నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’.
ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో శనివారం ఈ మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది.
ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


