
టైటిల్ : మిత్రమండలి
నటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: కల్యాన్ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
దర్శకుడు: విజయేందర్
సంగీతం : ఆర్. ఆర్ ధ్రువన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ ఎస్జె
విడుదల తేది: అక్టోబర్ 16, 2025
మిత్రమండలి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చారు. ఓ జాతిరత్నం ప్రియదర్శి ఇందులో హీరోగా నటించడం.. స్టార్ కమెడియన్స్ అంతా ఇతర పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు అయితే పెరిగాయి. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో బన్నీ వాసు చేసిన కామెంట్స్.. ‘ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడకండి’అంటూ నాని రేంజ్లో ప్రియదర్శి ఇచ్చిన స్టేట్‌మెంట్ ‘మిత్రమండలి’పై హైప్‌ని క్రియేట్ చేశాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం(Mithra Mandali Movie Review).

కథేంటంటే...
జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు.
ఇంపార్టెంట్ క్యారెక్టర్(సత్య) ద్వారా స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయి), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali Review) చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
కామెడీ చిత్రాలకు కథతో సంబంధం లేదు. నవ్వులు పూయించే సన్నివేశాలు ఉంటే చాలు, ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇక కథతో కూడిన కామెడీ ఉంటే.. ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారు. జంద్యాల, ఈవీవీ చిత్రాలే ఇందుకు నిదర్శనం.
కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీ పండించినా..ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి ఉదాహారణ ‘జాతిరత్నాలు’. ఈ రెండూ లేని కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’. చెప్పుకోవడానికి పెద్ద కథ లేదు.. నవ్వుకోవడానికి కామెడీ సన్నివేశాలు లేవు. కానీ ‘స్టార్’ కమెడియన్స్ అంతా ఈ చిత్రంలో ఉన్నారు.
సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చూసుకున్న ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. కామెడీ చిత్రం కదా ఆ కొత్తదనం ఆశించడం తప్పే అవుతుంది. కానీ కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలు అయినా నవ్వులు పూయించే విధంగా ఉండాలి కదా? అది లేదు.
ఒక ఫిక్షనల్ సిటీ.. కులపిచ్చి గల రాజకీయ నేత.. ఇంట్లో అమ్మాయి పారిపోవడం.. దాని వెనుక నలుగురు కుర్రాళ్లు ఉండడం.. ఈ సింపుల్ కథతో కావాల్సినంత కామెడీ పుట్టించొచ్చు. దర్శకుడు పేపర్‌పై రాసుకున్నప్పుడు కూడా ఇలాగే ఊహించొచ్చు. కానీ ఆయన ఊహకి తెర రూపం ఇవ్వడంలో మాత్రం విఫలం అయ్యాడు. కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలేవి నవ్వించలేకపోయాయి. ప్రధాన పాత్రలు చెప్పే డైలాగ్స్.. వారి ప్రవర్తన..ప్రతీదీ అతిగానే అనిపిస్తుంది.
కులపిచ్చి ఉన్న నారాయణ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసే ప్రయత్నం.. కూతురు పారిపోవడం.. నలుగురు మిత్రుల గ్యాంగ్ చేసే అల్లరి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సత్య చేసే కామెడీ ఒకటే కాస్త నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. ఛేజింగ్ సీన్, పెళ్లి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా మిత్రమండలి చేసే కామెడీ కాస్త నవ్వులు పూయిస్తే.. చాలా చోట్ల అతిగానే అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ప్రియదర్శి, రాగ్ మయూరి, విష్ణు, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్..వీళ్ల కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కామెడీ పండించగలరు. కానీ ఈ చిత్రంలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయారు. దానికి కారణం దర్శకుడు అనే చెప్పాలి. వీరి కామెడీ టైమింగ్‌ని వాడుకోవడంలో ఆయన విఫలం అయ్యాడు. ఉన్నంతలో సత్య ఒక్కడే కాస్త నవ్వించాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ఆయన చేసే కామెడీ వర్కౌట్ అయింది.
మిగతా పాత్రలన్నీ అతి చేసినట్లుగానే అనిపిస్తుంది. స్వేచ్ఛగా నిహారిక తన పరిధిమేర నటించింది. సాంకేతికంగా సినిమా ఓకే. ఆర్. ఆర్ ధ్రువన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిబ్బా నిబ్బి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.