లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన మతపర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన మతం వల్లే ఎనిమిదేళ్లుగా అవకాశాలు రాలేదంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రెహమాన్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.
మీలాంటి మనిషిని చూడలే
ఈ మేరకు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. ప్రియమైన ఏర్ రెహమాన్.. నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ, మీకంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు.
ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి
నా సినిమా ఒక ప్రొపగాండా అన్న భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి అని మండిపడింది. ఇదే క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.
చీరలో వెళ్లేందుకు నో
తన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం నన్ను వాడుకుంది. కానీ, ఓ రోజు అయోధ్య రామజన్మభూమికి వెళ్లేటప్పుడు మాత్రం తన చీర ఇచ్చేందుకు మసాబా నిరాకరించింది. అప్పుడు అవమానభారంతో కారులోనే ఏడ్చేశాను. ఓపక్క వీళ్లే ఇలా చేస్తుంటే ఏఆర్ రెహమాన్ మాత్రం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు అని కంగనా మండిపడింది.


