breaking news
Bapu-ramanalu
-
గోల్డెన్ మెమొరీస్ – ‘ముత్యాల ముగ్గు’
పేరున్న హీరో కానీ, పాపులర్ హీరోయిన్ కానీ ఎవరూ లేని ఓ చిన్న సినిమా అది. కానీ అప్పట్లో పెద్ద హీరోల భారీ చిత్రాలను సైతం తలదన్ని, ఆబాలగోపాలాన్నీ అలరించింది. అనూహ్య విజయం సాధించింది. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా రతనాల రంగవల్లులు తీర్చిదిద్దింది. అది... తెలుగు సినిమా వాకిట చెరగని, చెదరని ‘ముత్యాల ముగ్గు’. అక్షరాలా బాపు – రమణల మార్కు సెల్యులాయిడ్ నిగ్గు. ఓ సినీప్రియుడు అన్నట్టు... ఓ చిన్న టుమ్రీ లాగా మొదలైనా, రిలీజైన కొద్దివారాలకే మంత్రముగ్ధం చేసే మహత్తర గజల్గా మారిన రసరమ్య సంగీత మాలిక. ఇటీవలే మరణించిన రాజకుమారి ఇందిరా ధన్రాజ్గిరి వారి ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’లో... ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణ దృశ్యజాలపు అల్లిక. తెరపై నేటికీ వసివాడని కుటుంబానురాగాల నవ మల్లిక. రమణ రాత – బాపు తీతల్లో ఓ మైలురాయి. రావుగోపాలరావు నటనలో కలికితురాయి. అది 1975. ఆ ఏడాది ఆరంభమై అప్పటికి ఆరు నెలలు దాటిపోయింది. ఆ సంవత్సరం అప్పటికి తెలుగు చిత్రసీమలో వేళ్ళ మీద లెక్కపెట్టుకోగలిగినన్ని సినిమాలే విజయం సాధించాయి. ఇంకా చెప్పాలంటే, ఆ ఏడాదే కాదు... అప్పటికి కొంతకాలంగా ఇండస్ట్రీలో అదే పరిస్థితి. ఏటా దాదాపు 70 చలనచిత్రాల నిర్మాణం స్థాయికి తెలుగు సినీ పరిశ్రమ ఎదిగింది కానీ, వాటిలో అతి తక్కువే విజయం అందుకుంటున్న దుఃస్థితి. కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా 1976 కల్లా ‘స్మాష్’ అయిపోవడం ఖాయమని సాక్షాత్తూ అగ్రనటుడు అక్కినేని లాంటి వారు సైతం వ్యాఖ్యానించిన రోజులవి. అదిగో... సరిగ్గా అలాంటి సమయంలో 1975 జూలై 25న చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయం సాధించి, పరిశ్రమకు కొత్త ఊపిరి పోసిన ‘వి’చిత్రం... ‘ముత్యాల ముగ్గు’. ‘లవకుశ’కు... ఆకట్టుకొనే సోషల్ వెర్షన్!‘సాక్షి’తో మొదలైన బాపు దర్శకత్వ ప్రస్థానంలో అది తొమ్మిదో సినిమా. రచయితగా రమణకు రజతోత్సవ (25వ) సినిమా. కొత్త హీరో హీరోయిన్లతో, పాత్రధారులెవరికీ మేకప్ లేకుండా, అందులోనూ ఖరీదైన రంగుల్లో సినిమా నిర్మించడం ఆ రోజుల్లే ప్రయోగమే కాదు. పరమ మూర్ఖ సాహసం. అయినా, బాపు – రమణ చేశారు. అంతకు ముందు ఎనిమిదిన్నరేళ్ళ క్రితం తెలుగులో తొలిసారిగా పూర్తి ఔట్‌డోర్‌లో నెల రోజుల్లో ‘సాక్షి’ చిత్రం నిర్మించిన వారిద్దరూ... ఈసారి మేకప్ లేకుండా, మొత్తం రంగుల్లో, 40 రోజుల్లో ఒకే షెడ్యూల్లో ‘ముత్యాల ముగ్గు’ తీసి మరోసారి చరిత్ర సృష్టించారు. ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అని మరొక్కసారి రుజువు చేశారు.అసలు ‘ముత్యాల ముగ్గు’ మరీ ప్రత్యేకమైన కథేమీ కాదు. సీతను అనుమానించిన శ్రీరామచంద్రుడు, రాజ్యం విడిచి అడవికి వెళ్ళాల్సి వచ్చిన సీత, అక్కడ ఆమెకు కలిగిన కవలపిల్లలు లవకుశులు, పిల్లల వల్ల చివరకు తల్లితండ్రులు తిరిగి చూసుకోవడం... ఇదే ఉత్తర రామాయణంలోని పురాణగాథ. దాన్నే కాస్తంత మార్చి, సోషలైజ్ చేసి, పిల్లలే క్రియాశీలంగా వ్యవహరించి తల్లితండ్రుల్ని కలిపితే? అదే ‘ముత్యాల ముగ్గు’ సినిమా స్క్రిప్టు. కాకపోతే, మొదట అనుకోని కాంట్రాక్టర్ (రావుగోపాలరావు) పాత్రను ఆ తర్వాత స్క్రిప్టులో చేర్చి, కథను మరింత రసవత్తరం చేశారు. పాత కథనే గొప్ప కథనంతో అద్భుతంగా పండించారు బాపు – రమణ.హనుమంతుడి పాత్రను ప్రవేశపెట్టి, దీన్ని ‘సోషియో – ఫ్యాంటసీ’గా చేయడం మంచి బాక్సాఫీస్ ఫార్ములా. అంతకు ముందు ఎన్టీఆర్ – యస్వీఆర్ ‘దేవాంతకుడు’ (1960 జూలై 7)లో సక్సెసైన ఆ ధోరణిని శోభన్‌బాబును శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి, ఏయన్నార్ ‘బుద్ధిమంతుడు’ (1969 సెప్టెంబర్ 20)లోనూ బాపు–రమణలు సమర్థంగా వాడారు. అయితే, ‘ముత్యాల ముగ్గు’లో అది సంపూర్ణతను సంతరించుకొని, పెద్ద పేయింగ్ ఎలిమెంట్ అయింది. ఆ సినిమా తర్వాత ‘దేవుడే దిగివస్తే’ (1975 సెప్టెంబర్ 19) లాంటి పలు చిత్రాలు ఇలా ‘సోషియో – ఫ్యాంటసీ’ సూత్రాన్ని అనుసరించాయి.అలాగే, రొటీన్‌కు భిన్నంగా తీస్తున్న ఈ సినిమాకు ‘కవల పిల్లల కథ’ లాంటి మూస ధోరణి పేర్లకు పోకుండా టైటిల్ కూడా భిన్నంగానే పెట్టారు. ‘తీరైన సంపద ఎవరింట నుండు... దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు...’ అనే ఈ చిత్ర కథావస్తువుకు తగ్గట్టు ‘ముత్యాల ముగ్గు’ అనే టైటిల్‌ను బాపు మొదట్లోనే నిర్ణయించారు. ప్రొడ్యూసరైన తెలుగు లెక్చరర్... ఎమ్వీయల్!విజయవాడ దగ్గర నూజివీడులోని ‘ధర్మ అప్పరాయ కళాశాల’లో తెలుగు లెక్చరరైన ఎమ్వీయల్ ‘ముత్యాల ముగ్గు’తో నిర్మాత అవతారమెత్తారు. మచిలీపట్నం దగ్గర గూడూరులో జన్మించిన ఆయన పూర్తి పేరు – మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు. సంక్షిప్తంగా ఎమ్వీయల్. ఆయన స్వతహాగా మంచి కవి, రచయిత, వక్త. అప్పట్లో ఆయన ‘ప్రభవ’ అనే మాసపత్రికకు సంపాదకుడిగానూ వ్యవహరించారు. ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ‘యువజ్యోతి’ శీర్షిక నడిపారు. ఆ శీర్షిక ఆ రోజుల్లో పాఠకులకు పెద్ద ఆకర్షణ. వెంకటగిరి సంస్థానం రాజా గారి తమ్ముడి కుమారుడైన ఎం. సుకుమార్ ఆయన శిష్యుడే! ఆ శిష్యుడి కోసం తమకు ఓ సినిమా చేసిపెట్టమని బాపు – రమణల్ని ఎమ్వీయల్ అభ్యర్థించడంతో ‘ముత్యాల ముగ్గు’ పట్టాలెక్కింది.తీరా మద్రాసు విజయా గార్డెన్స్‌లో పాటల రికార్డింగ్ జరుగుతున్న వేళ... తొంభై వేలిచ్చేసరికే వెంకటగిరి యువరాజా వారు చేతులెత్తేశారు. అయితే, బాపు – రమణల మాట మీద పంపిణీదారులైన ‘అన్నపూర్ణ ఫిలిమ్స్’ ఆదుకున్నారు. (అప్పట్లో సినీ పంపిణీ రంగంలో ఓ ప్రముఖ సంస్థ అన్నపూర్ణ ఫిలిమ్స్. ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ వేరెవరో కాదు... ప్రముఖ నిర్మాత ‘జగపతి’ వి.బి. రాజేంద్ర ప్రసాద్ తమ్ముడు కృష్ణప్రసాద్. నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, అగ్రనటుడు జగపతిబాబుకు సొంత బాబాయి. హీరో అక్కినేని సహా పలువురికి ఆ ‘అన్నపూర్ణ’ పంపిణీ సంస్థలో వాటాలుండేవి). అలా బాపు – రమణ పూనుకొని, ఆ ‘అన్నపూర్ణ ఫిలిమ్స్’ వారి సహాయ సహకారాలతో, ఇతర వనరులు కూడా కలుపుకొని పన్నెండున్నర లక్షల్లో ‘ముత్యాల ముగ్గు’ పూర్తి చేశారు. నిర్మాతగా ఎమ్వీయల్ పేరు, సమర్పకుడిగా సుకుమార్ పేరుతో రిలీజ్ చేశారు. చిన్న సినిమా కాస్తా విజయంలో పెద్ద సినిమా అయింది. మొత్తం కథే మారిపోయింది. అలా సినీరంగ ప్రవేశం చేసిన ఎమ్వీయల్ ఆ తర్వాత కాలంలో ‘గోరంత దీపం’, ‘స్నేహం’, ‘మనవూరి పాండవులు’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘ఓ ఇంటి భాగోతం’ సినిమాలకు సంభాషణలు రాశారు. అయితే... వేడుక అలవాట్లను వాడుక వ్యసనాలను చేసే రంగుల ప్రపంచం మాయలో పడి, 42 ఏళ్ళ పిన్న వయసులోనే 1986 జనవరి 23న కన్నుమూయడం ఎమ్వీయల్ కథకు యాంటీ క్లైమాక్స్. కొత్తవాళ్ళతో కలర్‌ఫుల్ మ్యాజిక్‘ముత్యాల ముగ్గు’లో ప్రధానమైన నాయకుడు, నాయిక... ఇద్దరూ కొత్తవాళ్ళే. మంచి రూపం, కంఠస్వరం ఉన్న నటుడు శ్రీధర్ అంతకు ముందు ‘తల్లా? పెళ్ళామా?’(1970 జనవరి 8)తో మొదలుపెట్టి, ‘రైతుబిడ్డ’ (1971 మే 19) తదితర చిత్రాల్లో సహాయక పాత్రల్లో తెరపై కనిపించినా, ఆయనకు హీరోగా ప్రమోషన్ వచ్చింది మాత్రం ఈ చిత్రంతోనే! పూర్వాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేసి, మంచి నాటకానుభవంతో సినిమాల్లోకి వచ్చారాయన. అందుకే, ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా ఈజ్‌తో, సాఫీగా ఈ నాయక పాత్ర పోషించగలిగారు. అలాగే, వరంగల్ నుంచి మద్రాసుకొచ్చి, సంగీతగా పేరు మార్చుకున్న లత (అదే ఆమె అసలు పేరు) హీరోయిన్గా అందరినీ ముగ్ధుల్ని చేశారు. తెరపై ప్రేక్షకుల ముందుకు రావడం ఆమెకు అదే తొలిసారి. నిజానికి, యు.