'చంపేస్తామని బెదిరించారు'..లపత్తా లేడీస్ నటుడి ఆవేదన | Laapataa Ladies actor Satendra Soni accuses filmmaker of assault | Sakshi
Sakshi News home page

'చంపేస్తామని బెదిరించారు'..లపత్తా లేడీస్ నటుడి ఆవేదన

Jun 28 2026 1:06 PM | Updated on Jun 28 2026 1:19 PM

Laapataa Ladies actor Satendra Soni accuses filmmaker of assault

బాలీవుడ్ మూవీ లపత్తా లేడీస్‌ పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. కిరణ్‌ రావు తెరకెక్కించిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. చిన్న సినిమా అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లోనూ ఈ సినిమా సత్తా చాటింది. ఏకంగా 13 విభాగాల్లో అవార్డులను ఎగరేసుకుపోయింది. ఈ సూపర్ హిట్‌ మూవీలో సతేంద్ర సోని కీలక పాత్రలో కనిపించారు. లాపతా లేడీస్, మీర్జాపూర్ చిత్రాలతో ఫేమస్ అయిన సతేంద్ర సోనీ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఓ మూవీ షూటింగ్‌లో తనను డైరెక్టర్ బెదిరించారని సతేంద్ర సోనీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు డబ్బులు ఇవ్వకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఎనిమిది రోజుల పనికి డబ్బు చెల్లించమని అడిగినందుకు చిత్రనిర్మాత పుష్పేంద్ర సింగ్ తనను మూవీ నుంచి తొలగించారని కన్నీటిపర్యంతమయ్యారు. తనతో పాటు పలువురు సహాయ నటులను ప్రాజెక్ట్ నుంచి తొలగించారని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఈ వీడియోలో సతేంద్ర సోని మాట్లాడాతూ.. హలో, నా పేరు సతేంద్ర సోని. నేను 'పెడ్ పల్కి' అనే సినిమా షూటింగ్ కోసం మధ్యప్రదేశ్‌లోని మైహార్ వచ్చా. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత పుష్పేంద్ర సింగ్ నాకు 50 వేలు ‍‍అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన డబ్బు షూటింగ్ సమయంలో చెల్లిస్తామని మాట ఇచ్చారు. మొత్తం 10 రోజుల షూటింగ్.. ఇప్పటికే 8 రోజులు పూర్తయింది. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే ప్యాకప్ చేసుకోమన్నాడు. పది నిమిషాల్లో హోటల్ ఖాళీ చేయి.. లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అతని భార్య ప్రగతి చౌహాన్ కూడా నన్ను తిట్టి, అసభ్య పదజాలంతో దూషించింది. దీంతో నేను చాలా భయపడ్డా. భయంతో హోటల్ నుండి చెక్ అవుట్ చేశా. శ్రీధర్ దుబే, పంకజ్ శర్మ కూడా నాతోపాటే వచ్చారు. ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. చాలా కష్టపడి ముంబై చేరుకున్నా. ' అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement