
ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రముఖ మలయాళ దర్శకుడు జెయో బేబీ స్పందించారు. ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ చిత్రానికి రెండు అవార్డులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ది కేరళ స్టోరీ చిత్రం వాస్తవాలను తప్పుగా చూపించడమే కాకుండా.. స్క్రిప్ట్, దర్శకత్వం, నటన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆయన ఆరోపించారు. ఇలాంటి సినిమాలకు అవార్డుల ప్రకటించడం వాటి విలువను తగ్గించనట్లే అవుతుందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన నేషనల్ అవార్డ్స్పై కామెంట్స్ చేశారు.
జెయో బేబీ మాట్లాడుతూ.. "అధికార పార్టీల ఎజెండాకు మద్దతు ఇచ్చే చిత్రాలకు జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. గత పదేళ్లుగా మనం ఈ పద్ధతిని చూస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్‌లను ప్రోత్సహిస్తున్నందున ఈ అవార్డులకు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోతోంది. సినిమాలను మెరిట్‌తో పరిగణించలేనప్పుడు ఈ అవార్డులు ఎందుకు?' అని ప్రశ్నించారు.
వాస్తవాలను తప్పుగా చిత్రీకరించిన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి అవార్డులు ప్రకటించడం తనను తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు. ఈ చిత్రం అంతా అసత్యాలే చూపించారని ఆరోపించారు. ఈ మూవీ స్క్రిప్ట్, దర్శకత్వం, నటన కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదన్నారు. కాగా..71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఆగస్టు 1, 2025న ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా మలయాళ దర్శకుడైన జెయో బేబీ.. ది గ్రేట్ ఇండియన్ కిటెన్, కాతల్ - ది కోర్, ఫ్రీడమ్ ఫైట్. శ్రీధన్య క్యాటరింగ్ సర్వీస్, కుంజు దైవం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మరోవైవు ది కేరళ స్టోరీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకత్వంతో పాటు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డ్స్ సాధించింది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్' చిత్రాన్ని జ్యూరీ తిరస్కరించడం పట్ల మలయాళ దర్శకుడు బ్లెస్సీ కూడా నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.