విశ్వేశ్వరరావు దర్శకత్వంలోని ఎన్టీఆర్ ‘తీర్పు’ (1975 అక్టోబర్ 1) ఆమె నటించిన మొదటి సినిమా. కానీ, రిలీజైన తొలి సినిమా మాత్రం ‘ముత్యాల ముగ్గే’. చెంపకు చేరడేసి కళ్ళు, అందం, ముఖంలో పల్లెటూరి పిల్ల పాత్ర తాలూకు అమాయకత్వం, ఆత్మాభిమానాన్ని అలంకారంగా మలుచుకున్న ఆ పాత్ర వ్యక్తిత్వం... అన్నీ కలిసి తొలి సినిమాతోనే తార అయిపోయారు సంగీత. ఆపైన ‘ముత్యాల ముగ్గు’ బాపు బొమ్మగా ఇప్పటికి యాభై ఏళ్ళ పైగా కెరీర్ కొనసాగిస్తూనే ఉన్నారు. విలన్ రావుగోపాలరావుతో పాటు ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో దుష్టపాత్ర... అల్లు రామలింగయ్య పోషించిన జోగినాథం పాత్ర. దేవుడి ఆభరణాల దొంగతనం, కోపగించిన కోతి పీకడంతో పిచ్చిపట్టి, అచ్చం కోతి లాగా ప్రవర్తించే సన్నివేశాల్లో అల్లు మార్కు అనుభవం, అపారమైన అభినయ నైపుణ్యం కనిపిస్తాయి. ఆ తరువాత కాలంలో అనేక సినిమాల్లో ఇతర పాత్రల్లో సైతం సందర్భోచితంగా ఈ ‘ముత్యాల ముగ్గు’ మార్కు అభినయ ఛాయల్ని ఆయన ప్రదర్శించారు. ప్రేక్షకుల్ని పదే పదే మెప్పించారు. అదీ ‘ముత్యాల ముగ్గు’ చూపిన నటనా మార్గం. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అల్లు రామలింగయ్య రెండో కుమారుడు ఆకస్మికంగా మరణించారు. తన వల్ల దర్శక, నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని, ఊహించని ఆ పుత్రశోకాన్ని దిగమింగుకుని, వద్దంటున్నా సరే మూడోరోజు నుంచే తిరిగి షూటింగులో పాల్గొన్నారు అల్లు రామలింగయ్య. అలా ఓ చిన్న చిత్ర నిర్మాణానికి తోడ్పడడం, అంత కుటుంబ కష్టాన్ని సైతం పైకి కనపడనివ్వకుండా కెమెరా ముందు కామెడీ పండించడం ఆయనకే చెల్లింది. హీరో తండ్రిగా కాంతారావు, హీరో హీరోయిన్లను విడదీసే పాత్రలో ముక్కామల, నిత్యపెళ్ళికొడుకుగా నూతన్‌ప్రసాద్, ఇంకా ‘సాక్షి’ రంగారావు, సూర్యకాంతం, జయమాలిని, హలం తదితరులు ఈ చిత్రకథలోని ఇతర పాత్రలను సైతం చిరంజీవులుగా మార్చారు. పిల్లలు మెచ్చిన పవన సుత హనుమాన్! ‘ముత్యాల ముగ్గు’లో పిల్లల్ని అమితంగా ఆకర్షించిన హనుమంతుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో నటుడు అర్జా జనార్దనరావు అద్భుతంగా నటించారు. అంతకు ముందే బాపు – రమణలు శోభన్‌బాబుతో తీసిన ‘సంపూర్ణ రామాయణం’ (1972 మార్చి 16)లోనూ, ఎన్టీఆర్‌తో చేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’(1975 జనవరి 10)లోనూ ఆయనది అదే పాత్ర. ఆ పౌరాణికాల్లోనే కాదు, ఈ సాంఘిక చిత్రం ‘ముత్యాల ముగ్గు’లోనూ సాక్షాత్తూ ఆంజనేయ స్వామినే తెరపై చూస్తున్నామా అనిపించేలా ఆయన వేషం, భాష, అభినయం అన్నీ అద్భుతంగా అమరాయి. పిల్లలకు అండగా నిలిచి, దూరమైన వారి తల్లితండ్రులను మళ్ళీ కలిపే బాధ్యతను మోసిన రామభక్త హనుమాన్‌గా ఆ పాత్ర తీరు కొత్తగా ఉంటుంది. కథలోని కీలక పాత్రచిత్రణ రీత్యా ‘ముత్యాల ముగ్గు’లోని ఆ ఇద్దరు పిల్లలు (బాలనటులు రాధ, మురళి), ఆంజనేయ స్వామి పాత్రలే సినిమా చూసిన చిన్నారులకు సహజంగా ఫేవరెట్. ఈ సినిమా తర్వాత కూడా అర్జా జనార్దనరావు పలుమార్లు ఆంజనేయ పాత్రలో కనిపించారు. తెలుగుతెర ఆంజనేయుడిగా నేటికీ చెరగని చిరకీర్తిని ఆర్జించుకున్నారు.సెల్యులాయిడ్‌పై శిల్పసౌందర్యం... ఇషాన్ ఆర్య పనితనం!కోనసీమ పల్లెపట్టుల్లో, ప్రధానంగా గోదావరి ఒడ్డున పులిదిండి గ్రామంలో తీర్చిదిద్దిన ఈ ‘ముత్యాల ముగ్గు’కు బాపు ఏరికోరి ఎంచుకొని, తెలుగు తెరకు పరిచయం చేసిన విలక్షణ ఛాయాగ్రాహకుడు ఇషాన్ ఆర్య. ఆయన అసలు పేరు ఇర్షాద్ ఎహ్సాన్. అంతకు ముందే కోకాకోలా వాణిజ్యప్రకటనతో, అలాగే ఎం.ఎస్. సత్యూ దర్శకత్వంలో బలరాజ్ సహానీ నటించగా దేశవిభజన నేపథ్యంలో తీసిన కళాత్మక చిత్రం ‘గరమ్ హవా’ (1973)తో ఇషాన్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘గరమ్ హవా’ అప్పటికే ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా భారత ప్రభుత్వ నేషనల్ అవార్డుతో పాటు ప్రసిద్ధ ఆస్కార్ అవార్డులు, కాన్స్ చలనచిత్రోత్సవానికి కూడా నామినేట్ అయింది. అక్కినేని ‘అందాల రాముడు’ (1973)కే ఆయనను తీసుకుందామని బాపు అనుకున్నారు. కానీ, స్టార్ సినిమా కావడంతో రమణ సలహా మేరకు ఆగారు. ఈసారి అంతా కొత్తవాళ్ళతో తీస్తున్న ‘ముత్యాల ముగ్గు’తో ఆ కోరిక తీరింది.మేకప్ లేకుండా నటీనటులను సహజంగా చూపిస్తూ... రిఫ్లెక్టర్ల లైటింగ్‌లో వేవేల వేడి ప్రకాశంతో వారిని మాడ్చేయకుండా, శాటిన్ గుడ్డ వాడి కాంతిని బౌన్సింగ్ చేసి, ప్రశాంతంగా... కంటికీ, మనసుకూ ఆహ్లాదం కలిగించేలా చిత్రీకరణ జరపడం ఇషాన్ ఆర్య స్టయిల్. అప్పటికే సుప్రసిద్ధులైన సినిమాటోగ్రాఫర్లు ఎందరికో ఇది పూర్తి భిన్నం. అయినా, ఈ తరహా చిత్రీకరణతోనే ఇషాన్ ఆర్య సెల్యులాయిడ్‌పై సన్నివేశాలను సౌందర్య శిల్పాలుగా మార్చారు. దానికి తోడు బాపు మార్కు పెయింటింగ్ తరహా కెమెరా ఫ్రేమింగ్, తెర నిండుగా టైట్ క్లోజప్పుల్లో ఆర్టిస్టుల హావభావాలు కలిసేసరికి... ‘ముత్యాల ముగ్గు’ చూసిన ప్రేక్షకులకు మతి పోయింది. సినిమా ఓ విజువల్ పొయిట్రీలా అనిపించింది. ఇషాన్ చూపిన ఆ పంచరంగుల కెమెరా పనితనానికి కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు దక్కింది.‘ముత్యాల ముగ్గు’ తర్వాత మళ్ళీ ‘గోరంతదీపం’ (1978), ‘తూర్పు వెళ్ళే రైలు’ (1979) చిత్రాలకు కూడా బాపు కెమెరా కన్ను ఇషాన్ ఆర్యే! నిజానికి, ఇషాన్ పుట్టింది హైదరాబాద్‌లోనే. ప్రసిద్ధ ఉర్దూ రచయిత కైఫీ ఆజ్మీ కుటుంబానికి అత్యంత సమీప బంధువు. కైఫీ ఆజ్మీ సంతానమైన నటి షబానా ఆజ్మీకి కజిన్. షబానా సోదరుడైన బాబా ఆజ్మీ మొదట్లో ఇషాన్ దగ్గరే సహాయకుడిగా పనిచేసి, ఆనక స్వతంత్రంగా సినిమాటోగ్రాఫరయ్యారు. ఇంకా విశేషం ఏమిటంటే, ఇషాన్ కుమారుడైన సమీర్ ఆర్య సైతం సినిమాటోగ్రాఫరే! హృతిక్ రోషన్ పాపులర్ సినిమా ‘కోయీ... మిల్ గయా’ (2003) సహా పలు హిందీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.రాజ ప్రాసాదంలో... రంగుల సినిమా‘ముత్యాల ముగ్గు’ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ సినిమాలో కీలక భాగం షూటింగ్ జరిగిన ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’. తొమ్మిది పదులు దాటిన వయసులో ఇటీవలే మరణించిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిర్ తాత తండ్రులు కట్టించిన ప్రాసాదం ఇది. 1890 ప్రాంతంలో మొత్తం మూడు దశల్లో... రాజా జ్ఞాన్ గిర్జీ బహదూర్, నరసింగ్ గిర్జీ బహదూర్, రాజా ధన్రాజ్గిర్జీ బహదూర్లు ముగ్గురి హయాంలో ఆ కోట లాంటి ఇంటిని కట్టారు. ఒకప్పుడు యావత్ దక్షిణ భారతదేశంలో నిజామ్ ప్రభువు తర్వాత అత్యంత సంపన్న కుటుంబం వారిదే! మహారాజ్ నర్సింగ్గిర్ ధన్‌రాజ్‌గిర్ జ్ఞాన్ బహదూర్ అప్పట్లో నిజామ్ ఆస్థానంలో ప్రముఖ వర్తకుడు, బ్యాంకర్. అంతేకాక, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ (1931) హీరోయిన్ అయిన జుబేదాను వివాహమాడిన వ్యక్తి. హైదరాబాద్‌లో తొలినాళ్ళలో సినీ పరిశ్రమను ప్రోత్సహించినవారిలో ఈ ధన్‌రాజ్‌గిర్ కుటుంబం కూడా ఒకటి. రాజా నరసింగ్గిర్ ఒకానొక సమయంలో రైల్వే సంస్థ ఏర్పాటు కోసం సాక్షాత్తూ ఆరో నిజామ్ నవాబుకు ఋణం ఇచ్చారు. ఆయన మనుమరాలే రాజకుమారి ఇందిర.చివరి దాకా ఆమె నివాసమైన ఆ ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’కే ‘ధన్‌రాజ్ గిర్ ప్యాలెస్’ అని కూడా పేరు. మొత్తం యూరోపియన్, ఇండో– శారసెనిక్ సమ్మిళిత శైలిలో సున్నపురాయి, చలువరాయి వాడి నిర్మించిన ప్రాసాదం అది. దాదాపు 8 ఎకరాల స్థలంలో, సుమారు 30 వేల చదరపు అడుగుల మేర 19 సూట్లతో ఉంటుంది. స్వతహాగా కవయిత్రి – కళాభిమాని అయిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిర్ తన భావాలకు సరితూగే కవి గుంటూరు శేషేంద్రశర్మతో ఆ ప్యాలెస్‌లో జీవనం గడిపారు. హైదరాబాద్ నడిబొడ్డున గోషామహల్ ప్రాంతంలో పాన్ మండీ వద్ద శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ప్యాలెస్ అది. తరచూ కవులు – కళాకారుల భేటీలతో సాంస్కృతిక కేంద్రంగా వెలిగిన ఆ ప్యాలెస్‌లోనే ‘ముత్యాల ముగ్గు’ షూటింగ్ జరిగింది. ఆ సినిమా చిత్రీకరణకు ప్యాలెస్‌ను ఉపయోగించుకునేందుకు రాజకుమారి ఇందిర ఉదారంగా అనుమతించారు.హీరో నివాసానికి సంబంధించిన కీలక ఘట్టాల షూటింగ్ అక్కడే జరిగింది. ఆ ప్యాలెస్ వాకిటనే ఉదయం వేళ ముగ్గు వేస్తూ హీరోయిన్ సంగీత పాడే ‘ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ...’ పాటను చిత్రీకరించారు. నిండుగా నగలు ధరింపజేసి హీరోయిన్ను పుట్టింటికి పంపేసే కీలకమైన నగల సీన్ తీస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఇందిర, ‘గిల్టు నగలెందుకు?’ అంటూ రత్నాలు, వజ్రాలు పొదిగిన అచ్చమైన తమ ఇంటి బంగారు నగలనే షూటింగ్‌కు ఇవ్వడం మరో విశేషం. బాపు ‘ముత్యాల ముగ్గు’ తర్వాత బాలకృష్ణ – విజయశాంతితో రాఘవేంద్రరావు తీసిన ‘పట్టాభిషేకం’ (1985 డిసెంబర్ 21) సహా మరికొద్ది చిత్రాల్లో మాత్రమే వెండితెరపై ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’ కనువిందు చేసింది. అటుపైన పెద్ద పెద్ద సినిమా షూటింగ్‌లకు సైతం ఆ రాజప్రాసాదం తలుపులు తెరుచుకోనే లేదు.కలిసొచ్చిన అనుకోని ఇబ్బంది!కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు సైతం కలిసొచ్చిన అదృష్టాలుగా మారతాయి. ‘ముత్యాల ముగ్గు’ షూటింగ్లో అలాంటిదే జరిగింది. జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌లో షెడ్యూల్ పూర్తి చేశాక, విలనైన కాంట్రాక్టర్ రావు గోపాలరావు ఇంటి సీన్లు తీయాలి. అందు కోసం హైదరాబాద్ సారథీ స్టూడియోలో సెట్టు బుక్ చేసున్నారు. ఎల్లుండి షూటింగ్ అనగా ఇవాళ స్టూడియో వారు పిలిచి, ఆ సెట్ ఎవరో పెద్దవాళ్ళు తీసుకున్నారనీ, వీళ్ళకివ్వడం కుదరదనీ చెప్పారు. పోనీ భోజనాలకు వాడే షెడ్డు ఇవ్వమన్నా ససేమిరా అన్నారు. డైనింగ్ హాలులో షూటింగ్ చేసినా, స్టూడియోలోకి ఆ సౌండ్ చొరబడుతుందనీ, సాధ్యం కాదనీ కుండబద్దలు కొట్టేశారు. ‘‘ఎలాగరా అని బాధపడుతూ రాక్ క్యాజిల్ హోటల్లో ‘ఉపద్రవాలు’ తాగుతూ ఆలోచిస్తున్నాం. ఆ కొండ మీది బండలూ, వాటి చాటున గదులూ, దారులూ, ఆ వెనక చక్కటి లాన్ ఆకర్షించాయి. అంతే... సినిమాలోని కాంట్రాక్టర్ ఇల్లూ, హలం డ్యాన్సూ – మొత్తం అంతా అక్కడ కుదిరిపోయాయి. సినిమా తరహాయే మారిపోయింది’’ అని బాపు పేర్కొన్నారు.ఆ హోటల్లోనే కొన్ని రూములు అద్దెకు తీసుకొని బస చేస్తూ అక్కడే షూటింగ్ చేశారు. షూటింగ్‌కు అద్దె ఇస్తామన్నా, కనీసం గిఫ్టు ఇస్తామన్నా ఆ ప్రొప్రయిటర్ వద్దు అన్నారట. ‘రోజూ ఉదయం మీరు వెలిగించే అగరొత్తుల ప్యాకెట్ (ఆ రోజుల్లోనే ప్యాకెట్ అయిదు రూపాయలున్న ‘సాయి ఫ్లోరా’) ఒకటి ఇవ్వండి చాలు’ అన్నారట. అలా దేవుడిచ్చిన ఆ నేచురల్ స్టూడియోలోనే... ఆకాశంలో సూర్యుణ్ణి చూస్తూ రావుగోపాలరావు తన సెక్రటరీతో, ‘అబ్బా... సెగట్రీ... ఎప్పుడూ పనులు, బిగినెస్సేనా? ఆ... పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ...’ లాంటి డైలాగులు సీన్లన్నీ అక్కడ తీసినవే!సాహితీ భావాల త్రివేణి! సంగీత బాణీల అలివేణి!!మామ కె.వి. మహదేవన్ సంగీతంలో ‘ముత్యాల ముగ్గు’ పాటలన్నీ అప్పట్లో మహా పాపులర్. అభ్యుదయ కవి ఆరుద్ర, అనుభూతివాద కవి శేషేంద్ర, ఆధునిక గేయకవి సినారె... ఈ అపురూప త్రయం రాసిన ఈ సినిమాకు రాసిన సాహిత్యం నేటికీ నిత్యనూతనమే! శ్రీరామనవమి సహా ఏ పండగ వచ్చినా ప్రతి భక్తిగాన సందర్భంలోనూ కర్ణాటక సంగీత విద్వన్మణి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గళంలో ‘శ్రీరామ జయరామ సీతారామ...’ అన్న ఆరుద్ర రచన వినపడాల్సిందే! పలు సంప్రదాయ స్త్రీల పాటల ప్రభావంతో ఆరుద్ర రాయగా, పి. సుశీల ప్రాణం పోసిన ‘ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ... ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ... ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన... మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ....’ ఆల్‌టైమ్ హిట్.రామకృష్ణ గొంతులో వినిపించే ఆరుద్ర మరో రచన – ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు... గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు...’. ఆ సాహిత్యం, ఆ బాణీ, ఇషాన్ ఆర్య కెమెరా కంటితో కోనసీమ అందాల నడుమ గోదావరిపై ఆ పడవ ప్రయాణం చిత్రీకరణల... అన్నీ కలసి అదో మరపురాని లలిత లావణ్య ప్రణయ గీతం. ఇక, తెలంగాణలో సుప్రసిద్ధమైన మరో జానపద గేయఫణితిని ఎత్తుగడగా చేసుకొని, దాన్ని అందమైన ప్రేమగీతంగా సినారె మలిచిన ‘గోగులు పూచె గోగులు పూచె ఓ లచ్చగుమ్మడీ...’ మరో మరపురాని పాట. సినారె రాసిన ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ అన్న జావళీ... సాహిత్యపు సొంపులు, తెరపై నటి హలం ఒంపులతో గుమ్మెత్తిస్తుంది. నిజానికి, సెకండాఫ్‌లోని ‘నిదురించే తోటలోకి...’ మినహా మిగతా పాటలన్నీ ఈ సినిమాలో ఫస్టాఫ్‌లోనే వస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఆ ఒక్కటి కూడా నేపథ్యగీతం. కమర్షియల్‌గా అది దుస్సాహసమే! అయినా, జనం మాత్రం అదేమీ ఆలోచించకుండా హాయిగా సినిమా చూసేశారు.సినీతోటలోకి... శేషేన్ పాట ఒకటి వచ్చింది! ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది... సుప్రసిద్ధ కవి – విమర్శకుడు – పండితుడు గుంటూరు శేషేంద్రశర్మ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రాసిన పాట. ‘నా దేశం – నా ప్రజలు’, ‘ఆధునిక మహాభారతం’, ‘కవిసేన మేనిఫెస్టో’ లాంటి రచనలతో సుకవితా వేద్య సుప్రసిద్ధుడైన శేషేంద్ర సినిమాకు పాట రాయడం అదే తొలిసారి. అదే చివరిసారి కూడా! బాపు – రమణల బలవంతం మేరకు ఆయన ఆ పాట రాశారు. అక్షరాక్షరంలో అనుభూతి నింపే శేషేన్... ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అన్న ఆ పాటను కూడా అంతే కవితాత్మకంగా రాశారు. సినీగీతాన్ని సైతం నిక్కమైన కవిత్వానికి అచ్చమైన చిరునామాగా మలిచారు. ‘‘శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది... ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది’’, ‘‘నది దోచుకుపోతున్న నావను ఆపండి... రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’’ లాంటి ఆ పాటలోని అనేక పంక్తులే అందుకు ఉదాహరణ. సర్వసాధారణంగా సినిమా పాటకు ఒదగని కవితా మేలిబంతులవి. అయినా ఆ పాట, దానికి మామ కట్టిన వరుస, చిత్రీకరణ, కూర్పు... సగటు సినీ ప్రేక్షకుడి స్థాయినీ, అభిరుచినీ పెంచాయి. అదీ ఆ పాట ఘనత, చెదిరిపోని ‘ముత్యాల ముగ్గు’ చరిత.ఆల్‌టైమ్ హిట్ డైలాగ్స్‌తో... ‘స్టార్’ గోపాలరావు!‘ముత్యాల ముగ్గు’ సినిమాతో పాటు అందులోని డైలాగులూ అంతే ఫేమస్. నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, ఆగి ఆలోచింపజేసే మాటలు... ఒకటా, రెండా... సినిమా అంతా ముళ్ళపూడి వెంకట రమణ రచనా విశ్వరూపం చూడవచ్చు. కథానాయిక పాత్ర నోట వినిపించే ‘‘కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది’’, ‘‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు’’, ‘‘సుఖమూ సంతోషమూ... డబ్బున్న మేడల్లో కాదు, మనసున్న మనుషుల పక్కన ఉంటాయని తెలుసుకున్నాను’’ లాంటి అర్థవంతమైన డైలాగులు అప్పటికీ ఇప్పటికీ ఆలోచింపజేసేవే. అలాగే, అతిగా పొగిడేవాళ్ళను గమనించి జాగ్రత్తపడాలన్న అంశాన్ని రావు గోపాలరావు పక్కనే ప్రత్యక్షమయ్యే మృదంగ బృందం రూపంలో నవ్విస్తూనే, నషాళానికి అంటేలా చెప్పారు దర్శక, రచయితలు.అంతకు ముందు అనేక పాత్రలు చేసినా... రావుగోపాలరావును రాత్రికి రాత్రికి సూపర్‌స్టార్‌ను చేసేసిన సినిమా ఇదే. కథలో చెడ్డపనులు చేసే కాంట్రాక్టర్ పాత్రలో రావుగోపాలరావు నటనకూ, తూర్పు గోదావరి జిల్లా మాండలికంలో, చిత్రమైన మాడ్యులేషన్‌తో కూడిన డైలాగులకూ ముచ్చటపడని ప్రేక్షకులు ఆ రోజుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. ‘వార్ దాన్సిగ తరగ’ అనే ఊతపదంతో సహా ‘అలోవలోవ్, పబ్లిక్ సిటీ, డిక్కీలో తొంగోబెట్టేస్తా, కరుసయిపోగలవు, కలాపోసన, ఆ ముక్క నే లెక్కెట్టక ముందు సెప్పాల, ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యరేటండీ, నిచ్చె పెళ్ళికొడుకు, సీరలు సీరలు (ఇంగ్లీష్ ‘ఛీర్స్’కు బదులుగా), సినేమా కతలు సెప్పద్దన్నానా...’ లాంటి ప్రయోగాలు రావు గోపాలరావు నోట లక్ష్మీ బాంబుల్లా భలే పేలాయి.ముఖ్యంగా, సూర్యోదయాన్ని చూస్తూ ‘పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ... ఆకాశంలో? సూరీడు నెత్తురుగడ్డలా లేడూ? ...మడిసన్నాక కాసింత కలాపోస నుండాలయ్యా? ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటది?’ అంటూ సెక్రటరీ (నటుడు కాకరాల)తో రావుగోపాలరావు జరిపే సంభాషణ తెలుగు సినీ చరిత్రలో నేటికీ చిరంజీవి. అలాగే, కనిపించేది కొద్ది క్షణాలే అయినా... కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి ‘కాలు కెంతవుద్ది? కాలేజీ సీటు కెంతవుద్ది? పెసిడెంటు సీటు కెంతవుద్ది? మడ్డరు కెంతవుద్ది? ...ఓలు మొత్తం ఓల్సేల్న ఎంతవుద్ది? కన్సెసన్ ఏవన్నావుందా?’ అంటూ నోటిలో సిగరెట్‌తో, చేతితో చిటికెలు వేస్తూ నటుడు మాడా వెంకటేశ్వరరావు మాట్లాడే సీనూ, ఆ డైలాగులూ అంతే! పబ్లిసిటీ బాగా జరిగి, కలెక్షన్లు పెరగడానికి సాఫ్ట్ విలనీ చూపిస్తూ రావు గోపాలరావు పోషించిన ఆ కాంట్రాక్టర్ పాత్ర, ఆ పాత్ర∙డైలాగులు తోడ్పడ్డాయి. అంతే, ఆయన సంభాషణలున్న సన్నివేశాల్లోని ‘ముత్యాల ముగ్గు’ డైలాగుల ట్రాక్‌ను గ్రామ్‌ఫోన్ కంపెనీ వారు అప్పట్లోనే రెండు ‘ఇ.పి.’ మోడ్ రికార్డులుగా తీసుకొచ్చారు. తర్వాత కాలంలో అదే ఆడియో క్యాసెట్లుగానూ వచ్చింది. అంతకు ముందు అక్కినేని ‘సుడిగుండాలు’ సినిమా డైలాగులు 78 ఆర్.పి.ఎం. రికార్డులుగా వచ్చినా, ఒక తెలుగు సినిమా డైలాగులు మోస్ట్ పాపులరై, జనం ఎగబడి ఆ డైలాగ్ రికార్డుల్ని కొనడం మాత్రం ‘ముత్యాల ముగ్గు’తోనే మొదలు. ఆ డైలాగులు ఎంత పాపులరంటే... అప్పట్లోనే అవి పది వేల జతల రికార్డులు అమ్ముడవడం మరో పెద్ద రికార్డ్. కేవలం రికార్డుల అమ్మకంపై ఇచ్చే 10 శాతం రాయల్టీతో ఆ రోజుల్లోనే రచయిత రమణకు ఏకంగా రూ. 40 వేలు వచ్చింది. సినిమా చూడడం మీదే కాక కేవలం డైలాగులే అలా పదే పదే వేసుకొని వినడం మీద జనానికి అంత క్రేజు నెలకొందంటే, ‘ముత్యాల ముగ్గు’ ఏ రేంజ్ హిట్టో చెప్పనక్కర లేదు. అందుకు ముళ్ళపూడి రాత, బాపు తీత, రావుగోపాలరావు చేత కారణమని చెప్పక తప్పదు. ‘ముత్యాల ముగ్గు’ డైలాగ్స్ గ్రామ్‌ఫోన్ రికార్డుల తర్వాత ఎన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’, ‘యమగోల’ (1977), నూతన్‌ప్రసాద్ ‘చలిచీమలు’ (1978) నుంచి ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ (1982) దాకా వరుసగా అనేక హిట్ చిత్రాల డైలాగ్ ట్రాక్‌లు అప్పటికి వచ్చిన ఎల్.పి. రికార్డుల పద్ధతిలో మార్కెట్లో రిలీజై, జనాన్ని ఆకర్షించాయి. అలా సినిమాల డైలాగ్స్ ట్రాక్ గ్రామ్‌ఫోన్ రికార్డులకూ ‘ముత్యాల ముగ్గు’ ఓ ట్రెండ్ సెట్టర్ అయింది.జనాకర్షక మార్కెటింగ్ వ్యూహాలు!బెజవాడకు చెందిన ప్రసిద్ధ అన్నపూర్ణ ఫిలిమ్స్ పంపిణీ చేసిన ‘ముత్యాల ముగ్గు’ ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది. రిలీజ్ సమయంలో ఆబాలగోపాలాన్నీ థియేటర్లకు ఆకర్షించేందుకు సినిమా పంపిణీదారులు, ప్రదర్శకులు వివిధ రకాల మార్కెటింగ్ టెక్నిక్స్ వాడారు. రిలీజ్ రోజున విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మార్నింగ్ షో, మ్యాట్నీలకు ప్రేక్షకులందరికీ ‘ముత్యాల ముగ్గు’ లాకెట్లు ఉచితంగా ఇచ్చారు. హైదరాబాద్ లాంటి చోట్ల ఈ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు పలువురు టికెట్‌తో పాటు హనుమంతుడి టోకెన్ ఒకటి చిన్నది ఉచితంగా తీసుకున్న సంగతి ఇప్పటికీ అపురూపంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ మార్కెటింగ్ ఎత్తుగడ సైతం సినిమాకు బాగా లాభించింది. అదో రకం మంచి మౌత్ పబ్లిసిటీ తెచ్చింది.అంతటితో ఆగలేదు. విజయవాడ లాంటి పట్నాల్లో అప్పట్లో ప్రత్యేకంగా అరచేతి సైజులో ‘ముత్యాల ముగ్గు’ పాటల పుస్తకం ప్రచురించి, మహిళా ప్రేక్షకులకు థియేటర్ల వద్ద ఉచితంగా ఇచ్చేవారు. అది కేవలం సినిమా పాటల పుస్తకమే కాదు. ముగ్గుల పుస్తకం కూడా! ఎందుకంటే, అందులో సినిమాలోని పాటలతో పాటు... రకరకాల మెలికల ముగ్గులు, ఎన్ని చుక్కలతో ఎలా ముగ్గు వేయాలన్న వివరంతో సహా అన్నీ ఉండేవి. దాంతో, ఆ చిన్న సైజు ‘ముత్యాల ముగ్గు’ పుస్తకానికి మహిళల్లో భలే క్రేజుండేది. అందులోని ఆ ముగ్గులను ఇళ్ళ ముందు రంగవల్లులుగా తీర్చిదిద్దడంలో ఆడపిల్లలు పోటీలు పడేవారు. అలా ముగ్గులతో పాటు సినిమా కూడా జనం నోళ్ళలో నానడం... అతి పెద్ద మార్కెటింగ్ వ్యూహమైంది. అలా ఆ రోజుల్లోనే ‘ముత్యాల ముగ్గు’ అనేక కొత్త తరహా ప్రచార ధోరణులకు నాంది పలికింది.పబ్లిసిటీ యాడ్స్‌లోనూ ప్రత్యేకతబాపు – రమణలకు సన్నిహితుడైన ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.ఎన్. భూషణ్ ప్రెస్ రిలేషన్స్‌కు పనిచేసిన ఈ చిత్రం పబ్లిసిటీలోనూ కొత్త పోకడలు పోయింది. టైటిల్‌కు తగ్గట్టే ముగ్గుల్ని పబ్లిసిటీ డిజైన్‌లో భాగం చేశారు. అలాగే, నటీనటుల టైట్ క్లోజప్ ఫోటోలను డిజైన్లలో ఎక్కువగా వాడి, చూపరులకు కొత్త ఫీల్ తీసుకొచ్చారు. పూర్వాశ్రమంలో ప్రఖ్యాత యాడ్ ఏజెన్సీల్లో పనిచేసిన అనుభవం ఉన్న బాపు... సర్వసాధారణంగా వాణిజ్య ఉత్పత్తుల పబ్లిసిటీ డిజైనింగ్‌లో కనిపించే పద్ధతిని ఈ సినిమా పబ్లిసిటీ యాడ్స్‌కు వాడారు. పేజీలో చాలా భాగం ఖాళీ ఉంచి, కంటికి కావాల్సినంత రిలీఫ్ ఇస్తూ, ఓ మూలన 200వ రోజు అంటూ సినిమా టైటిల్, ప్రధాన వ్యక్తుల పేర్లు వేయడం లాంటి యాడ్ పబ్లిసిటీ టెక్నిక్‌లతో అబ్బురపరిచారు. బాపు ఏనాడో చూపిన ఆ బాట ఆ తర్వాత చాలామందికి అనుసరణీయమైంది. చాలా ఏళ్ళ తర్వాత దర్శకుడు మణిరత్నం సైతం నాగార్జున ‘గీతాంజలి’ (1989 మే 12) లాంటి తన సినిమాల పబ్లిసిటీకి ఈ తరహా యాడ్స్‌ను డిజైన్ చేయించడం మరపురాని విషయం.∙సినిమా నవలా సూపర్‌హిట్టే!‘ముత్యాల ముగ్గు’ తొలి రిలీజు నాడే ఆ సినిమాకు సంబంధించిన వెండితెర నవల కూడా మార్కెట్లోకి వచ్చింది. ఆ సినిమాకు నిర్మాతగా క్రెడిట్ అందుకున్న తెలుగు లెక్చరర్, స్వయంగా రచయిత అయిన ఎమ్వీయలే ఆ వెండితెర నవలీకరణ చేయడం విశేషం. బాపు – రమణల ‘సాక్షి బుక్స్’ పేరిట విజయవాడలోని నవోదయ పబ్లిషర్స్ అధినేత ఎ. రామ్మోహనరావు ఆ నవలను ముద్రించి, సోల్ డిస్ట్రిబ్యూషర్గా వ్యవహరించారు. సినిమాతో పాటు ఈ వెండితెర నవల కూడా సూపర్‌హిట్. సినిమా రిలీజైన కొద్ది రోజులకే అన్ని కాపీలూ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ‘ముత్యాల ముగ్గు’ 50వ రోజుకు చేరుకొనే సమయానికి నవల రెండో ముద్రణకు వచ్చేసింది. నూటయాభై రోజుల నాటికి ఆ ముద్రణ కూడా అయిపోయింది. 1976 మార్చికి ముచ్చటగా మూడో ముద్రణ వచ్చేసింది. అలా ఒక సినిమా తాలూకు వెండితెర నవల అంతగా ప్రాచుర్యం పొందడం, అన్ని కాపీలు అమ్ముడుపోవడం కూడా అప్పట్లో ‘ముత్యాల ముగ్గు’ చేసిన మ్యాజిక్. ఎన్నో ముద్రణలు పొందిన ఆ వెండితెర నవల ఇటీవల ‘అక్షజ్ఞ పబ్లికేషన్స్’ ద్వారా మళ్ళీ కొత్తగా ప్రచురితమైంది. యాభై ఏళ్ళ నాటి ఆ సినిమా నవల ఇలా నేటికీ పాఠకాదరణకు నోచుకోవడం నిజంగానే విశేషం.పోటాపోటీలో... 