
హైదరాబాద్ ఏపీ అసెంబ్లీలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆహ్వానం మేరకు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లామని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లడం కొరకే వెళ్లినట్లు తెలిపారు చిరంజీవి.
ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 25) అసెంబ్లీ వేదికగా మాట్లాడిన బాలకృష్ణ.. గత ప్రభుత్వం సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు తనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రధానంగా వైఎస్ జగన్‌కు కలిసేందుకు వెళ్లిన సమయంలో తనను సినీ పెద్దలు పట్టించుకోలేదన్నారు బాలకృష్ణ.
దీనిపై స్పందించిన చిరంజీవి లేఖ రూపంలో వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీలో సమస్యల కొరకు వైఎస్ జగన్‌కు కలిసేందుకు వెళ్లాం. ఆయన ఆహ్వానం మేరకే వెళ్లాం. ‘మేము పదిమంది వస్తామంటే జగన్ కూడా ఓకే చెప్పారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్‌కు వివరించాం. అసమయం వస్తే అందరం కలిసి వస్తామని చెప్పాం. జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు. కోవిడ్ వల్ల ఐదుగురు రావాలన్నారు. పదిమంది వస్తామన్నా సరేనన్నారు వైఎస్ జగన్. ఆ సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు. బాలకృష్ణను కలవాలని జెమినీ కిరణ్‌కు చెప్పా. మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు.
నారాయణమూర్తి సహా కొందరు జగన్‌ను కలిశాం. నా చొరవ వల్లే టికెట్ల ధరల పెంపునకు అంగీకరించారు. దీనికి సమావేశంలో ఉన్నవారంతా సాక్షులే. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయి. సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా మాట్లాడుతా. నేను గట్టిగా మాట్లాడితే వైఎస్ జగన్ దిగివచ్చారన్నది అంతా అబద్ధం. ఈరోజు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టే వివరణ ఇస్తున్నా’ అని లేఖ ద్వారా వివరణ ఇచ్చే యత్నం చేశారు చిరంజీవి.
