎమ్వీయల్‌ ఆ తర్వాత కాలంలో ‘గోరంత దీపం’, ‘స్నేహం’, ‘మనవూరి పాండవులు’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘ఓ ఇంటి భాగోతం’ సినిమాలకు సంభాషణలు రాశారు. అయితే... వేడుక అలవాట్లను వాడుక వ్యసనాలను చేసే రంగుల ప్రపంచం మాయలో పడి, 42 ఏళ్ళ పిన్న వయసులోనే 1986 జనవరి 23న కన్నుమూయడం ఎమ్వీయల్‌ కథకు యాంటీ క్లైమాక్స్‌.  

కొత్తవాళ్ళతో కలర్‌ఫుల్‌ మ్యాజిక్‌
‘ముత్యాల ముగ్గు’లో ప్రధానమైన నాయకుడు, నాయిక... ఇద్దరూ కొత్తవాళ్ళే. మంచి రూపం, కంఠస్వరం ఉన్న నటుడు శ్రీధర్‌ అంతకు ముందు ‘తల్లా? పెళ్ళామా?’(1970 జనవరి 8)తో మొదలుపెట్టి, ‘రైతుబిడ్డ’ (1971 మే 19) తదితర చిత్రాల్లో సహాయక పాత్రల్లో తెరపై కనిపించినా, ఆయనకు హీరోగా ప్రమోషన్‌ వచ్చింది మాత్రం ఈ చిత్రంతోనే! పూర్వాశ్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేసి, మంచి నాటకానుభవంతో సినిమాల్లోకి వచ్చారాయన. అందుకే, ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా ఈజ్‌తో, సాఫీగా ఈ నాయక పాత్ర పోషించగలిగారు. అలాగే, వరంగల్‌ నుంచి మద్రాసుకొచ్చి, సంగీతగా పేరు మార్చుకున్న లత (అదే ఆమె అసలు పేరు) హీరోయిన్‌గా అందరినీ ముగ్ధుల్ని చేశారు. తెరపై ప్రేక్షకుల ముందుకు రావడం ఆమెకు అదే తొలిసారి. నిజానికి, యు.విశ్వేశ్వరరావు దర్శకత్వంలోని ఎన్టీఆర్‌ ‘తీర్పు’ (1975 అక్టోబర్‌ 1) ఆమె నటించిన మొదటి సినిమా. కానీ, రిలీజైన తొలి సినిమా మాత్రం ‘ముత్యాల ముగ్గే’. చెంపకు చేరడేసి కళ్ళు, అందం, ముఖంలో పల్లెటూరి పిల్ల పాత్ర తాలూకు అమాయకత్వం, ఆత్మాభిమానాన్ని అలంకారంగా మలుచుకున్న ఆ పాత్ర వ్యక్తిత్వం... అన్నీ కలిసి తొలి సినిమాతోనే తార అయిపోయారు సంగీత. ఆపైన ‘ముత్యాల ముగ్గు’ బాపు బొమ్మగా ఇప్పటికి యాభై ఏళ్ళ పైగా కెరీర్‌ కొనసాగిస్తూనే ఉన్నారు.  

విలన్‌ రావుగోపాలరావుతో పాటు ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో దుష్టపాత్ర... అల్లు రామలింగయ్య పోషించిన జోగినాథం పాత్ర. దేవుడి ఆభరణాల దొంగతనం, కోపగించిన కోతి పీకడంతో పిచ్చిపట్టి, అచ్చం కోతి లాగా ప్రవర్తించే సన్నివేశాల్లో అల్లు మార్కు అనుభవం, అపారమైన అభినయ నైపుణ్యం కనిపిస్తాయి. ఆ తరువాత కాలంలో అనేక సినిమాల్లో ఇతర పాత్రల్లో సైతం సందర్భోచితంగా ఈ ‘ముత్యాల ముగ్గు’ మార్కు అభినయ ఛాయల్ని ఆయన ప్రదర్శించారు. ప్రేక్షకుల్ని పదే పదే మెప్పించారు. అదీ ‘ముత్యాల ముగ్గు’ చూపిన నటనా మార్గం.  

ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే అల్లు రామలింగయ్య రెండో కుమారుడు ఆకస్మికంగా మరణించారు. తన వల్ల దర్శక, నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని, ఊహించని ఆ పుత్రశోకాన్ని దిగమింగుకుని, వద్దంటున్నా సరే మూడోరోజు నుంచే తిరిగి షూటింగులో పాల్గొన్నారు అల్లు రామలింగయ్య. అలా ఓ చిన్న చిత్ర నిర్మాణానికి తోడ్పడడం, అంత కుటుంబ కష్టాన్ని సైతం పైకి కనపడనివ్వకుండా కెమెరా ముందు కామెడీ పండించడం ఆయనకే చెల్లింది. హీరో తండ్రిగా కాంతారావు, హీరో హీరోయిన్లను విడదీసే పాత్రలో ముక్కామల, నిత్యపెళ్ళికొడుకుగా నూతన్‌ప్రసాద్, ఇంకా ‘సాక్షి’ రంగారావు, సూర్యకాంతం, జయమాలిని, హలం తదితరులు ఈ చిత్రకథలోని ఇతర పాత్రలను సైతం చిరంజీవులుగా మార్చారు.  

పిల్లలు మెచ్చిన పవన సుత హనుమాన్‌!
 ‘ముత్యాల ముగ్గు’లో పిల్లల్ని అమితంగా ఆకర్షించిన హనుమంతుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో నటుడు అర్జా జనార్దనరావు అద్భుతంగా నటించారు. అంతకు ముందే బాపు – రమణలు శోభన్‌బాబుతో తీసిన ‘సంపూర్ణ రామాయణం’ (1972 మార్చి 16)లోనూ, ఎన్టీఆర్‌తో చేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’(1975 జనవరి 10)లోనూ ఆయనది అదే పాత్ర. ఆ పౌరాణికాల్లోనే కాదు, ఈ సాంఘిక చిత్రం ‘ముత్యాల ముగ్గు’లోనూ సాక్షాత్తూ ఆంజనేయ స్వామినే తెరపై చూస్తున్నామా అనిపించేలా ఆయన వేషం, భాష, అభినయం అన్నీ అద్భుతంగా అమరాయి. పిల్లలకు అండగా నిలిచి, దూరమైన వారి తల్లితండ్రులను మళ్ళీ కలిపే బాధ్యతను మోసిన రామభక్త హనుమాన్‌గా ఆ పాత్ర తీరు కొత్తగా ఉంటుంది. కథలోని కీలక పాత్రచిత్రణ రీత్యా ‘ముత్యాల ముగ్గు’లోని ఆ ఇద్దరు పిల్లలు (బాలనటులు రాధ, మురళి), ఆంజనేయ స్వామి పాత్రలే సినిమా చూసిన చిన్నారులకు సహజంగా ఫేవరెట్‌. ఈ సినిమా తర్వాత కూడా అర్జా జనార్దనరావు పలుమార్లు ఆంజనేయ పాత్రలో కనిపించారు. తెలుగుతెర ఆంజనేయుడిగా నేటికీ చెరగని చిరకీర్తిని ఆర్జించుకున్నారు.