300 రోజుల బాక్సాఫీస్ బంపర్‌హిట్1975 జూలై చివరలో ‘ముత్యాల ముగ్గు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకపక్కన హిందీ హిట్ ‘యాదోంకీ బారాత్’కు రీమేకైన అగ్ర హీరో ఎన్టీఆర్ ‘అన్నదమ్ముల అనుబంధం’ అప్పటికే రిలీజై, జోరు మీదుంది. మంచి వసూళ్ళతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. మరోపక్కన రంగనాయకమ్మ పాపులర్ నవల ఆధారంగా, వరుస విజయాల హీరో శోభన్‌బాబుతో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బలిపీఠం’ వచ్చి వారమే అయింది. వేరొకపక్క కృష్ణ – వాణిశ్రీ జంటగా కాశ్మీర్ లాంటి సుందర ప్రదేశాల్లో కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో ‘చీకటి వెలుగులు’ వచ్చి రెండే వారాలైంది. ఇక, ‘ముత్యాల ముగ్గు’ వచ్చిన సరిగ్గా వారం రోజులకల్లా కృష్ణంరాజు – జయప్రద తదితరులు నటించిన ‘నాకూ స్వతంత్రం వచ్చింది’ రిలీజైంది. ‘ముత్యాల ముగ్గు’ వచ్చి ఇరవై రోజులైందో లేదో, శోభన్‌బాబు ‘జేబుదొంగ’ (1975 ఆగస్ట్ 15న రిలీజ్) సైతం థియేటర్లలో వచ్చి చేరి, హిట్టయింది. అదిగో... అలాంటి గట్టి పోటాపోటీ సమయంలో, అందరు స్టార్ హీరోల సినిమాల మధ్య, ఎలాంటి స్టార్లూ లేకుండా రిలీజైన ‘ముత్యాల ముగ్గు’ ఆ పెద్ద చిత్రాలను తట్టుకొని, బలంగా నిలబడింది. ఇంకా చెప్పాలంటే వాటన్నిటినీ అధిగమించి మరీ, అఖండ విజయం సాధించింది. బ్లాక్‌బస్టర్ సూపర్‌హిట్టయింది. అదీ అసాధారణ విషయం. మొదటి వారం కాస్త అటూ ఇటూగా ఉన్నా, రెండోవారం అందుకున్న సినిమా కలెక్షన్లు, మూడోవారానికల్లా బాగా పుంజుకొన్నాయి. ఆపైన సినిమా ఆగకుండా దూసుకుపోయింది. మొత్తం 28 కేంద్రాల్లో 29 థియేటర్లలో రిలీజైన ‘ముత్యాల ముగ్గు’ 12 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. చిత్రంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లు రెంటిలోనూ వేర్వేరుగా వంద రోజులు ఆడడం విశేషం. ఆ రోజుల్లోనే ఫస్ట్ సెట్లో విడుదలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి... 5 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకొంది. సెకండ్ సెట్లో రిలీజైన మరో కేంద్రం బెంగుళూరులోనూ ‘మినర్వా’ థియేటర్లో ఆ పైన సిల్వర్ జూబ్లీ చేసుకొంది. అక్కడ ఏకంగా 200 రోజులు దిగ్విజయంగా నడిచింది. ఇక, తిరుపతి ‘మినీ ప్రతాప్’లో అయితే ఈ సినిమా 260 రోజులు ఆడడం మరో విశేషం. తెలుగు రాజధాని హైదరాబాద్‌లో షిఫ్టులతో ఏకంగా 300 రోజులు నడిచిందీ సినిమా. ‘ముత్యాల ముగ్గు’ చిత్ర శతదినోత్సవం 1975 నవంబర్ 1 ఉదయం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో ఘనంగా జరగగా, త్రిశత దినోత్సవాన్ని 1976 మే 21న మద్రాస్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్స్ హోటల్లో నిర్వహించారు. హైదరాబాద్ సహా తెలుగు ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో తీసుకువచ్చిన ‘బాలానంద సంఘం’ బాలబాలికల ముందు ఆ 300 రోజుల వేడుక జరిగింది. సరిగ్గా ఆ వేడుక జరిగిన వారం రోజులకు మే 29న బాపు – రమణల మరో బంపర్‌హిట్ పౌరాణిక గాథ కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ రిలీజవడం విశేషం.ఎన్టీఆర్ మెచ్చిన త్రీ మచ్ సినిమా!‘ముత్యాల ముగ్గు’లో వెన్నెల్లో మల్లెపందిరి కింద హీరో హీరోయిన్ల శోభనం రాత్రి çసన్నివేశాలు, వాటిని అశ్లీలంగా కాక అందమైన అనుభవంగా చిత్రీకరించిన విధానం, ఆ నేపథ్య సంగీతం... వగైరాలను అగ్ర హీరో ఎన్టీఆర్ సైతం ఎంతో మెచ్చుకున్నారు. ‘మా పాతరోజులు గుర్తొచ్చాయి బ్రదర్’ అని బాపు – రమణలతో అన్నారు. ‘‘ఎన్టీఆర్ మాతో, ‘అసలు మీ సినిమాలో కుర్రాడు... విలన్ దగ్గర సర్వెంటుగా రావడం హైలైట్! ఏముంది? ‘బాలనాగమ్మ’లో బాలవర్ధిరాజు... మాయల ఫకీరు కోటలో చేరినట్టే! మీరు ఇంకాస్త డోసు పెంచితే సినిమా టూ హండ్రెడ్ డేస్ పోయేది’ అని, ఓ క్షణం ఆగి – ‘ఓహో! మొన్న త్రీ హండ్రెడ్ డేస్ అయింది కదూ. ఇది టూ మచ్... కాదు కాదు త్రీమచ్’ అని అట్టహాసంగా నవ్వేశారాయన’’ అని బాపు స్వయంగా పేర్కొన్నారు. స్టార్లకు సైతం దక్కని సిల్వర్‌జూబ్లీ హిస్టరీ!ఆ రోజుల్లో ‘ముత్యాల ముగ్గు’ ఎంత పెద్ద హిట్టంటే, 1975లో తెలుగు సినిమా టాప్ గ్రాసర్లలో అదొకటి. హైదరాబాద్‌లో అంతకు ముందున్న ‘దసరా బుల్లోడు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి స్టార్ హీరోల ‘‘25 వారాల సూపర్‌హిట్ చిత్రాల రికార్డుల్ని 50 రోజుల్లోనే అవలీలగా’’ దాటేసింది. ఆ సంగతి పంపిణీదారులే ఘనంగా పత్రికల్లో ప్రకటించారు. 1975 వరకు తెలుగు సినీచరిత్రను తరచి చూస్తే – ‘జీవితం’ (1950) సినిమా అనంతరం, 1950వ దశకం ప్రారంభంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు స్టార్ హీరోలైన తర్వాత... ఆ పాతికేళ్ళ కాలంలో ఆ ఇద్దరు హీరోలూ లేకుండా, లేదా ఒక చిన్న సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయింది రెండే రెండుసార్లు. ఆ చిత్రాలు ఏవంటే, ఒకటి – ‘లేత మనసులు’ (1966). రెండు – ‘ముత్యాల ముగ్గు’ (1975). అలాగే, 1970ల ప్రారంభంలో కృష్ణ, శోభన్‌బాబు స్టార్ హీరోలైన తర్వాత కూడా కృష్ణ ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’, అలాగే శోభన్‌బాబు ‘జీవనతరంగాలు’, ‘శారద’, ‘జీవనజ్యోతి’ లాంటివి మాత్రమే బ్లాక్‌బస్టర్ సూపర్హిట్లయ్యాయి. ఆ స్టార్ హీరోలందరితో సమంగా నిలిచింది ఒక్క ‘ముత్యాల ముగ్గే’. ఆ తర్వాత మళ్ళీ కె. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ (1980 రిలీజ్)కి ఆ ఘనత దక్కింది. అటుపైన అనేక చిత్రాలు ఆ దోవలో పయనించాయి. ఇక, సిల్వర్ జూబ్లీల్లోనూ ‘ముత్యాల ముగ్గు’ది మరో ఘనమైన రికార్డ్. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్ల సినిమాల తర్వాత ఫస్ట్ బ్యాచ్ రిలీజ్లో 5 సెంటర్లలో రెగ్యులర్ షోలతో రజతోత్సవం చేసుకున్న సినిమా కూడా ఇదొక్కటే! తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్ర గమనిస్తే... స్టార్లయిన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులకు సైతం వాళ్ళ మొత్తం కెరీర్లోనే రెగ్యులర్ షోలతో, ఇన్ని కేంద్రాల్లో పాతికవారాలాడిన సినిమా ఏదీ లేదు. అది గమనార్హం. ‘ముత్యాల ముగ్గు’ తర్వాత మళ్ళీ 5 సెంటర్లలో రెగ్యులర్ షోలతో, మరో 4 కేంద్రాల్లో నూన్‌షోలతో సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమా ఆ తరంలో ‘శంకరాభరణం’ ఒక్కటే! అలాగే, 1975 నవంబర్ 1 నాటికి వంద రోజులు పూర్తి చేసుకున్న ‘ముత్యాల ముగ్గు’ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు సంబంధించినంత వరకు అత్యంత అన్ సీజన్‌గా భావించే నవంబర్, డిసెంబర్, అలాగే జనవరి ఆరంభం... ఇలా మొత్తం పదివారాలనూ బలంగా తట్టుకొని నిలబడి, నిలకడగా కలెక్షన్లు రాబడుతూ, రెగ్యులర్ షోలతో రజతోత్సవం వైపు స్థిరంగా అడుగులు వేసింది. అది ఆ సినిమా బాక్సాఫీస్ సత్తాకు నిదర్శనం. గమనించాల్సిన మరో విశేషం. ‘ముత్యాల ముగ్గు’ డైలాగుల్లోనే చెప్పాలంటే, ఈ ‘‘ఇస్టరీని సింపేస్తే సిరిగిపోదు... సెరిపేస్తే సెరిగిపోదు!!’’తెగనమ్మిన నిర్మాత... లాభపడ్డ బయ్యర్...అనూహ్య విజయం అనంతరం కొన్నేళ్ళకు... సదరు ‘ముత్యాల ముగ్గు’ నిర్మాత చుట్టూ చాలామంది చేరారు. వాళ్ళమాట విన్న నిర్మాత ఎమ్వీయల్ కాస్తా... బాపు–రమణలకు మాట మాత్రంగానైనా చెప్పకుండానే బోలెడంత రిపీట్ రన్ వ్యాల్యూ ఉన్న కామధేనువు లాంటి ‘ముత్యాల ముగ్గు’ హక్కుల్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డికి రెండున్నర లక్షలకు తెగనమ్మేశారు. చిత్రమేమంటే, నెల తిరిగే లోపల కేవలం దూరదర్శన్‌లో ప్రసారానికి గాను ఆ సినిమా టెలీ రైట్స్ ఒక్కటే ఎమ్మెస్ రెడ్డికి రూ. 5 లక్షలు తెచ్చిపెట్టాయి. మద్రాసు దూరదర్శన్ నుంచి (నేషనల్ టెలికాస్ట్‌లో భాగంగా) ప్రసారమైన మొట్టమొదటి తెలుగు సినిమా ‘ముత్యాల ముగ్గే’. ఆ ప్రసారానికి గాను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలు పలకడం మరో విశేషం.అవార్డుల్లోనూ... ఆగని సూపర్ హిట్!ఆ ఏడాది అనేక సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ, ‘ముత్యాల ముగ్గు’ సృష్టించిన సంచలనం మాత్రం సాధారణం కాదు. జనం రివార్డులు, ప్రభుత్వ – ప్రైవేట్ అవార్డులు... అన్నీ ఆ సినిమాకే! ఆ ఏటి ఉత్తమ తెలుగు చిత్రంగా కేంద్ర ప్రభుత్వం వారి రజత కమలం, అదే నేషనల్ అవార్డుల్లో అఖిల భారత స్థాయిలో ఉత్తమ వర్ణఛాయాగ్రహణానికి (ఇషాన్ ఆర్య) అవార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వ రజత నంది దాకా ‘ముత్యాల ముగ్గు’కే వచ్చాయి. ఇక, మద్రాస్ ఫిలిమ్ ఫ్యాన్స్, ఆంధ్రా సినీ ఫ్యాన్స్, ఆంధ్రా సినీ గోయర్స్, ‘ఆంధ్రపత్రిక’, తెనాలి ‘ఫిలిమ్ క్లాసిక్’... ఇలా అనేక ప్రతిష్ఠాత్మక ప్రైవేట్ సంస్థల అవార్డులు కూడా లెక్కేస్తే... సుమారు నాలుగు పదుల దాకా అవార్డులు ఈ సెల్యులాయిడ్ క్లాసిక్‌కు దక్కాయి. ఇలా ‘ముత్యాల ముగ్గు’కు జనం రివార్డుతో పాటు విమర్శకుల అవార్డుల పరంపర లభించడం నేటికీ అబ్బురపరుస్తుంది.తారాచంద్ బర్జాత్యా సహా తెరకెక్కని ఆలోచనలెన్నో! ‘ముత్యాల ముగ్గు’ చూసి, ప్రముఖ హిందీ సినీ పంపిణీ సంస్థ ‘రాజశ్రీ పిక్చర్స్’ అధినేత – చిత్ర నిర్మాత అయిన తారాచంద్ బర్జాత్యా సైతం బాపు – రమణలతో సినిమా తీయాలని ముచ్చటపడ్డారు. బాపును తన మద్రాసు ఆఫీసుకు పిలిపించారు. మనసుకు హత్తుకున్న ‘ముత్యాల ముగ్గే’ హిందీలో చేద్దామని పెద్దాయన ప్రతిపాదించారు. కానీ, అప్పటికే ఏ.వి.ఎం. వారు ఆ సినిమా హక్కులు కొనేసుకున్నారు. పోనీ... వెండితెరపై హిట్ ఫార్ములా అయిన ‘సిండ్రెల్లా’ తరహా కథ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనా చేశారు. ఒక దశలో ‘శ్రీకృష్ణ – సుదామ’ (మన తెలుగు భక్త కుచేలుడి కథ) చిత్రం తీయించాలని కూడా తారాచంద్ అనుకున్నారు. కానీ, దర్శక – రచయితల జీతభత్యాల మొదలు సినిమా ఖర్చుల దాకా అన్నింటిలో అపరిమితమైన పొదుపు పాటించే తారాచంద్ బార్జాత్యా దెబ్బకు ఆ ప్రతిపాదనలేవీ పట్టాలెక్కనే లేదు. అలాగే, ‘శ్రీరామచిత్ర’ బ్యానర్‌పై తొలిచిత్రంగా ‘ముత్యాల ముగ్గు’ నిర్మాణమై, హిట్టయిన తర్వాత... అదే బ్యానర్‌పై రెండో చిత్రాన్ని బాపు – రమణల సారథ్యంలో ఏయన్నార్‌తో ప్రకటించారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాగే, బాపు – రమణల ‘త్యాగయ్య’లో ప్రధాన పాత్ర చేసేందుకు ఏయన్నార్ సరే అన్నా... 1980ల మొదటి దాకా అదీ కార్యరూపం దాల్చలేదు. చివరకు ‘శంకరాభరణం’ ఫేమ్ జె.వి. సోమయాజులుతో నవతా కృష్ణంరాజు నిర్మాతగా, బాపు – రమణల ‘త్యాగయ్య’ (1981 ఏప్రిల్ 17) తయారవడం వేరే కథ.హిందీలో ఏ.వి.ఎం! కాపీకొట్టి మరీ... మరికొందరు!! సూపర్‌హిట్టయిన ‘ముత్యాల ముగ్గు’ కథ ఆ తర్వాత హిందీలోనూ రీమేక్ అయింది. హక్కులు తీసుకున్న ప్రసిద్ధ సంస్థ ఏ.వి.ఎం. వారు హిందీలో ‘జీవన్ జ్యోతి’గా నిర్మించారు (1976 మే 7న రిలీజ్). సలిల్ చౌధరీ సంగీతం అందించిన ఆ సినిమా ప్రముఖ నటి బిందియా గోస్వామికి తొలి సినిమా. చిన్నపిల్లలు, కుటుంబ సెంటిమెంట్ నిండిన ఆ కథను అక్కడి ప్రేక్షకులూ ఆదరించారు. ఆ హిందీ రీమేక్ సైతం వంద రోజులు ఆడింది. ఆపైన షిఫ్టులతో రజతోత్సవమూ జరుపుకొంది. ‘ముత్యాల ముగ్గు’ కథ హిందీ తర్వాత తమిళంలోకీ వెళ్ళింది. తెలుగులో ‘పుట్టినిల్లు – మెట్టినిల్లు’ దర్శకత్వం వహించిన పట్టు (పూర్తిపేరు ఆర్. పట్టాభిరామన్) దర్శకత్వంలో ఆర్ముగం ఆర్ట్స్ వారు తమిళంలో ‘మహాలక్ష్మి’ పేరిట ఈ రీమేక్‌ను తెరకెక్కించారు. తెలుగులో నటించిన సంగీతే తమిళంలోనూ హీరోయిన్. జైశంకర్ హీరో. 1976 మే 27న ఈ తమిళ ‘మహాలక్ష్మి’ ఆరంభమైంది. తెలుగులోని రావుగోపాలరావు పాత్రను అశోకన్, కాంతారావు పాత్రను యస్.వి. సుబ్బయ్య తమిళ వెర్షన్లో పోషిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఏమైందో ఏమో కానీ తీరా ఈ తమిళ రీమేక్ జనం ముందుకొచ్చేటప్పటికి 1979 అక్టోబర్ 20 అయింది.ఇవన్నీ అధికారిక రీమేక్లైతే, హీరో కృష్ణతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సూపర్‌హిట్ ‘నంబర్ వన్’ (1994 జనవరి 14) సహా అనధికారిక కాపీలకు హద్దే లేదు. అలాంటి ఓ హిట్ సినిమా చూసి ఆశ్చర్యపోయిన రచయిత రమణ అది తమ ‘ముత్యాల ముగ్గు’కు కాపీ అంటూ ఫిర్యాదు చేశారు. సినీ రచయితల సంఘం వాళ్ళు పదమూడు మంది సభ్యులతో ఏకంగా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ వారు రెండు సినిమాలూ చూసి, చర్చించి, సదరు సినిమా అక్షరాలా ‘ముత్యాల ముగ్గు’కు కాపీయే అని ఏకగ్రీవంగా తీర్మానం కూడా రికార్డ్ చేశారు. ఇంతలో సదరు కాపీచిత్ర దర్శక, నిర్మాతలు ఏం మతలబు చేశారో ఏమో కానీ, సదరు తీర్మానం బయటకు రాకుండానే భూస్థాపితమై పోయింది. ‘కాపీ రైట్’ కాస్తా ‘కాపీ కొట్టడమే రైటు’ అన్నట్టుగా తయారైంది. ఏమైనా, మాటలు, పాటలు, సంగీత స్వరాలు, నేపథ్య గళాలు, కళ్ళను కట్టేసే ఛాయాగ్రహణ సౌందర్యం, నాలుగు నిమిషాల పాటు మాటా పలుకూ లేకుండా చిత్రీకరించిన హీరో హీరోయిన్ల తొలి రేయి సన్నివేశంలో చెవులకు పట్టేసే సజ్జాద్ హుస్సేన్ మాండొలిన్ వాద్య నేపథ్య మాధుర్యం, ప్రతి పాత్రకూ ప్రాణం పోసిన పాత్రధారుల అభినయం, నిర్మాణ విలువలు మొదలుకొని నిర్దేశకత్వ సామర్థ్యం దాకా... ఇలా అన్నింటి సమపాళ్ళ మేళవింపు ‘ముత్యాల ముగ్గు’. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ‘ఆంధ్రప్రభ’లో ఈ సినిమాను సమీక్షిస్తూ, ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ పేర్కొన్నట్టు ‘‘రమణీయమైన దృశ్యకావ్యంగా రూపొందిన రంగుల చిత్రం ఇది.’’ అందుకే, ఇది మామూలు చిత్రాల్లో కనిపించని గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. భావుకత, కళాత్మకత కోరుకునే సినీ ప్రేమికులకు పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది. వెరసి నాటికీ నేటికీ ఇది... తెలుగు సినిమాతల్లి ముంగిట వెల్లివిరిసిన ‘ముత్యాల ముగ్గు’. మున్నూరు రోజుల పైగా మహాజనం మెచ్చిన బ్లాక్‌బస్టర్ రతనాల రగ్గు. తరాలు మారినా తెలుగు తెరకు ఎప్పటికీ తరగని నిగ్గు. – రెంటాల జయదేవ -
ఆమె విజయానికి మీసాల కృష్ణుడే సాక్షి
సాక్షి, కొత్తపేట(తూర్పు గోదావరి) : కథానాయకుడు కృష్ణ – కథానాయకి విజయనిర్మల మధ్య ప్రేమకు పునాది పడింది ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలోనే. 1967 సంవత్సరంలో నందనా ఫిలిమ్స్ (శ్రీరమణ చిత్ర) పతాకంపై బాపు దర్శకత్వంలో సురేష్‌కుమార్, శేషగిరిరావు నిర్మించిన ‘సాక్షి’సినిమాలో వారిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా అవుట్డోర్ షూటింగ్ ఆత్రేయపురం మండలంలో పులిదిండి జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు అనుకున్న గ్రామం గురించి ఓ మ్యాప్ గీసుకున్నారు. అందులో ఓ బల్లకట్టు ఉన్న ఓ కాలువ, కాలువ దగ్గర రేవులో ఓ పెద్ద చెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్లో ఓ చిన్న గుడి, గుడికో మండపం ఉండాలి. గోదావరి పరిసరాల్లో ఇరిగేషన్ శాఖలో పనిచేసి సీలేరు ప్రాజెక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాపు, రమణల బాల్యమిత్రుడు, రచయిత బీవీఎస్ రామారావును తమ మ్యాప్‌ను పోలిన ఊరును వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవు పెట్టి అలాంటి ఊరికోసం రాజమండ్రి వచ్చి ఇరిగేషన్ కాంట్రాక్టర్‌గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజును ఊరిని వెతికేందుకు సాయమడిగారు. ఆ మ్యాప్‌లో ఊరిని పోలినట్టుగా తమ ఊరు పులిదిండే వుందన్నారు. ఆ సమాచారంతో బాపు, రమణలు పులిదిండి రాగా వారికి రాజు తమ ఇంట్లోనే బస ఏర్పాటుచేశారు. పులిదిండితో పాటు బొబ్బర్లంక, పిచ్చుక లంక, ఆత్రేయపురం, ఆలమూరు, కట్టుంగ తదితర గ్రామాలను పరిశీలించారు. చివరికి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు. ఆ గ్రామంలో చాలా వరకూ షూటింగ్ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. అది 1965 ప్రాంతం.. కథలో బాగంగా దర్శకుడు బాపు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సాక్షి సినిమా పూర్తిగా జిల్లాలో పులిదిండి గ్రామంలో చిత్రీకరిస్తున్నారు. తొలిరోజు కథానాయిక విజయనిర్మల, కథానాయకుడు కృష్ణలమీద ఒక పాట చిత్రీకరిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. విజయనిర్మల అన్న ఫకీర్ పేరుమోసిన రౌడీ. వాడికి వ్యతిరేకంగా ఒక హత్యకేసులో కృష్ణ సాక్ష్యం చెబుతాడు. జైలు నుంచి రాగానే కృష్ణను చంపుతానని ఫకీర్ ప్రతిజ ్ఞచేస్తాడు. ఫకీర్ చెల్లెలు విజయనిర్మల కృష్ణను పెళ్ళి చేసుకోమంటుంది. ఫకీర్ జైలు నుంచి విడుదలయ్యాడని వార్త గ్రామంలో పొక్కింది. విజయనిర్మల తాళిబొట్టును తీసుకువచ్చి, తన మెడలో కట్టమంటుంది. మరి కొద్దిసేపటికి చచ్చిపోయేవాడికి పెళ్లేమిటి? అని కృష్ణ కంటనీరు పెట్టుకుంటాడు... ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా నూరేళ్ళు పచ్చగా..అన్న ఆరుద్ర పాటను బాపు ఒక్కరోజులో చిత్రీకరించారు. షూటింగ్ జరిగిన ఆలయానికి మీసాల కృష్ణుడి ఆలయమని పేరు.. రాజబాబు వచ్చి, ఇది పవర్ఫుల్ టెంపుల్, నిజ జీవితంలో కూడా మీరు దంపతులు అవుతారని ఆయన అన్నాడు. ఆ సమయంలో రాజబాబు ఆ మాటంటే ఏమిటా పిచ్చిమాటలు అని విజయనిర్మల కసిరారు. మూడు నాలుగు సినిమాల తరువాత వారు నిజంగానే దంపతులు అయ్యారు. గోదారమ్మవారిని కలిపింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలోనే విజయనిర్మల అక్కినేని సరసన బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. రెండు విజయవంతమైన సినిమాలే! విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం పడిందని కొత్తపేటకు చెందిన కవి, రచయిత షేక్ గౌస్ తెలిపారు. బాపు దర్శకత్వంలో చిత్రీకరించిన సాక్షి సినిమాలో కృష్ణతో, బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో విజయనిర్మల హీరోయిన్గా నటించారు. ఆ రెండు సినిమాలు కోనసీమలోనే చిత్రీకరించారు. ఆమె బాపు దర్శకత్వాన్ని గమనించి దర్శకత్వంలో మెళకువలు తెలుసుకున్నారు. ‘సాక్షి’ సినిమా పరిచయం ద్వారా కృష్ణ – విజయనిర్మల ఒకటైనదీ, ఆమె దర్శకత్వానికి బీజం పడినదీ కోనసీమలోనే అని గౌస్ తెలిపారు. -
శ్రీదేవీ రమణీయం
♦ సోల్ మేట్ బాపు-రమణల జంటలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ జయంతి నేడు. రమణగారు చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డారు. పదో యేటే తండ్రిగారు గతించడంతో రమణగారి తల్లిగారు పిల్లలను తీసుకుని మద్రాసు వచ్చారు. అక్కడే రమణగారు ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. చదువు అయిపోయాక మళ్లీ రాజమండ్రి వచ్చేశారు. కొన్నాళ్లు చిన్నాచితకా పనులు చేశారు. ఖాళీ సమయంలో ఇంగ్ల్లీషు పుస్తకాలు చదువుతుండేవారు. అది చూసి అక్కడి ఇంగ్లీషు దొరగారు రమణగారిని అభిమానించి ‘ఇక్కడ పని మానేసి వెళ్లి మంచి ఉద్యోగం చూసుకో’ అని పది రూపాయలు చేతిలో పెట్టి పంపించారట. ఆ పది రూపాయలు, ఒక జత బట్టలు తీసుకుని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రమణగారు మద్రాసు బయలుదేరారు. ఈ వివరాలన్నీ మనకు ఆయన ఆత్మకథలో దొరకుతాయి. అందులో లేని విషయాలు కొన్ని ఇప్పుడు ఆయన సతీమణి శ్రీదేవి మాటల్లో విందాం. సినిమాలలోకి రావడానికి ముందు రమణగారు ఏదో చిన్న పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. అదేం దురదృష్టమో ఆ పత్రికను నెల్లాళ్లకే మూసేశారు. ఆ తరవాత ఆంధ్రపత్రికలో చేరారు. అక్కడ పనిచేయడం ప్రారంభించాక చాలా కథలు రాశారు. అయితే ఆంధ్రపత్రికలో కొంతకాలం పనిచేశాక రమణగారు ‘నేను ఒకరి కింద పనిచేయలేను’ అని పత్రిక నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగం లేకపోయినా బతకగలను. జీతం కంటె విడిగానే ఎక్కువ సంపాదిస్తానని వారితో చెప్పి ఉద్యోగం మానేశారట. ఆయన అనుకున్నట్టుగానే డబ్బు కొద్దికొద్దిగా సంపాదించడం ప్రారంభించారు. మహానటులు గోవిందరాజుల సుబ్బారావు గారి దగ్గరకు చాలామంది వస్తుండేవారు. ఆయన హోమియో వైద్యులు. ఆయన తమ్ముడి కొడుకు శ్రీనివాసరావు గారే వెంకటరమణగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పట్లో అజంతా గారు, విఏకె రంగారావుగారు, రావి కొండలరావు గారు వీరంతా స్నేహితులు. అందరూ కలిస్తే సరదాగా గడిపేవారట. ఆ తరవాత నెమ్మదిగా డబ్బింగ్ సినిమాలకి పనిచేశారు. తెలుగులో డూండీ గారి ‘రక్తసంబంధం’ మొట్టమొదటి సినిమా. అప్పటికే రమణగారు బాపుగారు అర్ధనారీశ్వరులయ్యారు. సినిమా కోసం ఏ కథ రాసినా ముందుగా బాపు గారితో చర్చించాక నాకు చెప్పేవారు. నాకు నచ్చితే బావుందని చెప్పేదాన్ని. లేకపోతే నా అభిప్రాయం నేను చెప్పేదాన్ని అంతే. గోదావరి ప్రాణాధారం రమణగారి సినిమాల్లో గోదావరి నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. రమణగారు బాల్యంలో ధవళేశ్వరం దగ్గర రాయవరంలో ఉండేవారు. అక్కడ లాంచీలు, పడవలు నడిపే వాళ్లు చాలామంది ఉండేవారు. రమణ గారి తల్లి వారందరికీ తలలో నాలుకలా ఉండేవారు. పడవ వాళ్లు దుంగలు అవీ తెచ్చి ఇస్తుంటే ఆవిడ అన్నం వండి, ఆవకాయ వేసి వాళ్లకి అన్నం పెట్టేవారు. వాళ్లు నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండటంతో రమణగారు నది ఒడ్డుకి వెళ్లి వాళ్లతోనే ఎక్కువగా ఆడుకునేవారు. ఆ పడవ వాళ్లకు రమణగారంటే చాలా ఇష్టం. వారు ఈయన్ని ఎత్తుకుని ఆడించేవారు. ఆ తరవాత మద్రాసు రావడం, మూగమనసులు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావుగారితో పని చేయడం, ఆ కారణంగా గోదావరికి మళ్లీ రావడం జరిగింది. గోదావరిలో మొట్టమొదటి ఔట్‌డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం మూగమనసులే. ఆ తరవాత చాలా సినిమాలు గోదావరిలో తీశారు. నాకు ఆయన చిత్రాలలో అందాల రాముడు అంటే చాలా ఇష్టం. ఆ సినిమా గోదావరి మీద తీసిందే. బాపూ జోడీ రమణ గారి గురించి మాట్లాడేటప్పుడు బాపు దంపతుల గురించి ప్రస్తావించకపోవడం సాధ్యం కాదు. మా జీవితంలో ఆ దంపతులు నిత్యం ఉంటారు. బాపుగారికి మా అన్నయ్య (నండూరి రామమోహనరావు) నా ఫొటో చూపిస్తే, ఆయన వెంటనే ‘మా రమణ ఉన్నాడుగా’ అన్నారట. అలా నన్నిచ్చి వివాహం చేయడానికి అంగీకరించేశారు. మా పెళ్లినాటికి నా వయసు 20, రమణగారి వయసు 32. నేను అంతవరకు ఇల్లు కదిలిందే లేదు. అటువంటిది అందరినీ వదిలేసి ఆ చిన్న పల్లెటూరు నుంచి మద్రాసు మహానగరానికి వచ్చాను. పెళ్లయిన మొదట్లో అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లేదాన్ని. ఆ తరవాత కొంత కాలానికి నేను ఇంటికి వెళ్లడమే తగ్గిపోయింది. బాపుగారి తల్లి సూర్యకాంతమ్మగారు... రమణగారిని, నన్ను సొంతమనుషుల్లా చూసుకున్నారు. మా అత్తగారు ఆదిలక్ష్మికి అందరి కంటె నేనంటేనే చాలా ఇష్టం. కోపం వస్తే మాట అనేసేవారు. అంతలోనే ప్రేమగా చూసేవారు. బంగారు భాగ్యవతి... బాపుగారి భార్య భాగ్యవతి నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించింది. ఆవిడ నా కంటె నాలుగేళ్లు పెద్ద. పెళ్లయి వచ్చిన కొత్తలో నాకు ఎలా మసలుకోవాలో తెలియక మా ఇద్దరి మధ్య మాటా మాటా వచ్చినా భాగ్యవతి పెద్ద మనసుతో సద్దుకుపోయేది. ఆ తరవాత నాకే తెలిసేది నేను చేసిన తప్పేంటో. ఏదైనా సరే భాగ్యవతి కరెక్ట్‌గా చేస్తుందని కొంతకాలానికి అర్థం చేసుకున్నాను. ఇద్దరికీ మాట వచ్చినా, ఇబ్బంది వచ్చినా... జరిగిన తప్పును ఒప్పుకోవడం వల్ల వచ్చే సుఖం నాకు తెలుసు. ధైర్యం ఎక్కువ చిత్రాలు నిర్మించినప్పుడు ఎంత ఆస్తి కరిగిపోయినా, వెంకటరమణగారు ధైర్యంగా ఉండటంతో నేను కూడా ధైర్యంగానే ఉన్నాను. బాపు గారి అండ వల్ల అంత ధైర్యంగా ఉండగలిగామేమో అనిపిస్తుంది. ఇల్లు అమ్మేసినప్పుడు ఎక్కడ ఉందామా అని ఆలోచిస్తుంటే, బాపు గారు ‘నాతో పాటే ఉండాలి’ అన్నారు. భాగ్యవతి అయితే మారు మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు భాగ్యవతి వల్లే వచ్చింది. ఇంతకంటె మించింది లేదు. ఆ విషయం గురించి ఎవ్వరూ ఒక్కమాట కూడా అడ్డు చెప్పలేదు. నా జీవితంలో నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకునే విషయం ఇది. రమణగారి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి అందరినీ స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి బుడుగు... బాపుగారి మేనల్లుడు బాగా అల్లరి చేస్తుండేవాడు. ఇకనేం డెన్నిస్ ద మినేస్ పాత్రల ఆధారంగా బుడుగు పాత్ర పుట్టుకు వచ్చింది. రమణగారిని వాళ్ల నాన్నగారు వాళ్లు బుడుగు అని, మా పెద్ద ఆడపడుచుని బుల్లులు అని పిలిచేవారు. అలా ఆ పాత్ర పేరు నిలబడిపోయింది. మూత ఉండకూడదు... రమణ గారికి భోజనం చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టకూడదు. అలా ఉంటే ఆయన అన్నం తినడానికి ఇష్టపడరు. మూత తీసి ఉంచి, కొద్ది కొద్దిగా వడ్డిస్తూ ఉంటే తింటారు. అప్పుడే తనకు తృప్తిగా భోజనం చేసినట్టు అనిపిస్తుందనేవారు. -
అదో తుత్తి!
