
మదంపట్టి రంగరాజ్ (Madhampatty Rangaraj).. తమిళనాడులో ఫేమస్ చెఫ్. కూకు విత్ కోమలి రియాలిటీ షో జడ్జిగా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడు 'మెహందీ సర్కస్' సినిమాతో వెండితెరపై హీరోగా అడుగుపెట్టాడు. ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మరే సినిమా చేయలేదు. ఇకపోతే రంగరాజ్.. భార్య శృతికి విడాకులిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. భార్యతో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలపై రంగరాజన్ ఇంతవరకు స్పందించలేదు. పైగా అది తన వ్యక్తిగత విషయం అని మౌనంగా ఉన్నాడు.
రెండో పెళ్లి
మరోవైపు సెలబ్రిటీ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డాతో రంగరాజన్ ప్రేమలో ఉన్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. సదరు డిజైనర్.. ఇతడిని నా మనిషి అని సంబోధించడంతో ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. చివరకు అదే నిజమైంది. రంగరాజ్ ఆమెను రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే పెళ్లిపీటలెక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్
గుడిలో సింపుల్‌గా జరిగిన పెళ్లి ఫోటోలను జాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం తను ఆరో నెల గర్భవతిని అని తెలిపింది. ప్రియురాలు గర్భం దాల్చడంతో రంగరాజ్ ఉన్నపళంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడన్నమాట! మరి ఈ వ్యవహారంపై అతడి మొదటి భార్య శృతి ఎలా స్పందిస్తుందో చూడాలి!
రెండో భార్య ఎవరు?
జాయ్.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 24 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్‌గా పని చేసింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా నాలుగు అవార్డులు కూడా అందుకుంది. దాదాపు 12 ఏళ్లుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. విజయ్, శివకార్తికేయన్, విష్ణు విశాల్, జయం రవి, విక్రమ్ ప్రభు, ప్రభుదేవా, అనిరుధ్ రవించందర్, రెజీనా, కేథరిన్, జీవీ ప్రకాశ్.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల దగ్గర స్టైలిస్ట్‌గా పని చేసింది.