సెల్యులాయిడ్‌పై శిల్పసౌందర్యం... ఇషాన్‌ ఆర్య పనితనం!
కోనసీమ పల్లెపట్టుల్లో, ప్రధానంగా గోదావరి ఒడ్డున పులిదిండి గ్రామంలో తీర్చిదిద్దిన ఈ ‘ముత్యాల ముగ్గు’కు బాపు ఏరికోరి ఎంచుకొని, తెలుగు తెరకు పరిచయం చేసిన విలక్షణ ఛాయాగ్రాహకుడు ఇషాన్‌ ఆర్య. ఆయన అసలు పేరు ఇర్షాద్‌ ఎహ్‌సాన్‌. అంతకు ముందే కోకాకోలా వాణిజ్యప్రకటనతో, అలాగే ఎం.ఎస్‌. సత్యూ దర్శకత్వంలో బలరాజ్‌ సహానీ నటించగా దేశవిభజన నేపథ్యంలో తీసిన కళాత్మక చిత్రం ‘గరమ్‌ హవా’ (1973)తో ఇషాన్‌ అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘గరమ్‌ హవా’ అప్పటికే ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా భారత ప్రభుత్వ నేషనల్‌ అవార్డుతో పాటు ప్రసిద్ధ ఆస్కార్‌ అవార్డులు, కాన్స్‌ చలనచిత్రోత్సవానికి కూడా నామినేట్‌ అయింది. అక్కినేని ‘అందాల రాముడు’ (1973)కే ఆయనను తీసుకుందామని బాపు అనుకున్నారు. కానీ, స్టార్‌ సినిమా కావడంతో రమణ సలహా మేరకు ఆగారు. ఈసారి అంతా కొత్తవాళ్ళతో తీస్తున్న ‘ముత్యాల ముగ్గు’తో ఆ కోరిక తీరింది.

మేకప్‌ లేకుండా నటీనటులను సహజంగా చూపిస్తూ... రిఫ్లెక్టర్ల లైటింగ్‌లో వేవేల వేడి ప్రకాశంతో వారిని మాడ్చేయకుండా, శాటిన్‌ గుడ్డ వాడి కాంతిని బౌన్సింగ్‌ చేసి, ప్రశాంతంగా... కంటికీ, మనసుకూ ఆహ్లాదం కలిగించేలా చిత్రీకరణ జరపడం ఇషాన్‌ ఆర్య స్టయిల్‌. అప్పటికే సుప్రసిద్ధులైన సినిమాటోగ్రాఫర్లు ఎందరికో ఇది పూర్తి భిన్నం. అయినా, ఈ తరహా చిత్రీకరణతోనే ఇషాన్‌ ఆర్య సెల్యులాయిడ్‌పై సన్నివేశాలను సౌందర్య శిల్పాలుగా మార్చారు. దానికి తోడు బాపు మార్కు పెయింటింగ్‌ తరహా కెమెరా ఫ్రేమింగ్, తెర నిండుగా టైట్‌ క్లోజప్పుల్లో ఆర్టిస్టుల హావభావాలు కలిసేసరికి... ‘ముత్యాల ముగ్గు’ చూసిన ప్రేక్షకులకు మతి పోయింది. సినిమా ఓ విజువల్‌ పొయిట్రీలా అనిపించింది. ఇషాన్‌ చూపిన ఆ పంచరంగుల కెమెరా పనితనానికి కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు దక్కింది.

‘ముత్యాల ముగ్గు’ తర్వాత మళ్ళీ ‘గోరంతదీపం’ (1978), ‘తూర్పు వెళ్ళే రైలు’ (1979) చిత్రాలకు కూడా బాపు కెమెరా కన్ను ఇషాన్‌ ఆర్యే! నిజానికి, ఇషాన్‌ పుట్టింది హైదరాబాద్‌లోనే. ప్రసిద్ధ ఉర్దూ రచయిత కైఫీ ఆజ్మీ కుటుంబానికి అత్యంత సమీప బంధువు. కైఫీ ఆజ్మీ సంతానమైన నటి షబానా ఆజ్మీకి కజిన్‌. షబానా సోదరుడైన బాబా ఆజ్మీ మొదట్లో ఇషాన్‌ దగ్గరే సహాయకుడిగా పనిచేసి, ఆనక స్వతంత్రంగా సినిమాటోగ్రాఫరయ్యారు. ఇంకా విశేషం ఏమిటంటే, ఇషాన్‌ కుమారుడైన సమీర్‌ ఆర్య సైతం సినిమాటోగ్రాఫరే! హృతిక్‌ రోషన్‌ పాపులర్‌ సినిమా ‘కోయీ... మిల్‌ గయా’ (2003) సహా పలు హిందీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.

రాజ ప్రాసాదంలో... రంగుల సినిమా
‘ముత్యాల ముగ్గు’ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ సినిమాలో కీలక భాగం షూటింగ్‌ జరిగిన ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’. తొమ్మిది పదులు దాటిన వయసులో ఇటీవలే మరణించిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిర్‌ తాత తండ్రులు కట్టించిన ప్రాసాదం ఇది. 1890 ప్రాంతంలో మొత్తం మూడు దశల్లో... రాజా జ్ఞాన్‌ గిర్‌జీ బహదూర్, నరసింగ్‌ గిర్‌జీ బహదూర్, రాజా ధన్‌రాజ్‌గిర్‌జీ బహదూర్‌లు ముగ్గురి హయాంలో ఆ కోట లాంటి ఇంటిని కట్టారు. ఒకప్పుడు యావత్‌ దక్షిణ భారతదేశంలో నిజామ్‌ ప్రభువు తర్వాత అత్యంత సంపన్న కుటుంబం వారిదే! మహారాజ్‌ నర్సింగ్‌గిర్‌ ధన్‌రాజ్‌గిర్‌ జ్ఞాన్‌ బహదూర్‌ అప్పట్లో నిజామ్‌ ఆస్థానంలో ప్రముఖ వర్తకుడు, బ్యాంకర్‌. అంతేకాక, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్‌ ఆరా’ (1931) హీరోయిన్‌ అయిన జుబేదాను వివాహమాడిన వ్యక్తి. హైదరాబాద్‌లో తొలినాళ్ళలో సినీ పరిశ్రమను ప్రోత్సహించినవారిలో ఈ ధన్‌రాజ్‌గిర్‌ కుటుంబం కూడా ఒకటి. రాజా నరసింగ్‌గిర్‌ ఒకానొక సమయంలో రైల్వే సంస్థ ఏర్పాటు కోసం సాక్షాత్తూ ఆరో నిజామ్‌ నవాబుకు ఋణం ఇచ్చారు. ఆయన మనుమరాలే రాజకుమారి ఇందిర.

చివరి దాకా ఆమె నివాసమైన ఆ ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’కే ‘ధన్‌రాజ్‌ గిర్‌ ప్యాలెస్‌’ అని కూడా పేరు. మొత్తం యూరోపియన్, ఇండో– శారసెనిక్‌ సమ్మిళిత శైలిలో సున్నపురాయి, చలువరాయి వాడి నిర్మించిన ప్రాసాదం అది. దాదాపు 8 ఎకరాల స్థలంలో, సుమారు 30 వేల చదరపు అడుగుల మేర 19 సూట్లతో ఉంటుంది. స్వతహాగా కవయిత్రి – కళాభిమాని అయిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిర్‌ తన భావాలకు సరితూగే కవి గుంటూరు శేషేంద్రశర్మతో ఆ ప్యాలెస్‌లో జీవనం గడిపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున గోషామహల్‌ ప్రాంతంలో పాన్‌ మండీ వద్ద శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ప్యాలెస్‌ అది. తరచూ కవులు – కళాకారుల భేటీలతో సాంస్కృతిక కేంద్రంగా వెలిగిన ఆ ప్యాలెస్‌లోనే ‘ముత్యాల ముగ్గు’ షూటింగ్‌ జరిగింది. ఆ సినిమా చిత్రీకరణకు ప్యాలెస్‌ను ఉపయోగించుకునేందుకు రాజకుమారి ఇందిర ఉదారంగా అనుమతించారు.

హీరో నివాసానికి సంబంధించిన కీలక ఘట్టాల షూటింగ్‌ అక్కడే జరిగింది. ఆ ప్యాలెస్‌ వాకిటనే ఉదయం వేళ ముగ్గు వేస్తూ హీరోయిన్‌ సంగీత పాడే ‘ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ...’ పాటను చిత్రీకరించారు. నిండుగా నగలు ధరింపజేసి హీరోయిన్‌ను పుట్టింటికి పంపేసే కీలకమైన నగల సీన్‌ తీస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఇందిర, ‘గిల్టు నగలెందుకు?’ అంటూ రత్నాలు, వజ్రాలు పొదిగిన అచ్చమైన తమ ఇంటి బంగారు నగలనే షూటింగ్‌కు ఇవ్వడం మరో విశేషం. బాపు ‘ముత్యాల ముగ్గు’ తర్వాత బాలకృష్ణ – విజయశాంతితో రాఘవేంద్రరావు తీసిన ‘పట్టాభిషేకం’ (1985 డిసెంబర్‌ 21) సహా మరికొద్ది చిత్రాల్లో మాత్రమే వెండితెరపై ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’ కనువిందు చేసింది. అటుపైన పెద్ద పెద్ద సినిమా షూటింగ్‌లకు సైతం ఆ రాజప్రాసాదం తలుపులు తెరుచుకోనే లేదు.

కలిసొచ్చిన అనుకోని ఇబ్బంది!
కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు సైతం కలిసొచ్చిన అదృష్టాలుగా మారతాయి. ‘ముత్యాల ముగ్గు’ షూటింగ్‌లో అలాంటిదే జరిగింది. జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో షెడ్యూల్‌ పూర్తి చేశాక, విలనైన కాంట్రాక్టర్‌ రావు గోపాలరావు ఇంటి సీన్లు తీయాలి. అందు కోసం హైదరాబాద్‌ సారథీ స్టూడియోలో సెట్టు బుక్‌ చేసున్నారు. ఎల్లుండి షూటింగ్‌ అనగా ఇవాళ స్టూడియో వారు పిలిచి, ఆ సెట్‌ ఎవరో పెద్దవాళ్ళు తీసుకున్నారనీ, వీళ్ళకివ్వడం కుదరదనీ చెప్పారు. పోనీ భోజనాలకు వాడే షెడ్డు ఇవ్వమన్నా ససేమిరా అన్నారు. డైనింగ్‌ హాలులో షూటింగ్‌ చేసినా, స్టూడియోలోకి ఆ సౌండ్‌ చొరబడుతుందనీ, సాధ్యం కాదనీ కుండబద్దలు కొట్టేశారు. ‘‘ఎలాగరా అని బాధపడుతూ రాక్‌ క్యాజిల్‌ హోటల్‌లో ‘ఉపద్రవాలు’ తాగుతూ ఆలోచిస్తున్నాం. ఆ కొండ మీది బండలూ, వాటి చాటున గదులూ, దారులూ, ఆ వెనక చక్కటి లాన్‌ ఆకర్షించాయి. అంతే... సినిమాలోని కాంట్రాక్టర్‌ ఇల్లూ, హలం డ్యాన్సూ – మొత్తం అంతా అక్కడ కుదిరిపోయాయి. సినిమా తరహాయే మారిపోయింది’’ అని బాపు పేర్కొన్నారు.

ఆ హోటల్‌లోనే కొన్ని రూములు అద్దెకు తీసుకొని బస చేస్తూ అక్కడే షూటింగ్‌ చేశారు. షూటింగ్‌కు అద్దె ఇస్తామన్నా, కనీసం గిఫ్టు ఇస్తామన్నా ఆ ప్రొప్రయిటర్‌ వద్దు అన్నారట. ‘రోజూ ఉదయం మీరు వెలిగించే అగరొత్తుల ప్యాకెట్‌ (ఆ రోజుల్లోనే ప్యాకెట్‌ అయిదు రూపాయలున్న ‘సాయి ఫ్లోరా’) ఒకటి ఇవ్వండి చాలు’ అన్నారట. అలా దేవుడిచ్చిన ఆ నేచురల్‌ స్టూడియోలోనే... ఆకాశంలో సూర్యుణ్ణి చూస్తూ రావుగోపాలరావు తన సెక్రటరీతో, ‘అబ్బా... సెగట్రీ... ఎప్పుడూ పనులు, బిగినెస్సేనా? ఆ... పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ...’ లాంటి డైలాగులు  సీన్లన్నీ అక్కడ తీసినవే!

సాహితీ భావాల త్రివేణి! సంగీత బాణీల అలివేణి!!
మామ కె.వి. మహదేవన్‌ సంగీతంలో ‘ముత్యాల ముగ్గు’ పాటలన్నీ అప్పట్లో మహా పాపులర్‌. అభ్యుదయ కవి ఆరుద్ర, అనుభూతివాద కవి శేషేంద్ర, ఆధునిక గేయకవి సినారె... ఈ అపురూప త్రయం రాసిన ఈ సినిమాకు రాసిన సాహిత్యం నేటికీ నిత్యనూతనమే! శ్రీరామనవమి సహా ఏ పండగ వచ్చినా ప్రతి భక్తిగాన సందర్భంలోనూ కర్ణాటక సంగీత విద్వన్మణి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గళంలో ‘శ్రీరామ జయరామ సీతారామ...’ అన్న ఆరుద్ర రచన వినపడాల్సిందే! పలు సంప్రదాయ స్త్రీల పాటల ప్రభావంతో ఆరుద్ర రాయగా, పి. సుశీల ప్రాణం పోసిన ‘ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ... ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ... ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన... మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ....’ ఆల్‌టైమ్‌ హిట్‌.

రామకృష్ణ గొంతులో వినిపించే ఆరుద్ర మరో రచన – ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు... గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు...’. ఆ సాహిత్యం, ఆ బాణీ, ఇషాన్‌ ఆర్య కెమెరా కంటితో కోనసీమ అందాల నడుమ గోదావరిపై ఆ పడవ ప్రయాణం చిత్రీకరణల... అన్నీ కలసి అదో మరపురాని లలిత లావణ్య ప్రణయ గీతం. ఇక, తెలంగాణలో సుప్రసిద్ధమైన మరో జానపద గేయఫణితిని ఎత్తుగడగా చేసుకొని, దాన్ని అందమైన ప్రేమగీతంగా సినారె మలిచిన  ‘గోగులు పూచె గోగులు పూచె ఓ లచ్చగుమ్మడీ...’ మరో మరపురాని పాట. సినారె రాసిన ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ అన్న జావళీ... సాహిత్యపు సొంపులు, తెరపై నటి హలం ఒంపులతో గుమ్మెత్తిస్తుంది. నిజానికి, సెకండాఫ్‌లోని ‘నిదురించే తోటలోకి...’ మినహా మిగతా పాటలన్నీ ఈ సినిమాలో ఫస్టాఫ్‌లోనే వస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఆ ఒక్కటి కూడా నేపథ్యగీతం. కమర్షియల్‌గా అది దుస్సాహసమే! అయినా, జనం మాత్రం అదేమీ ఆలోచించకుండా హాయిగా సినిమా చూసేశారు.

సినీతోటలోకి... శేషేన్‌ పాట ఒకటి వచ్చింది!
 ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది... సుప్రసిద్ధ కవి – విమర్శకుడు – పండితుడు గుంటూరు శేషేంద్రశర్మ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రాసిన పాట. ‘నా దేశం – నా ప్రజలు’, ‘ఆధునిక మహాభారతం’, ‘కవిసేన మేనిఫెస్టో’ లాంటి రచనలతో సుకవితా వేద్య సుప్రసిద్ధుడైన శేషేంద్ర సినిమాకు పాట రాయడం అదే తొలిసారి. అదే చివరిసారి కూడా! బాపు – రమణల బలవంతం మేరకు ఆయన ఆ పాట రాశారు. అక్షరాక్షరంలో అనుభూతి నింపే శేషేన్‌... ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అన్న ఆ పాటను కూడా అంతే కవితాత్మకంగా రాశారు. సినీగీతాన్ని సైతం నిక్కమైన కవిత్వానికి అచ్చమైన చిరునామాగా మలిచారు. ‘‘శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది... ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది’’, ‘‘నది దోచుకుపోతున్న నావను ఆపండి... రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’’ లాంటి ఆ పాటలోని అనేక పంక్తులే అందుకు ఉదాహరణ. సర్వసాధారణంగా సినిమా పాటకు ఒదగని కవితా మేలిబంతులవి. అయినా ఆ పాట, దానికి మామ కట్టిన వరుస, చిత్రీకరణ, కూర్పు... సగటు సినీ ప్రేక్షకుడి స్థాయినీ, అభిరుచినీ పెంచాయి. అదీ ఆ పాట ఘనత, చెదిరిపోని ‘ముత్యాల ముగ్గు’ చరిత.

ఆల్‌టైమ్‌ హిట్‌ డైలాగ్స్‌తో... ‘స్టార్‌’ గోపాలరావు!
‘ముత్యాల ముగ్గు’ సినిమాతో పాటు అందులోని డైలాగులూ అంతే ఫేమస్‌. నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, ఆగి ఆలోచింపజేసే మాటలు... ఒకటా, రెండా... సినిమా అంతా ముళ్ళపూడి వెంకట రమణ రచనా విశ్వరూపం చూడవచ్చు. కథానాయిక పాత్ర నోట వినిపించే ‘‘కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది’’, ‘‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు’’, ‘‘సుఖమూ సంతోషమూ... డబ్బున్న మేడల్లో కాదు, మనసున్న మనుషుల పక్కన ఉంటాయని తెలుసుకున్నాను’’ లాంటి అర్థవంతమైన డైలాగులు అప్పటికీ ఇప్పటికీ ఆలోచింపజేసేవే. అలాగే, అతిగా పొగిడేవాళ్ళను గమనించి జాగ్రత్తపడాలన్న అంశాన్ని రావు గోపాలరావు పక్కనే ప్రత్యక్షమయ్యే మృదంగ బృందం రూపంలో నవ్విస్తూనే, నషాళానికి అంటేలా చెప్పారు దర్శక, రచయితలు.

అంతకు ముందు అనేక పాత్రలు చేసినా... రావుగోపాలరావును రాత్రికి రాత్రికి సూపర్‌స్టార్‌ను చేసేసిన సినిమా ఇదే. కథలో చెడ్డపనులు చేసే కాంట్రాక్టర్‌ పాత్రలో రావుగోపాలరావు నటనకూ, తూర్పు గోదావరి జిల్లా మాండలికంలో, చిత్రమైన మాడ్యులేషన్‌తో కూడిన డైలాగులకూ ముచ్చటపడని ప్రేక్షకులు ఆ రోజుల్లో లేరంటే అతిశయోక్తి కాదు.  ‘వార్‌ దాన్సిగ తరగ’ అనే ఊతపదంతో సహా ‘అలోవలోవ్, పబ్లిక్‌ సిటీ, డిక్కీలో తొంగోబెట్టేస్తా, కరుసయిపోగలవు, కలాపోసన, ఆ ముక్క నే లెక్కెట్టక ముందు సెప్పాల, ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యరేటండీ, నిచ్చె పెళ్ళికొడుకు, సీరలు సీరలు (ఇంగ్లీష్‌ ‘ఛీర్స్‌’కు బదులుగా), సినేమా కతలు సెప్పద్దన్నానా...’ లాంటి ప్రయోగాలు రావు గోపాలరావు నోట లక్ష్మీ బాంబుల్లా భలే పేలాయి.

ముఖ్యంగా, సూర్యోదయాన్ని చూస్తూ ‘పైనేదో మర్డర్‌ జరిగినట్టు లేదూ... ఆకాశంలో? సూరీడు నెత్తురుగడ్డలా లేడూ? ...మడిసన్నాక కాసింత కలాపోస నుండాలయ్యా? ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటది?’ అంటూ సెక్రటరీ (నటుడు కాకరాల)తో రావుగోపాలరావు జరిపే సంభాషణ తెలుగు సినీ చరిత్రలో నేటికీ చిరంజీవి. అలాగే, కనిపించేది కొద్ది క్షణాలే అయినా... కాంట్రాక్టర్‌ దగ్గరకు వచ్చి ‘కాలు కెంతవుద్ది? కాలేజీ సీటు కెంతవుద్ది? పెసిడెంటు సీటు కెంతవుద్ది? మడ్డరు కెంతవుద్ది? ...ఓలు మొత్తం ఓల్‌సేల్న ఎంతవుద్ది? కన్సెసన్‌ ఏవన్నావుందా?’ అంటూ నోటిలో సిగరెట్‌తో, చేతితో చిటికెలు వేస్తూ నటుడు మాడా వెంకటేశ్వరరావు మాట్లాడే సీనూ, ఆ డైలాగులూ అంతే!
    
పబ్లిసిటీ బాగా జరిగి, కలెక్షన్లు పెరగడానికి సాఫ్ట్‌ విలనీ చూపిస్తూ రావు గోపాలరావు పోషించిన ఆ కాంట్రాక్టర్‌ పాత్ర, ఆ పాత్ర∙డైలాగులు తోడ్పడ్డాయి. అంతే, ఆయన సంభాషణలున్న సన్నివేశాల్లోని ‘ముత్యాల ముగ్గు’ డైలాగుల ట్రాక్‌ను గ్రామ్‌ఫోన్‌ కంపెనీ వారు అప్పట్లోనే రెండు ‘ఇ.పి.’ మోడ్‌ రికార్డులుగా తీసుకొచ్చారు. తర్వాత కాలంలో అదే ఆడియో క్యాసెట్లుగానూ వచ్చింది. అంతకు ముందు అక్కినేని ‘సుడిగుండాలు’ సినిమా డైలాగులు 78 ఆర్‌.పి.ఎం. రికార్డులుగా వచ్చినా, ఒక తెలుగు సినిమా డైలాగులు మోస్ట్‌ పాపులరై, జనం ఎగబడి ఆ డైలాగ్‌ రికార్డుల్ని కొనడం మాత్రం ‘ముత్యాల ముగ్గు’తోనే మొదలు. ఆ డైలాగులు ఎంత పాపులరంటే... అప్పట్లోనే అవి పది వేల జతల రికార్డులు అమ్ముడవడం మరో పెద్ద రికార్డ్‌. కేవలం రికార్డుల అమ్మకంపై ఇచ్చే 10 శాతం రాయల్టీతో ఆ రోజుల్లోనే రచయిత రమణకు ఏకంగా రూ. 40 వేలు వచ్చింది. 

