ఆమె విజయానికి మీసాల కృష్ణుడే సాక్షి

Actor Vijaya Nirmala Started Her Direction In Konasima - Sakshi

సాక్షి, కొత్తపేట(తూర్పు గోదావరి) : కథానాయకుడు కృష్ణ – కథానాయకి విజయనిర్మల మధ్య ప్రేమకు పునాది పడింది ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలోనే. 1967 సంవత్సరంలో నందనా ఫిలిమ్స్‌ (శ్రీరమణ చిత్ర) పతాకంపై బాపు దర్శకత్వంలో సురేష్‌కుమార్, శేషగిరిరావు నిర్మించిన ‘సాక్షి’సినిమాలో వారిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌ ఆత్రేయపురం మండలంలో పులిదిండి జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు అనుకున్న గ్రామం గురించి ఓ మ్యాప్‌ గీసుకున్నారు. అందులో ఓ బల్లకట్టు ఉన్న ఓ కాలువ, కాలువ దగ్గర రేవులో ఓ పెద్ద చెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్లో ఓ చిన్న గుడి, గుడికో మండపం ఉండాలి. గోదావరి పరిసరాల్లో ఇరిగేషన్‌ శాఖలో పనిచేసి సీలేరు ప్రాజెక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాపు, రమణల బాల్యమిత్రుడు, రచయిత బీవీఎస్‌ రామారావును తమ మ్యాప్‌ను పోలిన ఊరును వెతకాల్సిందిగా కోరారు.

రామారావు ఉద్యోగానికి సెలవు పెట్టి అలాంటి ఊరికోసం రాజమండ్రి వచ్చి ఇరిగేషన్‌ కాంట్రాక్టర్‌గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజును ఊరిని వెతికేందుకు సాయమడిగారు. ఆ మ్యాప్‌లో ఊరిని పోలినట్టుగా తమ ఊరు పులిదిండే వుందన్నారు. ఆ సమాచారంతో బాపు, రమణలు పులిదిండి రాగా వారికి రాజు తమ ఇంట్లోనే బస ఏర్పాటుచేశారు. పులిదిండితో పాటు బొబ్బర్లంక, పిచ్చుక  లంక, ఆత్రేయపురం, ఆలమూరు, కట్టుంగ తదితర గ్రామాలను పరిశీలించారు. చివరికి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు. ఆ గ్రామంలో చాలా వరకూ షూటింగ్‌ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. 

అది 1965 ప్రాంతం.. కథలో బాగంగా దర్శకుడు బాపు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సాక్షి సినిమా పూర్తిగా జిల్లాలో పులిదిండి గ్రామంలో చిత్రీకరిస్తున్నారు. తొలిరోజు కథానాయిక విజయనిర్మల, కథానాయకుడు కృష్ణలమీద ఒక పాట చిత్రీకరిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. విజయనిర్మల అన్న ఫకీర్‌ పేరుమోసిన రౌడీ. వాడికి వ్యతిరేకంగా ఒక హత్యకేసులో కృష్ణ సాక్ష్యం చెబుతాడు. జైలు నుంచి రాగానే కృష్ణను చంపుతానని ఫకీర్‌ ప్రతిజ ్ఞచేస్తాడు. ఫకీర్‌ చెల్లెలు విజయనిర్మల కృష్ణను పెళ్ళి చేసుకోమంటుంది. ఫకీర్‌ జైలు నుంచి విడుదలయ్యాడని వార్త గ్రామంలో పొక్కింది. విజయనిర్మల తాళిబొట్టును తీసుకువచ్చి, తన మెడలో కట్టమంటుంది. మరి కొద్దిసేపటికి చచ్చిపోయేవాడికి పెళ్లేమిటి? అని కృష్ణ కంటనీరు పెట్టుకుంటాడు...

‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా నూరేళ్ళు పచ్చగా..అన్న ఆరుద్ర పాటను బాపు ఒక్కరోజులో చిత్రీకరించారు. షూటింగ్‌ జరిగిన ఆలయానికి మీసాల  కృష్ణుడి ఆలయమని పేరు.. రాజబాబు వచ్చి, ఇది పవర్‌ఫుల్‌ టెంపుల్, నిజ జీవితంలో కూడా మీరు దంపతులు అవుతారని ఆయన అన్నాడు. ఆ సమయంలో రాజబాబు ఆ మాటంటే ఏమిటా పిచ్చిమాటలు అని విజయనిర్మల కసిరారు. మూడు నాలుగు సినిమాల తరువాత వారు నిజంగానే దంపతులు అయ్యారు. గోదారమ్మవారిని కలిపింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలోనే విజయనిర్మల అక్కినేని సరసన బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. రెండు విజయవంతమైన సినిమాలే! 

విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం
విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం పడిందని కొత్తపేటకు చెందిన కవి, రచయిత షేక్‌ గౌస్‌ తెలిపారు. బాపు దర్శకత్వంలో చిత్రీకరించిన సాక్షి సినిమాలో కృష్ణతో, బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో విజయనిర్మల హీరోయిన్‌గా నటించారు. ఆ రెండు సినిమాలు కోనసీమలోనే చిత్రీకరించారు. ఆమె బాపు దర్శకత్వాన్ని గమనించి దర్శకత్వంలో మెళకువలు తెలుసుకున్నారు. ‘సాక్షి’ సినిమా పరిచయం ద్వారా కృష్ణ – విజయనిర్మల ఒకటైనదీ, ఆమె దర్శకత్వానికి బీజం పడినదీ కోనసీమలోనే అని గౌస్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top