కొన్ని సినిమాలు పలాన నటుడు మాత్రమే చేయగలడని ప్రేక్షకులు అంటుంటారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమా ఎంపికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ఎలాంటి మూవీ తీసిన సరే మరో నటుడుని ఆ పాత్రలో ఊహించుకోలేము. మమ్ముట్టి కెరీర్‌లో 400కి పైగా సినిమాలు చేసి, హీరో, విలన్, గ్రే షేడ్స్, బయోపిక్ పాత్రలు అన్నింటినీ సమర్థంగా పోషించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన 'కలాం కావల్' ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నిజ జీవిత సీరియల్ కిల్లర్ సయనైడ్ మోహన్ కేసు ఆధారంగా ఈ మూవీని దర్శకుడు జితిన్ కె.జోస్ తెరకెక్కించారు. ఈ సినిమాను చూడటం మొదలుపెడితే.. పూర్తి అయ్యేవరకు ఎవరూ ఆపరు. కథ ప్రారంభంలోనే హత్యలు చేసేది ఎవరు అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. కానీ, పోలీసులకు మా తెలియదు. అయినప్పటికీ చాలా ఆసక్తిగా మూవీని నిర్మించారు.
సైకో కిల్లర్ ఎలా ఉంటాడు.. వరుస హత్యలు ఎందుకు చేస్తాడు అనేది 'కలాం కావల్'లో చక్కగా చూపించాడు. ఒకరికి దోమను చంపితే సంతోషం.. మరోకరికి కోడిని కోసినప్పుడు అది గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు చూడటం సంతృప్తి. పాములో విషం ఉంటుందని తెలిసినా కూడా దానిని చంపే వరకు కొందరు ఊరుకోరు. ఇలా మన చుట్టూ ఉండే ప్రాణులను చంపడంలో కొందరిలో కనిపించే సంతోషం ఒక్కో స్థాయిలో ఉంటుంది. అయితే, కలాం కావల్ మూవీలో స్టాన్లీ దాస్ (మమ్ముట్టి)కి మాత్రం ఒంటరి మహిళలను చంపి సంతోషం పొందుతుంటాడు. వారిని ట్రాప్ చేసి తన కోరిక తీర్చుకుని చాలా సింపుల్‌గా చంపేస్తాడు. సినిమా ప్రారంభం నుంచే మొదలైన ఈ పరంపర.. చివరి వరకు కొనసాగుతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా దర్శకుడు జితిన్ కె.జోస్ మెప్పించాడు.

స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) ఒంటరిగా ఉండే మహిళలను ట్రాప్ చేసి తన వలలో వేసుకుంటాడు. జీవితంలో విసిగిపోయిన వారికి కొత్త లైఫ్ ఇస్తానని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు వారితో గడిపి అదే రోజున హత్య చేస్తాడు. అయితే, ఒకరి ఫిర్యాదు వల్ల కథలో మలుపు తిరుగుతుంది. దీంతో ఈ కేసులోకి ఎస్సై జయకృష్ణన్ (వినాయకన్) ఎంట్రీ ఇస్తాడు. పోలీసులు ఎంత వేగంగా కేసును ధర్యాప్తు చేస్తున్నారో అంతే స్పీడ్‌గా స్టాన్లీ దాస్ ఆలోచన తీరు ఉంటుంది. అయితే, చాలా కూల్‌గా హత్యలు చేస్తాడు. అయితే, స్టాన్లీదాస్ ఎందుకు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి చంపేస్తున్నాడు.. కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతం వారినే ట్రాప్ చేయడానికి కారణం ఏంటి..? వరుసగా హత్యలు చేస్తూ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు..? ఫైనల్‌గా ఎస్సై జయకృష్ణన్ కేసును క్లోజ్ చేశాడా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
'కలాం కావల్' కథ 2000 సంవత్సరంలో జరిగినట్లు దర్శకుడు చూపుతాడు. దీంతో ఎక్కడా లాజిక్ మిస్ కాదు. నేటి తరం మాదిరి సీసీ కెమెరాలు వంటివి ఆరోజుల్లో లేవు. మొబైల్స్ కనెక్టివిటీ కూడా అప్పుడప్పుడే వినియోగంలోకి మొదలయ్యాయి. దీంతో సినిమాపై సానుకూలత కలిగేలా సీన్లు ఉంటాయి. మూవీ ప్రారంభంలోనే స్టాన్లీదాస్ ఒక మహిళను లోబరుచుకుని హత్య చేసే సీన్ ఉంటుంది. హంతకుడు ఎలాంటి వాడు అనేది అక్కడే ప్రేక్షకుడికి అర్థమయిపోతుంది. స్టాన్లీ చేస్తున్న హత్యలు వరుసగా జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో జయకృష్ణన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంటుంది. టెక్నాలజీ లేని కాలంలో ఇలాంటి కేసులను పోలీసులు ఎలా చేధించేవారో చక్కగా చూపించారు.
స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) హంతకుడు మాత్రమే కాదు... ఇంటర్వెల్‌లో తన అసలు రూపం ఏంటి అనేది ఒక ట్విస్ట్‌తో దర్శకుడు షాకిచ్చాడు. జయకృష్ణన్‌తోనే ఉంటూ పోలీసుల ప్లాన్స్ ఏంటి అనేది తెలుసుకుని చాలా తెలివిగా తప్పించుకుంటాడు. పోలీసులు రెండు అడుగులు వేస్తే.. స్టాన్లీ పది అడుగులు వేస్తాడు. అయితే, ఫైనల్‌గా స్టాన్లీనే ఈ హత్యలకు కారణం అని జయకృష్ణన్ కనుగునే సీన్ మూవీకే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వరుస ట్విస్ట్‌లతో సాగే ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో సైకో కిల్లర్ స్టాన్లీగా మమ్ముట్టి అదరగొట్టేశాడు. ‘జైలర్’లో వర్మగా తన నటనతో మెప్పించిన వినాయకన్ ఈ మూవీలో మరోస్థాయిలో గుర్తుండిపోయేలా నటించాడు. సోనీ లివ్‌లో ఈ మూవీని కుటుంబంతో పాటుగా చూడొచ్చు. ఎలాంటి అసభ్యత లేదు. వరుస హత్యలు ఉన్నా రక్తపు మరకలు కనిపించకుండా దర్శకుడు తెరకెక్కించారు.