సినిమా చూడడం మీదే కాక కేవలం డైలాగులే అలా పదే పదే వేసుకొని వినడం మీద జనానికి అంత క్రేజు నెలకొందంటే, ‘ముత్యాల ముగ్గు’ ఏ రేంజ్‌ హిట్టో చెప్పనక్కర లేదు. అందుకు ముళ్ళపూడి రాత, బాపు తీత, రావుగోపాలరావు చేత కారణమని చెప్పక తప్పదు. ‘ముత్యాల ముగ్గు’ డైలాగ్స్‌ గ్రామ్‌ఫోన్‌ రికార్డుల తర్వాత ఎన్టీఆర్‌ ‘దానవీరశూర కర్ణ’, ‘యమగోల’ (1977), నూతన్‌ప్రసాద్‌ ‘చలిచీమలు’ (1978) నుంచి ఎన్టీఆర్‌ ‘బొబ్బిలిపులి’ (1982) దాకా వరుసగా అనేక హిట్‌ చిత్రాల డైలాగ్‌ ట్రాక్‌లు అప్పటికి వచ్చిన ఎల్‌.పి. రికార్డుల పద్ధతిలో మార్కెట్‌లో రిలీజై,  జనాన్ని ఆకర్షించాయి. అలా సినిమాల డైలాగ్స్‌ ట్రాక్‌ గ్రామ్‌ఫోన్‌ రికార్డులకూ ‘ముత్యాల ముగ్గు’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయింది.

జనాకర్షక మార్కెటింగ్‌ వ్యూహాలు!
బెజవాడకు చెందిన ప్రసిద్ధ అన్నపూర్ణ ఫిలిమ్స్‌ పంపిణీ చేసిన ‘ముత్యాల ముగ్గు’ ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది. రిలీజ్‌ సమయంలో ఆబాలగోపాలాన్నీ థియేటర్లకు ఆకర్షించేందుకు సినిమా పంపిణీదారులు, ప్రదర్శకులు వివిధ రకాల మార్కెటింగ్‌ టెక్నిక్స్‌ వాడారు. రిలీజ్‌ రోజున విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మార్నింగ్‌ షో, మ్యాట్నీలకు ప్రేక్షకులందరికీ ‘ముత్యాల ముగ్గు’ లాకెట్లు ఉచితంగా ఇచ్చారు. హైదరాబాద్‌ లాంటి చోట్ల ఈ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు పలువురు టికెట్‌తో పాటు హనుమంతుడి టోకెన్‌ ఒకటి చిన్నది ఉచితంగా తీసుకున్న సంగతి ఇప్పటికీ అపురూపంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ మార్కెటింగ్‌ ఎత్తుగడ సైతం సినిమాకు బాగా లాభించింది. అదో రకం మంచి మౌత్‌ పబ్లిసిటీ తెచ్చింది.

అంతటితో ఆగలేదు. విజయవాడ లాంటి పట్నాల్లో అప్పట్లో ప్రత్యేకంగా అరచేతి సైజులో ‘ముత్యాల ముగ్గు’ పాటల పుస్తకం ప్రచురించి, మహిళా ప్రేక్షకులకు థియేటర్ల వద్ద ఉచితంగా ఇచ్చేవారు. అది కేవలం సినిమా పాటల పుస్తకమే కాదు. ముగ్గుల పుస్తకం కూడా! ఎందుకంటే, అందులో సినిమాలోని పాటలతో పాటు... రకరకాల మెలికల ముగ్గులు, ఎన్ని చుక్కలతో ఎలా ముగ్గు వేయాలన్న వివరంతో సహా అన్నీ ఉండేవి. దాంతో, ఆ చిన్న సైజు ‘ముత్యాల ముగ్గు’ పుస్తకానికి మహిళల్లో భలే క్రేజుండేది. అందులోని ఆ ముగ్గులను ఇళ్ళ ముందు రంగవల్లులుగా తీర్చిదిద్దడంలో ఆడపిల్లలు పోటీలు పడేవారు. అలా ముగ్గులతో పాటు సినిమా కూడా జనం నోళ్ళలో నానడం... అతి పెద్ద మార్కెటింగ్‌ వ్యూహమైంది. అలా ఆ రోజుల్లోనే ‘ముత్యాల ముగ్గు’ అనేక కొత్త తరహా ప్రచార ధోరణులకు నాంది పలికింది.

పబ్లిసిటీ యాడ్స్‌లోనూ ప్రత్యేకత
బాపు – రమణలకు సన్నిహితుడైన ప్రముఖ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ జి.ఎన్‌. భూషణ్‌ ప్రెస్‌ రిలేషన్స్‌కు పనిచేసిన ఈ చిత్రం పబ్లిసిటీలోనూ కొత్త పోకడలు పోయింది. టైటిల్‌కు తగ్గట్టే ముగ్గుల్ని పబ్లిసిటీ డిజైన్‌లో భాగం చేశారు. అలాగే, నటీనటుల టైట్‌ క్లోజప్‌ ఫోటోలను డిజైన్లలో ఎక్కువగా వాడి, చూపరులకు కొత్త ఫీల్‌ తీసుకొచ్చారు. పూర్వాశ్రమంలో ప్రఖ్యాత యాడ్‌ ఏజెన్సీల్లో పనిచేసిన అనుభవం ఉన్న బాపు... సర్వసాధారణంగా వాణిజ్య ఉత్పత్తుల పబ్లిసిటీ డిజైనింగ్‌లో కనిపించే పద్ధతిని ఈ సినిమా పబ్లిసిటీ యాడ్స్‌కు వాడారు. పేజీలో చాలా భాగం ఖాళీ ఉంచి, కంటికి కావాల్సినంత రిలీఫ్‌ ఇస్తూ, ఓ మూలన 200వ రోజు అంటూ సినిమా టైటిల్, ప్రధాన వ్యక్తుల పేర్లు వేయడం లాంటి యాడ్‌ పబ్లిసిటీ టెక్నిక్‌లతో అబ్బురపరిచారు. బాపు ఏనాడో చూపిన ఆ బాట ఆ తర్వాత చాలామందికి అనుసరణీయమైంది. చాలా ఏళ్ళ తర్వాత దర్శకుడు మణిరత్నం సైతం నాగార్జున ‘గీతాంజలి’ (1989 మే 12) లాంటి తన సినిమాల పబ్లిసిటీకి ఈ తరహా యాడ్స్‌ను డిజైన్‌ చేయించడం మరపురాని విషయం.∙

సినిమా నవలా సూపర్‌హిట్టే!
‘ముత్యాల ముగ్గు’ తొలి రిలీజు నాడే ఆ సినిమాకు సంబంధించిన వెండితెర నవల కూడా మార్కెట్‌లోకి వచ్చింది. ఆ సినిమాకు నిర్మాతగా క్రెడిట్‌ అందుకున్న తెలుగు లెక్చరర్, స్వయంగా రచయిత అయిన ఎమ్వీయలే ఆ వెండితెర నవలీకరణ చేయడం విశేషం. బాపు – రమణల ‘సాక్షి బుక్స్‌’ పేరిట విజయవాడలోని నవోదయ పబ్లిషర్స్‌ అధినేత ఎ. రామ్మోహనరావు ఆ నవలను ముద్రించి, సోల్‌ డిస్ట్రిబ్యూషర్‌గా వ్యవహరించారు. సినిమాతో పాటు ఈ వెండితెర నవల కూడా సూపర్‌హిట్‌. సినిమా రిలీజైన కొద్ది రోజులకే అన్ని కాపీలూ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ‘ముత్యాల ముగ్గు’ 50వ రోజుకు చేరుకొనే సమయానికి నవల రెండో ముద్రణకు వచ్చేసింది. నూటయాభై రోజుల నాటికి ఆ ముద్రణ కూడా అయిపోయింది. 1976 మార్చికి ముచ్చటగా మూడో ముద్రణ వచ్చేసింది. అలా ఒక సినిమా తాలూకు వెండితెర నవల అంతగా ప్రాచుర్యం పొందడం, అన్ని కాపీలు అమ్ముడుపోవడం కూడా అప్పట్లో ‘ముత్యాల ముగ్గు’ చేసిన మ్యాజిక్‌. ఎన్నో ముద్రణలు పొందిన ఆ వెండితెర నవల ఇటీవల ‘అక్షజ్ఞ పబ్లికేషన్స్‌’ ద్వారా మళ్ళీ కొత్తగా ప్రచురితమైంది. యాభై ఏళ్ళ నాటి ఆ సినిమా నవల ఇలా నేటికీ పాఠకాదరణకు నోచుకోవడం నిజంగానే విశేషం.

పోటాపోటీలో... 300 రోజుల బాక్సాఫీస్‌ బంపర్‌హిట్‌
1975 జూలై చివరలో ‘ముత్యాల ముగ్గు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకపక్కన హిందీ హిట్‌ ‘యాదోంకీ బారాత్‌’కు రీమేకైన అగ్ర హీరో ఎన్టీఆర్‌ ‘అన్నదమ్ముల అనుబంధం’ అప్పటికే రిలీజై, జోరు మీదుంది. మంచి వసూళ్ళతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. మరోపక్కన రంగనాయకమ్మ పాపులర్‌ నవల ఆధారంగా, వరుస విజయాల హీరో శోభన్‌బాబుతో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బలిపీఠం’ వచ్చి వారమే అయింది. వేరొకపక్క కృష్ణ – వాణిశ్రీ జంటగా కాశ్మీర్‌ లాంటి సుందర ప్రదేశాల్లో కె.ఎస్‌. ప్రకాశరావు దర్శకత్వంలో ‘చీకటి వెలుగులు’ వచ్చి రెండే వారాలైంది. ఇక, ‘ముత్యాల ముగ్గు’ వచ్చిన సరిగ్గా వారం రోజులకల్లా కృష్ణంరాజు – జయప్రద తదితరులు నటించిన ‘నాకూ స్వతంత్రం వచ్చింది’ రిలీజైంది. ‘ముత్యాల ముగ్గు’ వచ్చి ఇరవై రోజులైందో లేదో, శోభన్‌బాబు ‘జేబుదొంగ’ (1975 ఆగస్ట్‌ 15న రిలీజ్‌) సైతం థియేటర్లలో వచ్చి చేరి, హిట్టయింది.  

అదిగో... అలాంటి గట్టి పోటాపోటీ సమయంలో, అందరు స్టార్‌ హీరోల సినిమాల మధ్య, ఎలాంటి స్టార్లూ లేకుండా రిలీజైన ‘ముత్యాల ముగ్గు’ ఆ పెద్ద చిత్రాలను తట్టుకొని, బలంగా నిలబడింది. ఇంకా చెప్పాలంటే వాటన్నిటినీ అధిగమించి మరీ, అఖండ విజయం సాధించింది. బ్లాక్‌బస్టర్‌ సూపర్‌హిట్టయింది. అదీ అసాధారణ విషయం. మొదటి వారం కాస్త అటూ ఇటూగా ఉన్నా, రెండోవారం అందుకున్న సినిమా కలెక్షన్లు, మూడోవారానికల్లా బాగా పుంజుకొన్నాయి. ఆపైన సినిమా ఆగకుండా దూసుకుపోయింది.  

మొత్తం 28 కేంద్రాల్లో 29 థియేటర్లలో రిలీజైన ‘ముత్యాల ముగ్గు’ 12 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. చిత్రంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లు రెంటిలోనూ వేర్వేరుగా వంద రోజులు ఆడడం విశేషం. ఆ రోజుల్లోనే ఫస్ట్‌ సెట్‌లో విడుదలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి... 5 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకొంది. సెకండ్‌ సెట్‌లో రిలీజైన మరో కేంద్రం బెంగుళూరులోనూ ‘మినర్వా’ థియేటర్‌లో ఆ పైన సిల్వర్‌ జూబ్లీ చేసుకొంది. అక్కడ ఏకంగా 200 రోజులు దిగ్విజయంగా నడిచింది. ఇక, తిరుపతి ‘మినీ ప్రతాప్‌’లో అయితే ఈ సినిమా 260 రోజులు ఆడడం మరో విశేషం. తెలుగు రాజధాని హైదరాబాద్‌లో షిఫ్టులతో ఏకంగా 300 రోజులు నడిచిందీ సినిమా. 
    
‘ముత్యాల ముగ్గు’ చిత్ర శతదినోత్సవం 1975 నవంబర్‌ 1 ఉదయం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ఘనంగా జరగగా, త్రిశత దినోత్సవాన్ని 1976 మే 21న మద్రాస్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో నిర్వహించారు. హైదరాబాద్‌ సహా తెలుగు ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో తీసుకువచ్చిన ‘బాలానంద సంఘం’ బాలబాలికల ముందు ఆ 300 రోజుల వేడుక జరిగింది. సరిగ్గా ఆ వేడుక జరిగిన వారం రోజులకు మే 29న బాపు – రమణల మరో బంపర్‌హిట్‌ పౌరాణిక గాథ కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ రిలీజవడం విశేషం.

ఎన్టీఆర్‌ మెచ్చిన త్రీ మచ్‌ సినిమా!
‘ముత్యాల ముగ్గు’లో వెన్నెల్లో మల్లెపందిరి కింద హీరో హీరోయిన్ల శోభనం రాత్రి çసన్నివేశాలు, వాటిని అశ్లీలంగా కాక అందమైన అనుభవంగా చిత్రీకరించిన విధానం, ఆ నేపథ్య సంగీతం... వగైరాలను అగ్ర హీరో ఎన్టీఆర్‌ సైతం ఎంతో మెచ్చుకున్నారు. ‘మా పాతరోజులు గుర్తొచ్చాయి బ్రదర్‌’ అని బాపు – రమణలతో అన్నారు. ‘‘ఎన్టీఆర్‌ మాతో, ‘అసలు మీ సినిమాలో కుర్రాడు... విలన్‌ దగ్గర సర్వెంటుగా రావడం హైలైట్‌! ఏముంది? ‘బాలనాగమ్మ’లో బాలవర్ధిరాజు... మాయల ఫకీరు కోటలో చేరినట్టే! మీరు ఇంకాస్త డోసు పెంచితే సినిమా టూ హండ్రెడ్‌ డేస్‌ పోయేది’ అని, ఓ క్షణం ఆగి – ‘ఓహో! మొన్న త్రీ హండ్రెడ్‌ డేస్‌ అయింది కదూ. ఇది టూ మచ్‌... కాదు కాదు త్రీమచ్‌’ అని అట్టహాసంగా నవ్వేశారాయన’’ అని బాపు స్వయంగా పేర్కొన్నారు.  

