
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ తొలి రోజే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత పెద్దగా ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.30 కోట్ల లోపే నెట్ వసూళ్లు సాధించింది.
ఇక వీకెండ్ చివరి రోజు ఆదివారం కలెక్షన్లతో కలిసి నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.43 నికర వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే థగ్ లైఫ్ నాలుగు రోజుల్లో రూ.73 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ చేరుకుంది. ఈ సంఖ్య అంతకుముందు కమల్ హాసన్ నటించిన ఇండియన్-2 కంటే చాలా తక్కువగా నమోదైంది. గతేడాది విడులదైన ఇండియన్-2 నాలుగు రోజుల్లో రూ.113.55 కోట్ల నికర వసూళ్లు సాధించింది.
అయితే థగ్ లైఫ్ వసూళ్లు తగ్గడానికి కన్నడ భాష వివాదం కూడా ఓ కారణం. బెంగళూరు ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమాను నిషేధించారు. కమల్ కామెంట్స్‌తో ఈ చిత్రం షెడ్యూల్ కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని చెప్పవచ్చు. కాగా.. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతమందించారు.