
లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం తనను ఎంతగానో కలిచివేసిందంటున్నాడు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోటతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
శకం ముగిసింది
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మరణంతో ఒక శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో ఆయనతో కలిసి పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మహనీయుడైన నటుడితో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఎక్కడున్నా తన చల్లని చూపు మనందరిపై ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
కోట శ్రీనివాసరావు ఒక్కరే
యాక్టింగ్ ఇండస్ట్రీకి, నటనకు నిలువెత్తురూపం కోట శ్రీనివాసరావుగారు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక్కరే.. మరో కోట పుట్టరు, రారు! అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన మనకు మిగిల్చి వెళ్లిన ఎన్నో అద్భుతమైన పాత్రల్ని, సినిమాలను ప్రేక్షకులు చూసి ఆస్వాదించండి అంటూ తారక్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా 750కి పైగా సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు ఆదివారం (జూలై 13న) కన్నుమూశారు.

చదవండి: Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?