స్టార్లకు సైతం దక్కని సిల్వర్‌జూబ్లీ హిస్టరీ!
ఆ రోజుల్లో ‘ముత్యాల ముగ్గు’ ఎంత పెద్ద హిట్టంటే, 1975లో తెలుగు సినిమా టాప్‌ గ్రాసర్లలో అదొకటి. హైదరాబాద్‌లో అంతకు ముందున్న ‘దసరా బుల్లోడు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి స్టార్‌ హీరోల ‘‘25 వారాల సూపర్‌హిట్‌ చిత్రాల రికార్డుల్ని 50 రోజుల్లోనే అవలీలగా’’ దాటేసింది. ఆ సంగతి పంపిణీదారులే ఘనంగా పత్రికల్లో ప్రకటించారు. 1975 వరకు తెలుగు సినీచరిత్రను తరచి చూస్తే – ‘జీవితం’ (1950) సినిమా అనంతరం, 1950వ దశకం ప్రారంభంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు స్టార్‌ హీరోలైన తర్వాత... ఆ పాతికేళ్ళ కాలంలో ఆ ఇద్దరు హీరోలూ లేకుండా, లేదా ఒక చిన్న సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్టయింది రెండే రెండుసార్లు. ఆ చిత్రాలు ఏవంటే,  ఒకటి – ‘లేత మనసులు’ (1966). రెండు – ‘ముత్యాల ముగ్గు’ (1975). 
    
అలాగే, 1970ల ప్రారంభంలో కృష్ణ, శోభన్‌బాబు స్టార్‌ హీరోలైన తర్వాత కూడా కృష్ణ ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’, అలాగే శోభన్‌బాబు ‘జీవనతరంగాలు’, ‘శారద’, ‘జీవనజ్యోతి’ లాంటివి మాత్రమే బ్లాక్‌బస్టర్‌ సూపర్‌హిట్లయ్యాయి. ఆ స్టార్‌ హీరోలందరితో సమంగా నిలిచింది ఒక్క ‘ముత్యాల ముగ్గే’. ఆ తర్వాత మళ్ళీ కె. విశ్వనాథ్‌ ‘శంకరాభరణం’ (1980 రిలీజ్‌)కి ఆ ఘనత దక్కింది. అటుపైన అనేక చిత్రాలు ఆ దోవలో పయనించాయి.

 ఇక, సిల్వర్‌ జూబ్లీల్లోనూ ‘ముత్యాల ముగ్గు’ది మరో ఘనమైన రికార్డ్‌. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్ల సినిమాల తర్వాత ఫస్ట్‌ బ్యాచ్‌ రిలీజ్‌లో 5 సెంటర్లలో రెగ్యులర్‌ షోలతో రజతోత్సవం చేసుకున్న సినిమా కూడా ఇదొక్కటే! తెలుగు సినిమా బాక్సాఫీస్‌ చరిత్ర గమనిస్తే... స్టార్లయిన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులకు సైతం వాళ్ళ మొత్తం కెరీర్‌లోనే రెగ్యులర్‌ షోలతో, ఇన్ని కేంద్రాల్లో పాతికవారాలాడిన సినిమా ఏదీ లేదు. అది గమనార్హం. ‘ముత్యాల ముగ్గు’ తర్వాత మళ్ళీ 5 సెంటర్లలో రెగ్యులర్‌ షోలతో, మరో 4 కేంద్రాల్లో నూన్‌షోలతో సిల్వర్‌ జూబ్లీ ఆడిన సినిమా ఆ తరంలో ‘శంకరాభరణం’ ఒక్కటే! 
    
అలాగే, 1975 నవంబర్‌ 1 నాటికి వంద రోజులు పూర్తి చేసుకున్న ‘ముత్యాల ముగ్గు’ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు సంబంధించినంత వరకు అత్యంత అన్‌ సీజన్‌గా భావించే నవంబర్, డిసెంబర్, అలాగే జనవరి ఆరంభం... ఇలా మొత్తం పదివారాలనూ బలంగా తట్టుకొని నిలబడి, నిలకడగా కలెక్షన్లు రాబడుతూ, రెగ్యులర్‌ షోలతో రజతోత్సవం వైపు స్థిరంగా అడుగులు వేసింది. అది ఆ సినిమా బాక్సాఫీస్‌ సత్తాకు నిదర్శనం. గమనించాల్సిన మరో విశేషం. ‘ముత్యాల ముగ్గు’ డైలాగుల్లోనే చెప్పాలంటే, ఈ ‘‘ఇస్టరీని సింపేస్తే సిరిగిపోదు... సెరిపేస్తే సెరిగిపోదు!!’’

తెగనమ్మిన నిర్మాత... లాభపడ్డ బయ్యర్‌...
అనూహ్య విజయం అనంతరం కొన్నేళ్ళకు... సదరు ‘ముత్యాల ముగ్గు’ నిర్మాత చుట్టూ చాలామంది చేరారు. వాళ్ళమాట విన్న నిర్మాత ఎమ్వీయల్‌ కాస్తా... బాపు–రమణలకు మాట మాత్రంగానైనా చెప్పకుండానే బోలెడంత రిపీట్‌ రన్‌ వ్యాల్యూ ఉన్న కామధేనువు లాంటి ‘ముత్యాల ముగ్గు’ హక్కుల్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డికి రెండున్నర లక్షలకు తెగనమ్మేశారు. చిత్రమేమంటే, నెల తిరిగే లోపల కేవలం దూరదర్శన్‌లో ప్రసారానికి గాను ఆ సినిమా టెలీ రైట్స్‌ ఒక్కటే ఎమ్మెస్‌ రెడ్డికి రూ. 5 లక్షలు తెచ్చిపెట్టాయి. మద్రాసు దూరదర్శన్‌ నుంచి (నేషనల్‌ టెలికాస్ట్‌లో భాగంగా) ప్రసారమైన మొట్టమొదటి తెలుగు సినిమా ‘ముత్యాల ముగ్గే’. ఆ ప్రసారానికి గాను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలు పలకడం మరో విశేషం.

అవార్డుల్లోనూ... ఆగని సూపర్‌ హిట్‌!
ఆ ఏడాది అనేక సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ, ‘ముత్యాల ముగ్గు’ సృష్టించిన సంచలనం మాత్రం సాధారణం కాదు. జనం రివార్డులు, ప్రభుత్వ – ప్రైవేట్‌ అవార్డులు... అన్నీ ఆ సినిమాకే! ఆ ఏటి ఉత్తమ తెలుగు చిత్రంగా కేంద్ర ప్రభుత్వం వారి రజత కమలం, అదే నేషనల్‌ అవార్డుల్లో అఖిల భారత స్థాయిలో ఉత్తమ వర్ణఛాయాగ్రహణానికి (ఇషాన్‌ ఆర్య) అవార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వ రజత నంది దాకా ‘ముత్యాల ముగ్గు’కే వచ్చాయి. ఇక, మద్రాస్‌ ఫిలిమ్‌ ఫ్యాన్స్, ఆంధ్రా సినీ ఫ్యాన్స్, ఆంధ్రా సినీ గోయర్స్, ‘ఆంధ్రపత్రిక’, తెనాలి ‘ఫిలిమ్‌ క్లాసిక్‌’... ఇలా అనేక ప్రతిష్ఠాత్మక ప్రైవేట్‌ సంస్థల అవార్డులు కూడా లెక్కేస్తే... సుమారు నాలుగు పదుల దాకా అవార్డులు ఈ సెల్యులాయిడ్‌ క్లాసిక్‌కు దక్కాయి. ఇలా ‘ముత్యాల ముగ్గు’కు జనం రివార్డుతో పాటు విమర్శకుల అవార్డుల పరంపర లభించడం నేటికీ అబ్బురపరుస్తుంది.