బాపు-రమణలు తీర్చిదిద్దిన సుందరచిత్రం ‘మిష్టర్ పెళ్లాం’. ఇందులో గోపాలకృష్ణ పాత్రకు నత్తి పెట్టకపోయుంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. చాలా వెలితిగా ఉండేది కదూ! ఆ నత్తే మనకింత తుత్తినిచ్చింది మరి. మైనస్ అనుకున్న దాన్ని కూడా ప్లస్సుగా చూపడమంటే ఇదే. ఏవీయస్ చనిపోయి ఏడాది గడిచినా చిరంజీవిగా మిగిలిపోయారంటే ఇలాంటి తుత్తి పాత్రల వల్లనే! ఈ పాత్ర పేలుతుందని ముందే అనుకున్నా! బాపు-రమణలకు సన్నిహితుడైన శ్రీరమణ ద్వారా ఏవీయస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు గుర్తు. నటనతో పాటు రచయితగా కూడా ప్రయత్నాలు చేస్తుండేవారు. మా ‘మిష్టర్ పెళ్లాం’ సిట్టింగ్స్‌కి కూడా వచ్చేవారు. ఏవీయస్ ఓ నాటకంలో తుత్తి పాత్ర చేశారట. ఆ ట్రాక్ బాపు-రమణలకు చెబితే, ఇంప్రెస్ అయ్యి ఈ స్క్రిప్టులో అందంగా ఇమిడ్చారు. ఆ తర్వాత ఆ పాత్రను ఏవీయస్నే చేయమన్నారు. ఈ పాత్ర బాగా పేలుతుందని షూటింగ్ దశలోనే అనుకున్నా. - గవర పార్థసారథి, నిర్మాత జామకాయలు ఇస్తే ఒకరోజు గుర్తుపెట్టు కుంటారు. మామిడి కాయలు ఇస్తే మాసమంతా తలచుకుంటారు. మరి - లెంపకాయలు ఇస్తే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎనీ డౌట్స్! ఆ రోజు గోపాలకృష్ణ చాలా బిజీగా ఉన్నాడు. మరి కాస్సేపట్లో బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ మీటింగాయె! తను మేనేజింగ్ డెరైక్టరు. తండ్రి చైర్మను. ఇలాంటి గజిబిజీ టైములో ఫోను మోగింది. అవతల పి.ఎ.... ‘‘సార్ మీ కోసం లేడీసొచ్చారు’’. గోపాలకృష్ణ అవాక్కయ్యాడు. ‘‘ఎ... ఎంతమంది?’’ అనడిగాడు. పి.ఎ. ఫకాలున నవ్వేసి ‘‘ఓహో... లేడీసంటే బోలెడంత మంది అనుకున్నారా? ఒక్కరే’’ అని చెప్పాడు. ‘‘ఏ... ఏం పేరు... ఎందుకొచ్చారో కనుక్కో?’’ ఆర్డరేశాడు గోపాలకృష్ణ. ‘‘ఎవరో శివంగి అట సార్’’ అని పి.ఎ. చెప్పగానే గోపాలకృష్ణ ఒక్కసారి తన కుడి చెంప తడుముకున్నాడు. అతని కళ్ల ముందు ఓ పిక్చర్ కనబడింది. శివంగి అంటే ఝాన్సీలక్ష్మి. ఇంటర్లో క్లాసుమేటు. ‘‘ఆమెను తీసుకుని నా చా... ఛాంబర్‌కి రా!’’ అని పురమాయించేశాడు. శివంగిని చూడగానే గోపాలకృష్ణ కళ్లు మెరిశాయి. ఒక్కసారి కాలేజీ డేస్ అన్నీ గిర్రున గుర్తొచ్చాయి. అతని ఉత్సాహం, చిన్నపిల్లాడిలా సంబరపడటం చూసి ‘‘నువ్వేం మారలేదు గోపాల్’’ అంది శివంగి అనబడే ఝాన్సీలక్ష్మి. ఈలోగా కాఫీ వచ్చింది. ‘‘ఎ... ఎన్నాళ్లయ్యింది శివంగీ... నిన్ను చూసి! ఎక్కడున్నావ్? మీ ఆయనేం చేస్తుంటాడు? పిల్లలా?’’ అని టకటకా ప్రశ్నలు సంధించాడు గోపాలకృష్ణ. కాఫీ సిప్ చేస్తూనే తన గురించి చెప్పింది శివంగి. అలా ఇద్దరూ కాసేపు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘‘శివంగి అనగానే టక్కున గుర్తుపట్టేశావ్?’’ అంది శివంగి చిలిపిగా. ‘‘ఎ... ఎందుకు పట్టను శివంగీ. నువ్విచ్చిన లెంపకాయ అంత ఈజీగా మరిచిపోతానా? నన్ను గుర్తుంచుకుని ఇంత దూరం వచ్చావ్. నాకదే తుత్తి’’ చెప్పాడు గోపాలకృష్ణ. శివంగి కొంచెం కన్ఫ్యూజింగ్గా ‘‘తుత్తి ఏంటి?’’ అడిగింది. ‘‘తుత్తి... తుత్తి... శాటిస్ఫేక్షన్’’ చెప్పాడతను. ‘‘ఓహో... యూ మీన్ తృప్తి’’ అందామె నవ్వుతూ. చిన్నప్పటి ఈ క్లాస్మేట్ తన కంపెనీలో ఉద్యోగాని కొచ్చిందని తెలియగానే గోపాలకృష్ణ అగ్గగ్గలాడిపోయాడు. ఫ్రెండ్‌కు ఏ ఉద్యోగం ఇవ్వడానికైనా తాను రెడీ. ఈలోగా మీటింగు మొదలైంది. చైర్మన్, ఇంకొందరు డెరైక్టర్లు రెడీ. కంపెనీ సేల్స్ పెంచడానికి ఎవడో ఒకతను బోడి సలహా ఇచ్చేసరికి, శివంగి పగలబడి నవ్వేసింది. చైర్మన్‌కి కోపం వచ్చింది. మిగతా డెరైక్టర్లూ సేమ్ టూ సేమ్. ‘‘నా ఫ్రెండు’’ అంటూ గోపాలకృష్ణ ఏదో కవర్ చేయబోయాడు. చైర్మన్ ఊరుకోలేదు. ‘‘నువ్వీ మీటింగ్‌కి ఎందుకొచ్చావని అడగడం లేదు. ఎందుకు నవ్వావో చెప్పు’’ అని చైర్మన్ గద్దించాడు. ‘‘మీ కంపెనీ సేల్స్ పెంచడానికి మీరు పడుతున్న తిప్పలు చూసి నవ్వొచ్చింది. ఓ మధ్య తరగతి గృహిణిగా నేను కొన్ని సలహాలు చెప్తాను. ఇలా పాటించి చూడండి’’ అంటూ శివంగి చకచకా చిట్కాలు చెప్పేసింది. చైర్మన్ వండరైపోయాడు. ‘‘మా అన్నపూర్ణ ఫుడ్ కార్పొరేషన్ సేల్స్ డిపార్ట్మెంట్కి నిన్ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నా. వన్ ఇయర్ కాంట్రాక్ట్. నెలకు పదివేల జీతం... క్వార్టర్స్... ఫోను... కారు... ఇస్తాం’’ అని చెప్పి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ! ఆ తర్వాత రోజు - శివంగిని ఆఫీసుకు తీసుకు రావడానికి స్వయంగా ఇంటికి వెళ్లాడు గోపాలకృష్ణ. శివంగి భర్త బాలాజీని పరిచయం చేసుకున్నాడు. భార్యకు ఇంత పెద్ద ఉద్యోగం రావడం బాలాజీకి కడుపుమంటగా ఉంది. దానికి తోడు గోపాలకృష్ణ ఇంటికి రావడంతో ఒళ్లు మంటగా ఉంది. అందుకే గోపాలకృష్ణపై ఎన్నో చెణుకులు. చివరకు అతని నత్తిని కూడా అనుకరించాడు. పాపం గోపాలకృష్ణ కల్మషం లేనివాడు. ఈ కడుపుమంటలు, ఉక్రోషాల గురించి అస్సలు తెలియవు. ఝాన్సీ తన ఫ్రెండు. ఝాన్సీ భర్త కూడా తన ఫ్రెండే. ఫ్రెండ్ కాకపోతే ఇంకెవరు కామెంట్ చేస్తారు. గోపాలకృష్ణ ఆఫీసు ఎంత విశాలమో, అతని హృదయమూ అంతే విశాలం! గోపాలకృష్ణ కంపెనీలో కృష్ణాష్టమిని ప్రతి ఏటా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఆఫీసు వాళ్లంతా కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందే! శివంగికి చెబితే సరిపోతుంది. కానీ కర్టెసీ కొద్దీ బాలాజీని తనే స్వయంగా ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేశాడు గోపాలకృష్ణ. బాలాజీ నిజానికి మంచివాడే. కానీ అసూయ ఆ మంచితనాన్ని డామినేట్ చేసేస్తోంది. దానికి తోడు గోపాలకృష్ణ-ఝాన్సీల ఫ్రెండ్షిప్ పుండు మీద కారం చల్లుతోంది. గోపాలకృష్ణ కూడా సతీసమేతంగా ఆ ఫంక్షన్కొచ్చాడు. శివంగిని తన శ్రీమతికి ఇంట్రడ్యూస్ చేశాడు. ‘‘నన్ను లెంపకాయ కొట్టిందని చెప్పానే... తనే... శివంగి. కొంచెం ఉంటే నీ ప్లేసులోకి రావాల్సింది’’ అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. గోపాలకృష్ణ శ్రీమతి కోమలాదేవి కూడా అంతే ఇదిగా నవ్వుతూ, ‘‘ఇప్పటికి 972 సార్లు చెప్పారు మీ లెంపకాయ గురించి’’ అంది. గోపాలకృష్ణ కేరెక్టర్ అంతే. ఏదీ మనసులో దాచుకోడు. అంతా ఓపెనే. వాళ్ల కంపెనీ ప్రొడక్ట్స్‌లో కల్తీ ఉండనట్టే, ఇతని ఆలోచనల్లోనూ, మనసులోనూ కల్తీనే ఉండదు. శివంగి ఫ్యామిలీలో ఏదో డిస్ట్రబెన్స్ ఉందని గోపాల కృష్ణ కనిపెట్టాడు. కానీ బయటపడలేదు. పడితే శివంగి ఫీలవుతుంది. అందుకే శివంగికి ఓ ఫ్రెండ్‌లాగా... ఓ బ్రదర్‌లాగా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. బాలాజీ విషయంలో శివంగి తొందరపడితే క్లాసు పీకాడు. మార్గం చూపాడు. ఇప్పుడు బాలాజీ - శివంగి ఒకటయ్యారు. వాళ్ల చుట్టూ ముసురుకున్న మేఘాలన్నీ తొలగిపోయాయి. ‘‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంతో ‘తుత్తి’గా ఉంది’’ అన్నాడు గోపాలకృష్ణ. బాలాజీ కూడా తుత్తిగా నవ్వాడు. అవును... తుత్తి తోడుంటే ఆనందం మీ వెంటే! - పులగం చిన్నారాయణ తుత్తి... నా పాలిట అదృష్టం! - ఏవీఎస్ ‘అతలు కిత్నాత్తమి అంతే ఏంతంతే... (అసలు కృష్ణాష్టమి అంటే ఏంటంటే...) డైలాగ్‌ని ఫస్ట్‌షాట్‌గా తీశారు. కొద్దిసేపట్లో సీన్ తీస్తారనగా... విజయవాడలో ఉండే మా అక్కయ్య చనిపోయిందని కబురొచ్చింది. నా వల్ల షూటింగ్ క్యాన్సిల్ కాకూడదు. అందుకే బాధ దిగమింగుకుని, కన్నీళ్లు ఆపుకుని సీన్ పూర్తి చేశాను. 1993 ఆగస్టు 5న ‘మిష్టర్ పెళ్లాం’ రిలీజైంది. నా జీవితం తుత్తిగా సాగడానికి మార్గం ఏర్పడింది. నాకు ఈ పాత్ర ఎనలేని గుర్తింపునూ, స్థిరత్వాన్నీ తెచ్చిపెట్టింది. అందుకే ‘తుత్తి’ నా పాలిట అదృష్టం. (‘తుత్తి’ పాత్ర గురించి గతంలో ఏవీయస్ చెప్పిన మాటలు ) హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: మిష్టర్ పెళ్లాం (1993); డెరైక్ట్ చేసింది: బాపు సినిమా తీసింది: గవర పార్థసారథి; మాటలు రాసింది: ముళ్లపూడి వెంకటరమణ


