గుణశేఖర్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించిన ‘ఒక్కడు’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఛార్మినార్ సెట్ వేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత పాటలతో పాటు కొన్ని కామెడీ సీన్ల గురించి బాగా మాట్లాడుకున్నారు.ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మాణ్యం సెల్‌ఫోన్ సీన్ అయితే... ఇప్పుడు చూసినా పడి పడి నవ్వుతాం.
అందులో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మాణ్యం.. కొత్తగా సెల్‌ఫోన్ కొని.. ఆ నెంబర్‌ని తన ప్రియురాలికి చెప్పి..ఫోన్ చేయమని చెబుతాడు. అదే సమయంలో మహేశ్ బాబు గ్యాంగ్ పాస్ పోర్ట్ కోసం అక్కడికి వెళ్తారు. పాస్‌పోర్ట్ ఇవ్వకపోవడంతో..బయటకు వచ్చి ఆయనకు ఫోన్ చేసి విసిగిస్తారు. ప్రియురాలి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ధర్మవరపు.. వరుసగా రాంగ్ కాల్స్ రావడంతో చిరాకుతో ఫోన్‌ని పగలగొడతాడు. ఈ సీన్ సినిమాకు బాగా ప్లస్ అయింది.
అయితే ఈ సన్నివేశంలో ధర్మవరపు తనదైన స్టైల్లో చెప్పే 98480 32919 అనే నెంబర్ ఎవరిదో తెలుసా? ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజుదట. మహేశ్ బాబే ఈ నెంబర్ పెట్టమని దర్శకుడికి సూచించాడట. ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖరే ఈ విషయాన్ని చెప్పాడు.
‘ధర్మవరపు సుబ్రహ్మాణ్యం సీన్ కోసం ఓ ఫోన్ నెంబర్ పెట్టాలనుకున్నాం. అప్పుడు మహేశ్ బాబు వచ్చి ఎం.ఎస్. రాజుగారి నెంబర్ పెట్టేయండి అన్నారు. అప్పుడప్పుడు మహేశ్ కొంతమందిని ఇలా టీజ్ చేస్తుంటాడు. నేను వద్దని చెప్పినా.. ఆయన వినలేదు. ‘మీరు పెట్టేయండి..నేను చూసుకుంటా’ అన్నారు. అప్పుడు రాజుగారు షూటింగ్‌లో లేరు. ఆ నెంబర్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించాం. నార్మల్‌గా కాకుండా పొయెటిక్‌గా చెప్పమని ధర్మవరానికి నేనే చెప్పా. రిలీజ్ తర్వాత అది బాగా ట్రెండ్ అయింది. కొన్నాళ్ల పాటు రాజుగారికి ఫోన్ కాల్స్ వచ్చాయి. సినిమాలో లడ్డుగాడు మాట్లాడినట్లే..మాట్లాడేవారు. ఫస్ట్‌డే షో పడినప్పటి నుంచే రాజుగారికి ఫోన్లు రావడం మొదలయ్యాయి’ అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.
ఒక్కడు(Okkadu Movie) విషయానికొస్తే.. ఇందులో మహేశ్ బాబుకి జోడీగా భూమిక నటించింది. విలన్ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించాడు. 2003 జనవరి 15న రిలీజ్ అయిన ఈ చిత్రం..అప్పట్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.