తారాచంద్‌ బర్జాత్యా సహా తెరకెక్కని ఆలోచనలెన్నో!
 ‘ముత్యాల ముగ్గు’ చూసి, ప్రముఖ హిందీ సినీ పంపిణీ సంస్థ ‘రాజశ్రీ పిక్చర్స్‌’ అధినేత – చిత్ర నిర్మాత అయిన తారాచంద్‌ బర్జాత్యా సైతం బాపు – రమణలతో సినిమా తీయాలని ముచ్చటపడ్డారు. బాపును తన మద్రాసు ఆఫీసుకు పిలిపించారు. మనసుకు హత్తుకున్న ‘ముత్యాల ముగ్గే’ హిందీలో చేద్దామని పెద్దాయన ప్రతిపాదించారు. కానీ, అప్పటికే ఏ.వి.ఎం. వారు ఆ సినిమా హక్కులు కొనేసుకున్నారు. పోనీ... వెండితెరపై హిట్‌ ఫార్ములా అయిన ‘సిండ్రెల్లా’ తరహా కథ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనా చేశారు. ఒక దశలో ‘శ్రీకృష్ణ – సుదామ’ (మన తెలుగు భక్త కుచేలుడి కథ) చిత్రం తీయించాలని కూడా తారాచంద్‌ అనుకున్నారు. కానీ, దర్శక – రచయితల జీతభత్యాల మొదలు సినిమా ఖర్చుల దాకా అన్నింటిలో అపరిమితమైన పొదుపు పాటించే తారాచంద్‌ బార్జాత్యా దెబ్బకు ఆ ప్రతిపాదనలేవీ పట్టాలెక్కనే లేదు. 
    
అలాగే, ‘శ్రీరామచిత్ర’ బ్యానర్‌పై తొలిచిత్రంగా ‘ముత్యాల ముగ్గు’ నిర్మాణమై, హిట్టయిన తర్వాత... అదే బ్యానర్‌పై రెండో చిత్రాన్ని బాపు – రమణల సారథ్యంలో ఏయన్నార్‌తో ప్రకటించారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. అలాగే, బాపు – రమణల ‘త్యాగయ్య’లో ప్రధాన పాత్ర చేసేందుకు ఏయన్నార్‌ సరే అన్నా... 1980ల మొదటి దాకా అదీ కార్యరూపం దాల్చలేదు. చివరకు ‘శంకరాభరణం’ ఫేమ్‌ జె.వి. సోమయాజులుతో నవతా కృష్ణంరాజు నిర్మాతగా, బాపు – రమణల ‘త్యాగయ్య’ (1981 ఏప్రిల్‌ 17) తయారవడం వేరే కథ.

హిందీలో ఏ.వి.ఎం! కాపీకొట్టి మరీ... మరికొందరు!!

    సూపర్‌హిట్టయిన ‘ముత్యాల ముగ్గు’ కథ ఆ తర్వాత హిందీలోనూ రీమేక్‌ అయింది. హక్కులు తీసుకున్న ప్రసిద్ధ సంస్థ ఏ.వి.ఎం. వారు హిందీలో ‘జీవన్‌ జ్యోతి’గా నిర్మించారు (1976 మే 7న రిలీజ్‌). సలిల్‌ చౌధరీ సంగీతం అందించిన ఆ సినిమా ప్రముఖ నటి బిందియా గోస్వామికి తొలి సినిమా. చిన్నపిల్లలు, కుటుంబ సెంటిమెంట్‌ నిండిన ఆ కథను అక్కడి ప్రేక్షకులూ ఆదరించారు. ఆ హిందీ రీమేక్‌ సైతం వంద రోజులు ఆడింది. ఆపైన షిఫ్టులతో రజతోత్సవమూ జరుపుకొంది.

    ‘ముత్యాల ముగ్గు’ కథ హిందీ తర్వాత తమిళంలోకీ వెళ్ళింది. తెలుగులో ‘పుట్టినిల్లు – మెట్టినిల్లు’ దర్శకత్వం వహించిన పట్టు (పూర్తిపేరు ఆర్‌. పట్టాభిరామన్‌) దర్శకత్వంలో ఆర్ముగం ఆర్ట్స్‌ వారు తమిళంలో ‘మహాలక్ష్మి’ పేరిట ఈ రీమేక్‌ను తెరకెక్కించారు. తెలుగులో నటించిన సంగీతే తమిళంలోనూ హీరోయిన్‌. జైశంకర్‌ హీరో. 1976 మే 27న ఈ తమిళ ‘మహాలక్ష్మి’ ఆరంభమైంది. తెలుగులోని రావుగోపాలరావు పాత్రను అశోకన్, కాంతారావు పాత్రను యస్‌.వి. సుబ్బయ్య తమిళ వెర్షన్‌లో పోషిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఏమైందో ఏమో కానీ తీరా ఈ తమిళ రీమేక్‌ జనం ముందుకొచ్చేటప్పటికి 1979 అక్టోబర్‌ 20 అయింది.

ఇవన్నీ అధికారిక రీమేక్‌లైతే, హీరో కృష్ణతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సూపర్‌హిట్‌ ‘నంబర్‌ వన్‌’ (1994 జనవరి 14) సహా అనధికారిక కాపీలకు హద్దే లేదు. అలాంటి ఓ హిట్‌ సినిమా చూసి ఆశ్చర్యపోయిన రచయిత రమణ అది తమ ‘ముత్యాల ముగ్గు’కు కాపీ అంటూ ఫిర్యాదు చేశారు. సినీ రచయితల సంఘం వాళ్ళు పదమూడు మంది సభ్యులతో ఏకంగా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ వారు రెండు సినిమాలూ చూసి, చర్చించి, సదరు సినిమా అక్షరాలా ‘ముత్యాల ముగ్గు’కు కాపీయే అని ఏకగ్రీవంగా తీర్మానం కూడా రికార్డ్‌ చేశారు. ఇంతలో సదరు కాపీచిత్ర దర్శక, నిర్మాతలు ఏం మతలబు చేశారో ఏమో కానీ, సదరు తీర్మానం బయటకు రాకుండానే భూస్థాపితమై పోయింది. ‘కాపీ రైట్‌’ కాస్తా ‘కాపీ కొట్టడమే రైటు’ అన్నట్టుగా తయారైంది.

 ఏమైనా, మాటలు, పాటలు, సంగీత స్వరాలు, నేపథ్య గళాలు, కళ్ళను కట్టేసే ఛాయాగ్రహణ సౌందర్యం, నాలుగు నిమిషాల పాటు మాటా పలుకూ లేకుండా చిత్రీకరించిన హీరో హీరోయిన్ల తొలి రేయి సన్నివేశంలో చెవులకు పట్టేసే సజ్జాద్‌ హుస్సేన్‌ మాండొలిన్‌ వాద్య నేపథ్య మాధుర్యం, ప్రతి పాత్రకూ ప్రాణం పోసిన పాత్రధారుల అభినయం, నిర్మాణ విలువలు మొదలుకొని నిర్దేశకత్వ సామర్థ్యం దాకా... ఇలా అన్నింటి సమపాళ్ళ మేళవింపు ‘ముత్యాల ముగ్గు’. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ‘ఆంధ్రప్రభ’లో ఈ సినిమాను సమీక్షిస్తూ, ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ పేర్కొన్నట్టు ‘‘రమణీయమైన దృశ్యకావ్యంగా రూపొందిన రంగుల చిత్రం ఇది.’’ అందుకే, ఇది మామూలు చిత్రాల్లో కనిపించని గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. భావుకత, కళాత్మకత కోరుకునే సినీ ప్రేమికులకు పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది. వెరసి నాటికీ నేటికీ ఇది... తెలుగు సినిమాతల్లి ముంగిట వెల్లివిరిసిన ‘ముత్యాల ముగ్గు’. మున్నూరు రోజుల పైగా మహాజనం మెచ్చిన బ్లాక్‌బస్టర్‌ రతనాల రగ్గు. తరాలు మారినా తెలుగు తెరకు ఎప్పటికీ తరగని నిగ్గు. 
– రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement