బాక్సాఫీస్‌ విన్నర్‌ దిశగా మ్యాడ్‌! ఏ ఓటీటీలోకి రానుందంటే? | Sakshi
Sakshi News home page

MAD Movie: బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న కామెడీ ఫిలిం.. రెట్టింపైన కలెక్షన్స్‌.. ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదంటే?

Published Sun, Oct 8 2023 4:08 PM

Mad Movie Collections and OTT Partner Details - Sakshi

సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌.. కథ, కాన్సెప్ట్‌ కొత్తగా ఉండాలి.. లేదంటే పాతదైనా కొత్తగా చెప్పాలి, జనాలను సీట్లకు అతుక్కుపోయేలా చేయాలి. కథలో లీనమయ్యేలా చేయాలి. మరీ ముఖ్యంగా ఆడియన్స్‌కు వినోదాన్ని అందించాలే తప్ప ఎక్కడా విసుగు పుట్టించకూడదు. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా సినిమా ఫ్లాప్‌.. కాదుకాదు, అట్టర్‌ఫ్లాప్‌ అని తేల్చి పడేస్తారు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల తీర్పులో మాత్రం తేడా ఉండదు! అక్టోబర్‌ 6న దాదాపు 10 దాకా సినిమాలు విడుదలయ్యాయి.

పది సినిమాలు.. ఫలితం ఎలా ఉందంటే?
వీటిలో రూల్స్‌ రంజన్‌, మామా మశ్చీంద్ర, మంత్‌ ఆఫ్‌ మధు, ఏందిరా ఈ పంచాయితీ, గన్స్‌ ట్రాన్స్‌ యాక్షన్‌, అభిరామచంద్ర, మ్యాడ్‌.. ఇలా స్ట్రయిట్‌ సినిమాలున్నాయి. అలాగే క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ 800, సిద్దార్థ్‌ చిన్నా, ఎక్సార్సిస్ట్‌ అనే డబ్బింగ్‌ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 800, చిన్నా చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ అవలేదు. మరి ఏ సినిమాకు జనాలు జై కొడుతున్నారో తెలుసా? మ్యాడ్‌. జాతిరత్నాలు తరహాలో ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది.

కలెక్షన్స్‌ డబుల్‌..
ఈ మూవీలో నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌ కుమార్‌, గోపిక ఉద్యన్‌, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించగా నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మ్యాడ్‌ తొలి రోజు రూ.1.8 కోట్లు రాబట్టగా రెండో రోజు ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. దాదాపు రూ.3 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో మ్యాడ్‌ మూవీకి రెండు రోజుల్లోనే రూ.4.7 కోట్లు వచ్చిపడ్డాయి. బాక్సాఫీస్‌ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ మొదటి వారంలో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అంజలి పవన్‌? వీడియోతో క్లారిటీ ఇచ్చిన నటి

Advertisement
 
Advertisement