
‘‘కూలీ’ చిత్రంలో నేను చేసిన పాత్ర వ్యక్తిగతంగా, ఒక అమ్మాయిగా నాకు బాగా కనెక్ట్ అయింది. నా పాత్రలో మంచి భావోద్వేగం ఉంది. అమ్మాయిలు నా పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. ఎంటర్‌టైన్‌మెంట్, అద్భుతమైన యాక్షన్, మంచి కథ, భావోద్వేగాలున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని శ్రుతీహాసన్ తెలిపారు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేశారు.
కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ పంచుకున్న విశేషాలు.
⇒ నేనో మ్యూజిక్ ఆల్బమ్ కోసం లోకేశ్ కనగరాజ్‌గారిని కలిశాను. ఆ ఆల్బమ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన సర్‌ప్రైజింగ్‌గా ‘కూలీ’లోని నా పాత్ర గురించి చెప్పారు. ఆయన సినిమాలంటే డార్క్, గన్స్, యాక్షన్‌తో ముడిపడి ఉంటాయి.
కానీ, ‘కూలీ’లో ఆయన చెప్పిన స్ట్రాంగ్ ఉమన్ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్‌గారి అమ్మాయిగా కనిపిస్తాను. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్... ఇలా చాలామంది స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరచి΄ోలేని అనుభూతి. ఇంతమంది సూపర్ స్టార్స్‌తో ఒకే సినిమాలో పని చేసే అవకాశం ప్రతి ఆర్టిస్ట్‌కి దొరకదు... నాకు దొరికింది. అందుకే ‘కూలీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.
⇒ నాన్నగారితో (కమల్‌హాసన్) ఆయనకు ఉన్న స్నేహం గురించి, అప్పటి వర్కింగ్ స్టైల్ గురించి ‘కూలీ’ సెట్స్‌లో చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు రజనీకాంత్‌గారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. నాగార్జునగారు తొలిసారి విలన్ పాత్ర చేశారు. తెలుగు ప్రేక్షకులందరూ ఆయన పాత్ర చూసి, చాలా సర్‌ప్రైజ్ అవుతారు. ఆమిర్ ఖాన్‌గారితో పని చేయడం స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. లోకేశ్ కనగరాజ్ క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్.
⇒ ‘కూలీ’ సినిమా పూర్తిగా చూడలేదు. నా డబ్బింగ్ వెర్షన్‌తోపాటు ఇంకొన్నిపోర్షన్స్ చూశాను... చాలా అద్భుతంగా అనిపించింది. చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగడానికి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదమే అని భావిస్తున్నాను. నేను భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించలేదు... పనిని ఎంజాయ్ చేశాను. నాకు వచ్చిన ప్రాజెక్టుకి ఎంతవరకు న్యాయం చేయాలనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ ఒక మ్యుజిషియన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులోనూ కొన్ని కథలు విన్నాను... త్వరలోనే నా కొత్త సినిమా ప్రకటన ఉంటుంది.